సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 26: బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజవర్గంలోని తంగళ్లపళ్లి మండలం బస్వాపూర్‌కు చెందిన బాలసాని గౌరయ్య అలియాస్ సతీశ్ రెండు నెలల క్రితం ఓమన్(మస్కట్)కు వెళ్లాడు. ఏజెంట్ చెప్పిన పనికి, అక్కడి పనికి పొంతన లేకపోవడంతో ఆరోగ్యం క్షీణించి పనిచేయలేకపోయాడు. దీంతో కంపెనీ ప్రతినిధి తన పాస్‌పార్ట్ తీసుకొని ఇబ్బందులు పెట్టాడు. ఆరోగ్యం సహకరించడం లేదని, తనను స్వదేశానికి తీసుకెళ్లాలని, ఏజెంట్ మోసం చేశాడని వాపోతూ సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ చేయగా ఆ వీడియో వైరల్‌గా మారింది. బీఆర్ఎస్ నేతల ద్వారా విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్..
గౌరయ్యను స్వదేశానికి తీసుకువచ్చేలా ఈ నెల 12న ఓమన్ ఎంబసీకి లేఖ రాశారు. గౌరయ్యను క్షేమంగా ఇంటికి చేరేలా చూడాలని, న్యాయసహాయం చేయాలని సామాజిక సేవ కార్యకర్త షేక్ అహ్మద్‌ను కోరారు. దీంతో ఆయన ఎంబసీ అధికారులు, కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఎట్టకేలకు కంపెనీ నిర్వాహకులు పాస్‌పోర్ట్ ఇవ్వగా గౌరయ్యను స్వదేశానికి తీసుకురావడానికి కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. గౌరయ్య టికెట్‌కు సైతం ఆ యన అకౌంట్‌కు పంపించారు. గౌరయ్య సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నాడు. అతడిని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు స్థానిక బీఆర్ఎస్ నేతలు ఎయిర్‌పోర్టు వెళ్లనున్నారు.