కరీంనగర్, మార్చి 23 (నమస్తే తెలంగాణప్రతినిధి)/కరీంనగర్ నమస్తే తెలంగాణ: అధికారం ఉన్నా, లేకున్నా.. బీఆర్ఎస్పై అభిమానం చెక్కుచెదర లేదని నిరూపితమైంది. ఏ మాత్రం వాడి తగ్గని గులాబీ దళం తన సత్తా ఏమిటో చూపింది. తమ అభిమాన నేత కరీంనగర్ వస్తున్న విషయాన్ని తెలుసుకొని పెద్ద ఎత్తున యువత స్వచ్ఛందంగా తరలివచ్చింది. 5 కిలోమీటర్ల వరకు సాగిన ర్యాలీ ఆద్యంతం ‘జై తెలంగాణ’ ‘జై కేసీఆర్ ‘జై కేటీఆర్’ నినాదాలతో హోరెత్తింది. కేటీఆర్‌ను చూడగానే ‘సీఎం, సీఎం’ అన్న అభిమానుల నినాదాలు నింగినంటాయి.
కేటీఆర్ సహా గులాబీ నేతలపై వీధుల్లో పూల వర్షం కురిపించిన దృశ్యాలు అభిమానానికి నిలువెత్తు నిదర్శనంగా సాక్షాత్కరించాయి. వచ్చే నెల 27న వరంగల్ నగరంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సన్నాహక సభ నిర్వహణ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ వచ్చిన సందర్భంగా ఆవిష్కృతమైన దృశ్యాలివి. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్లో, తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలే కాకుండా అభిమానులు, సామాన్యులు కూడా కేటీఆర్‌ను చూసేందుకు ఆసక్తిని చూపారు.
హైదరాబాద్ నుంచి నేరుగా కరీంనగర్‌కు చేరుకున్న కేటీఆర్‌కు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. మొదట తిమ్మాపూర్ మండలం రేణికుంటలోని టోల్గేట్ వద్ద కేటీఆర్‌కు మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఘనస్వాగత పలికారు. పెద్ద సంఖ్యలో కార్లు, బైక్‌లపై యువకులు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికి రాజీవ్ రహదారి మీదుగా ర్యాలీలుగా వచ్చారు. తిమ్మాపూర్ బస్టాండ్ సమీపంలో బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రాం విగ్రహాలను ఆవిష్కరించాలని కొద్ది రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న దళిత సంఘాలకు కేటీఆర్ సంఘీభావం ప్రకటించారు. వెంటనే విగ్రహాలను ఆవిష్కరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని, లేదంటే తామే ఆ ముసుగులు తొలగిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. అక్కడి నుంచి తిమ్మాపూర్‌లోని స్థానిక నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి గెస్ట్‌హౌస్‌కు వెళ్లిన కేటీఆర్ అక్కడ కొద్దిసేపు తిమ్మాపూర్, మానకొండూర్ తదితర మండలాల కార్యకర్తలతో ముచ్చటించారు.
ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగే పార్టీ రజతోత్సవ వేడుకలకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా అల్గునూర్ మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు చేరుకున్న కేటీఆర్‌కు అక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. సిరిసిల్ల బైపాస్ మీదుగా మంకమ్మతోట వరకు చేరుకున్నారు. ఇక్కడి సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మరో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర నాయకులు వీర్ల వెంకటేశ్వర్రావు, నగర పార్టీ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.
కరీంనగర్‌లోని మంకమ్మతోటలో కేటీఆర్‌ను చూసేందుకు కార్యకర్తలతోపాటు సామాన్యులు కూడా ఎగబడ్డారు. క్రేన్ సహాయంతో భారీ గజమాలతో కేటీఆర్‌ను సత్కరిస్తుండగా, అభిమానులు, కార్యకర్తలు కేరింతలు కొట్టారు. ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దాదాపు 1,000 మోటర్ సైకిళ్లు, కార్లు ముందూ, వెనుక అనుసరిస్తుండగా కేటీఆర్ భారీ ర్యాలీ సాగింది. మంకమ్మతోట నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ వరకు భారీ ర్యాలీ సాగింది. అక్కడి నుంచి బొమ్మకల్‌లోని వీ కన్వెన్షన్‌కు కేటీఆర్ చేరుకోగానే బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు..
బొమ్మకల్‌లోని వీ కన్వెన్షన్‌లోకి కేటీఆర్ అడుగు పెట్టగానే కార్యకర్తల్లో ఒక్కసారిగా అభిమానం ఉప్పొంగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. సీఎం, సీఎం అంటూ కేరింతలు కొట్టారు. ‘జై తెలంగాణ’ ‘జై కేసీఆర్’ ‘జై కేటీఆర్’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన సభకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు సభలోపల ఎంత మందైతే ఉన్నారో బయట అంతకు రెండింతలు కనిపించారు. సభ పూర్తయిన తర్వాత కేటీఆర్‌ను కలిసేందుకు కార్యకర్తలు పోటీపడ్డారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఉత్సాహం చూపారు. మొత్తంగా బీఆర్ఎస్ సభ విజయవంతం కావడంతో శ్రేణుల్లో కొత్త జోష్ కనిపించింది.
కేసీఆర్ సార్ పాలనే బాగుండే. నీళ్ల చుక్క లేని మా భూములకు గోదారి నీళ్లు తెచ్చి, భూమికి బరువైన పంటలు పండించేలా చేసిండు. రైతుబంధు, రైతు బీమా ఇచ్చిండు. మిషన్ భగీరథ నీళ్లతో ఇంటింటికీ మంచినీళ్లు అందించిండు. కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోసి ఎండాకాలంలో కూడా చెర్లు మత్తళ్లు దుంకించిండు. సారు కృషితోనే తొండలు గుడ్లుపెట్టిన మా భూములు ఇప్పుడు బంగారంగా మారినయ్. పదేండ్ల కింద ఎకరం ధర రూ.20వేలుంటే, రెండేండ్ల కింద రూ.30 లక్షలకు పెరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుడుతోనే నీళ్ల ఎత్తిపోసుడు నిలిచింది. బాయిలు, బోర్లు అడుగంటినయి.
– కవ్వంపల్లి బానయ్య, సుల్తాన్పూర్ గ్రామం, ఎలిగేడు మండలం
ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి చెప్పిన మాయమాటలు నమ్మి ఓట్లేసినం. ఇప్పుడు గోసడుతున్నం. రైతుబంధుకు రాంరాం అన్నది. సన్న వడ్లకు బోనస్ ఇస్తలేదు. ఇదేందని అడిగినందుకు పోలీసులతో కేసులు పెట్టిస్తున్నరు. ఎలాంటి హామీలివ్వని కేసీఆర్ మాలాంటి పేద రైతులకు అవసరమైన అన్ని పథకాలు అమలు చేసిండు. కానీ రేవంత్ ప్రభు త్వం ఆ పథకాలన్నీ నిలిపేసింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేతులెత్తేసింది. ప్రజలను నట్టేట ముంచింది. ఊ అంటే, ఆ అంటే ఢిల్లీకి పోతున్న రేవంత్, కాంగ్రెస్ పెద్దల మెప్పు పొందేసరికే పుణ్యకాలం అయిపోతది.
– ఎం రఘుపతిరావు, కాట్నపల్లి, పెద్దపల్లి జిల్లా
అరచేతిలో వైకుంఠంచూపిన రేవంత్‌రెడ్డి తన చేతకాని పాలనతో మాలాంటి పేదొల్లం కటిక దరిద్రులుగా మారుతు న్నం. నీళ్లు లేక కాల్వలు, చెరువులు ఎండిపోతున్నాయి. యాసంగి పంటలన్నీ మాడిపోయి, పశువులకు మేతగా మారుతున్నాయి. కేసీఆర్ కాలంలో అడగక ముందే అన్నిపథకాలు అందినయి. రేవంత్‌రెడ్డి అధికారంలకు వస్తే మరిన్ని ఎక్కువ పథకాలు అమలు చేస్తనని చెప్పిండు. ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటివరకు ఒక్కటీ అమలు చేయలే. కేసీఆర్ పథకాలన్నీ నిలిపేసిండు. మా ఊరిలో సానమందికి రుణమాఫీ కాలేదు. నాకు రూ.1.40 లక్షల బ్యాంకు రుణమున్నా మాఫీ చేయలేదు.
– నక్క హన్మాండ్లు, రంగంపేట, వీర్నపల్లి మండలం, సిరిసిల్ల జిల్లా
అధికారం కోసం రేవంత్‌రెడ్డి హామీల మీద హామీలిస్తే, నమ్మి ఓట్లేసినం. ఇప్పుడు ఆగమైతున్నం. గ్యాస్ ఫ్రీ అన్నడు. నెలకు రూ.2,500 ఇస్తనన్నడు. ఇంటింటికీ రెండు ఫించన్లన్నడు. కాలేజీకి పోయే ఆడిపిల్లలకు స్కూటీలిస్తనన్నడు. కళ్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామంటే ఆశపడ్డం. ఇట్ల ఎన్నెన్నో ఆశలు కల్పించి కుర్చీల కూసున్నడు. అన్నీ మర్చిపోయిండు. కేసీఆర్ ఇచ్చిన అన్ని పథకాలు బందైనయి. కొన్ని పథకాలు మాత్రం పేర్లు మార్చిండు. అవి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే పంపిణీ చేస్తున్నడు. ఇదేం అన్యాయం. ఇదెక్కడి అక్రమం. ఏడాదిన్నరలోనే అల్లకల్లోలం చేసిండు.
– చొప్పరి రాజేశ్వరి, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా