ఢిల్లీ: మెరుగైన శిక్షణ, అధునాతన సౌకర్యాల కోసం భారత క్రీడాకారులు కోట్లు ఖర్చుచేసి జర్మనీ, స్విట్జర్లాండ్, యూఎస్ఏ బాట పడుతుంటే.. అమెరికాకు చెందిన ఓ షూటర్ భారత్‌లో శిక్షణ పొంది తన దేశానికి వెళ్లి పతకం సాధించి ఔరా అనిపించాడు. యూఎస్ఏకు చెందిన జెఫ్ బ్రౌనింగ్ 2012 నుంచి షూటర్‌గా కొనసాగుతున్నాడు. 2023లో అతడు తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఢిల్లీలో ఉన్న ‘టాప్ గన్ షూటింగ్ అకాడమీ’లో చేరాడు.
రెండేండ్లు ఇక్కడ సాధన చేసిన జెఫ్.. నెల రోజుల క్రితం అమెరికాకు తిరిగెళ్లాడు. తాజాగా ఒహియోలో జరిగిన యూఎస్ నేషనల్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొని 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పతకం సాధించాడు. మెడల్ గెలిచాక జెఫ్ మాట్లాడుతూ.. ‘రెండేండ్లు టాప్‌గన్ అకాడమీలో సాధన చేశా. నెల రోజుల క్రితమే అమెరికాకు వచ్చి వర్జీనియా తరఫున బరిలోకి దిగి పతకం సాధించా. అకాడమీలో ఇచ్చిన శిక్షణ, కోచ్‌ల అనుభవం, వారి మార్గదర్శకత్వం నాకు అత్యున్నత స్థాయిలో పోటీపడేందుకు ఎంతగానో ఉపయోగపడింది’ అని తెలిపాడు.