హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సును అడ్డుకొని, నిరుద్యోగ యువత గొంతు నొక్కేందుకు యత్నించిన సర్కార్ కుట్రలు పటాపంచలయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సభను అడ్డుకొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కుటిలయత్నాన్ని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన ఎండగట్టారు. సదస్సుకు కాంగ్రెస్ అనుమతి నిరాకరిస్తే, ప్రజాస్వామిక హక్కులను కాపాడుతూ గౌరవ హైకోర్టు అనుమతిచ్చిందని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా, నిర్బంధాలు విధించినా కేసీఆర్ నేతృత్వంలోని గులాబీ దళం యువత తరఫున గళం విప్పుతూనే ఉంటుందని తేల్చిచెప్పారు. ‘యువతీయువకుల్లారా పెద్దసంఖ్యలో తరలిండి.. నాడు యూ త్ డిక్లరేషన్ పేరిట మోసం చేసిన కాంగ్రెస్ మోసాలను ఎండగడుదాం’ అని పిలుపునిచ్చారు. దగాచేసిన రేవం త్ సర్కార్ మెడలువంచి నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ల అమలుకు జంగ్‌సైరన్ పూరిద్దామని స్పష్టంచేశారు.
నిరుద్యోగుల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను తాము ఎండగడుతామనే భయంతోనే కాంగ్రెస్ సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సును అడ్డుకొనేందుకు ప్రభుత్వం, పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించాయని వారు మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో వారు మాట్లాడారు. సదస్సు కోసం నెల రోజుల క్రితమే కలెక్టర్, సీపీలకు దరఖాస్తు చేసి నిబంధనల ప్రకారం అన్ని షరతులను పూర్తిచేసినా సీఎం ఆఫీస్ ఆదేశాలతో పోలీసులు అనుమత్వికుండా అడ్డుకొనే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష పార్టీల సభలకు సైతం స్వేచ్ఛగా అనుమతులు ఇచ్చామని గుర్తుచేశారు.
రెండు లక్షల ఉద్యోగాల ఇస్తామని నమ్మించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ధ్వజమెత్తారు. వయోపరిమితి సడలింపు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అంశాల్లో విద్యార్థులను వేధిస్తున్నారని మండిపడ్డారు. యువతను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పతనం తప్పదని ఆయన హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, మాజీ చైర్మన్ బాలమల్లు, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ నర్సింహగౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ బీఆర్ఎస్ నేతలు రాఘవ, అమృతలాల్ హన్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.