KTR | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి, ఎస్టీల రిజర్వేషన్లు 12 శాతానికి పెంచుతామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి నమ్మకద్రోహం చేసింది. మే, జూన్ నెలల్లో ఎస్సీ, ఎస్టీల హకుల కోసం భారీ సభలు నిర్వహిస్తాం. కాంగ్రెస్ చేసిన మోసాలను గిరిజన తండాలు, దళితవాడలకు తీసుకెళ్లి ఎండగడుదాం.
– కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ను కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం తప్ప ఎప్పుడూ గౌరవించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ కాలంలో ఆయనకు భారతరత్న ఇవ్వలేదని, కాంగ్రెస్సేతర ప్రభుత్వం వచ్చినప్పుడే ఆయనకు ఆ గౌరవం దకిందని గుర్తుచేశారు. చివరకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన ఫొటో పెట్టేందుకు కూడా కాంగ్రెస్ ఒప్పుకోలేదని మండిపడ్డారు. 1952, 1954లో ఆయన పార్లమెంట్‌కు రాకుండా ఆ పార్టీ కుట్రలు చేసి ఓడించిందని విమర్శించారు. హిందూ కోడ్ బిల్లు విషయంలో మహిళలకు హకులు కల్పించాలని ఆయన చూస్తే, దానిని అడ్డుకున్నందుకు నిరసనగా అంబేద్కర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. అంబేద్కర్ అంటే బీజేపీకి కూడా పట్టదని.. కులాలు, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ అనే బాబాసాహెబ్ నినాదంతో కేసీఆర్ లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించి, అడుగడుగునా పోరాడి చివరకు చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించారని కేటీఆర్ గుర్తుచేశారు. అంబేదర్ 135వ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో కేటీఆర్ పాల్గొని అంబేదర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్ ప్రతిష్ఠించిన 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని చూసి కాంగ్రెస్ అసూయపడుతున్నది. 2023 డిసెంబర్ 7నాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, 2024 ఏప్రిల్ 14 నాడు అంబేదర్ విగ్రహాన్ని బందీ చేసి పెట్టింది. 2025లో కూడా అదే అకసుతో, ఇది కేసీఆర్ కట్టిన విగ్రహం, కేసీఆర్ ఆనవాళ్లు అనే ఉద్దేశంతో మళ్లీ బంధించి అవమానించింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. అందుకే మొన్న బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ మీరుగానీ ఈసారి బాబాసాహెబ్‌ను మళ్లీ బందీ చేసి పెడితే, మేమే వస్తాం, వందలాదిగా, వేలాదిగా వచ్చి ఆ సంకెళ్లు బద్దలు కొడుతామని ఆ రోజు చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి, రాష్ట్ర ప్రభుత్వం అకడ ఏర్పాట్లు చేసింది. కేసీఆర్ కట్టించాడనే కారణంతో మహానుభావుడిని అవమానించడం రేవంత్ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం’ అని మండిపడ్డారు.
27 తర్వాత సభలు
ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం, జగిత్యాలలో బహిరంగ సభ రెండు కార్యక్రమాల తర్వాత ఎస్సీ, ఎస్టీల కోసం సభలు ప్రారంభిద్దామని కేటీఆర్ తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ల డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యువజన డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్.. ఇలా ప్రతి అంశంపై కాంగ్రెస్ చేసిన ప్రామిస్‌ల మీద మనం పకడ్బందీగా పోరాడాలని, డిక్లరేషన్లు విస్మరించడంపై ఆయా ప్రాంతాల్లో సభలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. 125 ఫీట్ల విగ్రహం మాత్రమే కాదు, డాక్టర్ బాబాసాహెబ్ పేరు మన సెక్రటేరియట్‌కు కేసీఆర్ పెట్టారని గుర్తుచేశారు. పార్లమెంట్ కొత్త భవనానికి కూడా అంబేదర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని చెప్పారు.
‘అంబేదర్ అంటే కొందరివాడు కాదు, ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన నాయకుడు, అణగారినవర్గాలకు గొంతు ఇచ్చిన నాయకుడు, మహిళలకు ఓటు హకు ఇచ్చిన నాయకుడు, మనకు రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకుడు. అట్లాంటి నాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్ఠించిన ఘనత కేసీఆర్‌ది. అంబేదర్ గారు మహాత్మాగాంధీతో సమానంగా అందరివాడు. జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదంతో ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుదాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ప్రభుత్వాన్ని అడుగడుగునా ఎదురొందాం’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే: సిరికొండ
అంబేద్కర్‌కు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గౌరవం ఇవ్వడం లేదని, ఆయనకు సముచిత గౌరవం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి చెప్పారు. దేశంలో ఎకడాలేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడంతో పాటు సచివాలయానికి ఆయన పేరును కేసీఆర్ పెట్టారని గుర్తుచేశారు. ఏ స్ఫూర్తితో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందో, ఏ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, అదేస్థాయిలో కిందిస్థాయి వర్గాల వరకు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు.
సమున్నత గౌరవం ఇచ్చింది కేసీఆరే: ఆర్ఎస్పీ
దేశ చరిత్రలో అంబేదర్కు ఎవరూ ఇవ్వనంత సమున్నత గౌరవం తెలంగాణలో కేసీఆర్ ఇచ్చారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. విదేశాల్లో తెలంగాణ బిడ్డలు చదువుకుంటున్నారంటే అందుకు కారణం కేసీఆరే అని పేర్కొన్నారు. దేశం ముకలుచెకలు కాకుండా ఉంది అంటే కేవలం అంబేదర్ రాసిన రాజ్యాంగం వల్లేనని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో హేట్ స్పీచ్ బిల్లుతో మనిషి హకులను కాలరాసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు.
మళ్లీ బీఆర్ఎస్ రావాలి : కొప్పుల
ఎస్సీ వర్గాల కోసం కేసీఆర్ సర్కార్ అనేక సంక్షేమ పథకాలు తెచ్చిందని, కాంగ్రెస్ సర్కార్ వాటిని అమలుచేయకుండా మోసంచేసిందని మాజీ మంత్రి కొప్పుల విమర్శించారు. అంబేదర్కు కాంగ్రెస్ గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలో రావాలని ఆకాంక్షించారు. గురుకుల పాఠశాలలు తెచ్చి పేద వర్గాలకు ధైర్యం ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
వారు దేశ సంపద : గంగుల
అంబేదర్, బాబూ జగ్జీవన్‌రామ్ వంటి మహానుభావులు దేశ సంపద అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. అంబేదర్ కలలను నిజం చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. భారతదేశంలో ఎకడా లేని విధంగా వెయ్యికి పైగా గురుకులాలు కేసీఆర్ ఏర్పాటుచేసి, బడుగు బలహీనవర్గాలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేంత వరకు కేటీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.
దళితులు, అంబేద్కర్‌ను అవమానిస్తున్న కాంగ్రెస్
దళితబంధు కింద కేసీఆర్ 10లక్షలు ఇస్తే, తాము 12లక్షలు ఇస్తామని చెప్పి ఆ సీమ్‌కు అంబేదర్ అభయహస్తం అని పేరు పెట్టి దానిని అమలుచేయకుండా అటు దళితులను, ఇటు అంబేద్కర్‌ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితబంధు, రైతుబంధు లాంటి పథకాలు తేవాలంటే నాయకుడికి కలేజా ఉండాలని, ఆ కలేజా ఉన్న నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. చేవెళ్లలో మల్లికార్జున ఖర్గేను పిలిచి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఎస్సీలకు 16 శాతం ఉన్న రిజర్వేషన్లను 18శాతానికి, ఎస్టీలకు 10శాతం నుంచి 12శాతానికి పెంచుతామని హామీ ఇచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మిగతా వర్గాలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తే, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు ఇస్తామని, స్థలం లేకపోయినా ప్రభుత్వమే ఇస్తుందని చెప్పి విస్మరించారని నిప్పులు చెరిగారు. 10వ తరగతి నుంచి పీహెచ్డీ వరకు ఇస్తామన్న నగదు ప్రోత్సాహకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఆర్టికల్-3 లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆర్టికల్-3 ప్రవేశపెట్టకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వెయ్యికి పైగా గురుకులాలు పెట్టిందని, దాదాపు 6.5 లక్షల మంది పిల్లలకు, సంవత్సరానికి ఒకొకరిపై రూ.1.25 లక్షల చొప్పున ఖర్చు చేస్తూ వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తీర్చిదిద్దాలని సంకల్పించిందని చెప్పారు. కానీ, ఇవాళ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాటిని సరిగ్గా నిర్వహించలేకపోతున్నదని, ఆ గురుకులాల్లో మరణమృదంగం మోగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆహార కల్తీ, ఆత్మహత్యల వల్ల 130 మందికిపైగా విద్యార్థులు మృత్యువాతపడటం దౌర్భాగ్యమని విమర్శించారు.
అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కేసీఆర్‌పై అక్కసుతో ఆ మహానుభావుడి విగ్రహాన్ని బందీ చేసి అవమానించింది. మొన్న బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకత్వంలో మేము చేసిన హెచ్చరిక ఫలించి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
– కేటీఆర్