పొంగులేటీ!.. గొప్పలకు పోవడం కాదు. దమ్ముంటే మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్నీ అమలు చేస్తామని ప్రతినబూనండి. మీకు చిత్తశుద్ధి, సత్తా ఉంటే చేసిన చాలెంజ్‌కు కట్టుబడి ఉండాలె. 20లక్షల ఇండ్లు కట్టినంకనే ఓట్ల అడుగాలె. చాలెంజ్ విసరడం, ఆపై పారి పోవడం నీతిలేని కాంగ్రెస్ నేతలకు మొదటినుంచీ అలవాటే.
– కేటీఆర్
హైదరాబాద్, మే 28(నమస్తే తెలంగాణ): ‘పొంగులేటి.. చాలెంజ్ చేయడం కాదు.. చేతనైతే చేసి చూపించు.. దమ్ముంటే 20లక్షల ఇండ్లు ఇచ్చిన తర్వాతే ఓట్లు ఓట్లడుగుతానన్న మాట మీద నిలబడు.. ఆ తర్వాతే ప్రజల దగ్గరికి వెళ్లాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. అయినా చాలెంజ్ విసరడం, తోకముడవడం, ఆపై పారిపోవడం నీతిలేని కాంగ్రెస్ నేతలకు మొదటినుంచీ అలవాటేనని దెప్పిపొడిచారు. 20లక్షల ఇండ్లు కట్టించిన తర్వాతే ఓట్లు అడుగుతామని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విసిరిన చాలెంజ్‌పై గురువారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని తన పోస్ట్‌కు ట్యాగ్ చేసి కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శల వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. పౌరుషం ఉంటే మాటకు కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పారు. కేసీఆర్ పాలనలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వివరాలు వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లపై మాట తప్పిన కాంగ్రెస్ వైఖరిని కడిగిపారేశారు.
ఆత్మగౌరవ గృహాలు కట్టిన ఆత్మగౌరవ పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ ఉద్ఘాటించారు. 14 ఏండ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించామని, ప్రజల మద్దతుతో అధికారం చేపట్టి పేదల స్వగృహ స్వప్నాలను సాకారం చేశామని గుర్తుచేశారు. డబ్బా ఇండ్లు కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు అంకురార్పణ చేసి, హైదరాబాద్ మహానగరంలో ఏకంగా లక్ష ఇండ్లు నిర్మించిన ఘనత తమదేనని చెప్పారు. తాము రూ.70 వేలతో గృహాలు నిర్మించలేదని, నాడు కట్టిన ఇల్లు ఏడు ఇందిరమ్మ ఇండ్లతో సమానమని స్పష్టంచేశారు. ‘రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని సాహసంతో, 60 ఏండ్లు ఏలిన పార్టీలకు రాని ఆలోచనతో దేశానికి నమూనాగా అందమైన ఇండ్లను కట్టి చూపించాం.. మీకు చిత్తశుద్ధి, సత్తా, ప్రజలపై ప్రేమ ఉంటే అంతకుమించి హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలి’ అని డిమాండ్ చేశారు.
గృహ నిర్మాణ యజ్ఞం చేసిన నిర్మాతలం మేము(బీఆర్ఎస్).. గృహ మేధ యాగం చేస్తున్న విధ్వంసకులు మీరు(కాంగ్రెస్). ఇటుకలు పేర్చి ఇండ్లు కట్టింది మేమైతే.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు ఎక్కించి కూలగొడుతున్న క్రూరులు మీరు. రెండున్నరేండ్లలో హైదరాబాద్ నగరంలో మీరు కట్టిన ఇండ్లు ఎన్ని? పడగొట్టిన ఎన్ని? దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలె.
– కేటీఆర్
రాష్ట్రవ్యాప్తంగా ఇండ్లు కట్టింది మేము(బీఆర్ఎస్) అయితే కూలగొడుతున్నది మీరు(కాంగ్రెస్) అని కేటీఆర్ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూల్చడం తప్ప ఒక్క ఇటుకైనా పేర్చలేదని మండిపడ్డారు. వీకెండ్లో కొంపలు కూల్చి వికృతానందం పొందుతున్న కాంగ్రెస్ పెద్దలు, ఇండ్ల నిర్మాణం గురించి మాట్లాడేందుకు సిగ్గుండాలని తనదైన శైలిలో దుయ్యబట్టారు. రెండున్నరేండ్లలో నగరంలో కట్టిన ఇండ్లు ఎన్ని? పడగొట్టినవి ఎన్నో ధైర్యముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నిరుడు దీపావళికి బాంబులు పేలుస్తామని, ఏదో బట్టబయలు చేస్తామని చెప్పి తుస్సుమనిపించిన ‘తుపేల్ మినిస్టర్.. మిస్టర్ బాంబులేటి’ అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ‘పొంగులేటి మాదిరిగా దందాలు చేయడం.. కోహినూర్ హోటల్లో కాళ్లు పట్టుకొని ఢిల్లీ పెద్దలకు లొంగిపోయి కేసుల నుంచి తప్పించుకొనే ఉపాయాలు మాకు తెలియవు. అడ్డదారుల్లో కొడుకు కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్ట్‌లు ఇప్పించుకొనే అవినీతి కిటుకులు.. అక్రమ క్రషర్లు నడుపుతూ అడ్డగోలుగా సర్కార్ సొమ్మును కొల్లగొట్టే చిట్కాలు తమకు తెలియవు.. రెవెన్యూ శాఖను అడ్డుపెట్టుకొని భూ భారతిలో బ్లాక్ లిస్ట్‌లు, బ్లాక్మెయిల్ దందాలు చేసి దండుకొనే ల్యాండ్ గేమ్స్, గూండాలను ఉసిగొల్పి సామాన్యులపై దౌర్జన్యాలు చేసి భూములను కొల్లగొట్టడం మాకు తెలియవు. బడుగు, బలహీనవర్గాల నేతల మీద అహంకారంతో పేపర్లు విసిరికొట్టం మాకు తెలియవు’ అంటూ విమర్శలు గుప్పించారు. తమకు తెలిసిందల్లా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం.. ఆత్మాభిమానంతో బతుకడం మాత్రమేనని స్పష్టంచేశారు.
పొంగులేటి.. గొప్పలకు పోవడం కాదు. దమ్ముంటే మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్నీ అమలు చేస్తామని ప్రతిన బూనాలి.. మీకు చిత్తశుద్ధి, సత్తా ఉంటే చేసిన చాలెంజ్‌కు కట్టుబడి ఉండాలి. అయినా చాలెంజ్ విసరడం, తోకముడవడం, ఆపై పారిపోవడం నీతిలేని కాంగ్రెస్ నేతలకు మొదటినుంచీ అలవాటే.
– కేటీఆర్
ప్రభుత్వం ఎన్ని పనికిమాలిన ప్రగల్భాలు పలికినా, ఎన్ని డైవర్షన్ డ్రామాలు ఆడినా 420 హామీల ఎన్నికల మోసాన్ని ఎండగట్టడం మానబోమని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్ల ఎగవేత ద్రోహాన్ని ప్రశ్నించకుండా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజాక్షేత్రంలో అడుగడుగునా కాంగ్రెస్ సర్కార్ డొల్లతనాన్ని బట్టబయలు చేస్తామని స్పష్టంచేశారు. ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వెంటపడుతామని పేర్కొన్నారు.