హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సకల జనుల సమరభేరి మోగుతున్నది. రాష్ట్రంలోని అన్ని వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. నాడు స్వరాష్ట్రం కోసం సకల జనుల సమ్మెతో ఉద్యమించిన తెలంగాణ సమాజం.. ఇప్పుడు సర్కారు దమన నీతి మీద సమరం చేస్తున్నది. సర్కారు చేతగానితనాన్ని నిలదీస్తున్నది. పట్టింపులేని వైఖరిని ప్రశ్నిస్తున్నది. సామాన్య ప్రజల నుంచి మొదలుకొని సంఘటిత వర్గాల దాకా.. సేద్యం చేసుకునే రైతు నుంచి అంగన్వాడీల దాకా.. కళాశాలల యాజమాన్యాల నుంచి.. ఆరోగ్యశ్రీ నిర్వాహకుల దాకా అంతా సర్కారు మీద నిరసన గళమెత్తుతున్నారు. దివ్యాంగులు, హోంగార్డులు, భూ నిర్వాసితులు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు ఇలా సకల జనులంతా గొంతెత్తుతున్నారు. రెండేండ్లలోనే ఎంత మార్పు? ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం మాయమైంది. రైతును నెత్తిమీద పెట్టుకున్న సర్కారు కనుమరుగైంది.
విదేశాల్లో విద్యార్జనకూ లక్షల నిధులిచ్చిన పాలన పోయి ఫీజుల చెల్లింపునకే చేతులెత్తేసే పరిస్థితి. ఆరోగ్యశ్రీ కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నది. యూరియా అందక పంటలు పశువుల పాలవుతున్నాయి. గురుకులాల్లో పసి పిల్లల ప్రాణాలు గాల్లో దీపాలయ్యాయి. పాలన అంటే ఒక కళ. ప్రభుత్వ నిర్వహణ ఒక నైపుణ్యం. పాలనలో ప్రాధాన్యక్రమ నిర్ధారణ ఒక రాజనీతిజ్ఞత. ప్రజల అవసరాలెరిగి పాలన సాగించడమే పాలకుడి సమర్థతకు గీటురాయి. అయితే ఈ సర్కారుకు ఇవేవీ లేవు. పాలన పట్టదు. ప్రజలు గిట్టరు. నిరసనలు రుచించవు. పాలించే చేవలేదు..ప్రభుత్వాన్ని నడపడం చేతగాదు. దాని పర్యవసానంగానే కడుపు మండిన ప్రజలు రోడ్ల మీదికి వస్తున్నారు. తోలుమందం సర్కారు మీద కన్నెర్ర చేస్తున్నారు !!
ఒక్క యూరియా బస్తా కోసం ఉయ్యాలో
నాడు తెలంగాణ ప్రజల గోస బతుకమ్మ పాటల రూపంలో వ్యక్తమైంది. నేడు తెలంగాణ రైతుల యూరియా కష్టాలను కూడా బతుకమ్మ పాటల రూపంలో పాడుకునేదాకా వచ్చింది. రాష్ట్రంలో ఎరువుల కొరతపై సోమవారం కరీంనగర్ మండలం దుర్శేడులో మహిళలు వినూత్నంగా బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ‘ఒక్క యూరియా బస్తా కోసం ఉయ్యాలో.. పడిగాపులు పడుతున్నరు ఉయ్యాలో” అంటూ పాట పాడుతూ బతుకమ్మ ఆడి కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టారు. వీరికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మద్దతు పలికారు.
అంగన్వాడీల ఆక్రోశం మా బతుకులు ప్రశ్నార్థకం చేయొద్దు
ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసి తమ బతుకులను ప్రశ్నార్థకం చేయొద్దని, అంగన్వాడీల్లోనే చిన్నారులకు ప్రీ ప్రైమరీ విద్య అందించాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. సీఎం, మంత్రుల ఇండ్లను ముట్టడించారు. కొడంగల్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయం, ఇల్లు ముట్టడికి యత్నిస్తున్న అంగన్వాడీ సిబ్బందిని అడ్డుకుంటున్న పోలీసులు.
వైద్యం అందక ఆవేదన అమ్మకు చికిత్స చేయని ‘గాంధీ’!
పక్షవాతం వచ్చిన తల్లిని గాంధీ దవాఖానకు తీసుకెళ్తే బెడ్లు లేవని వైద్యులు నిరాకరించారు. కనిపించిన డాక్టర్నల్లా వేడుకున్నా కాదుపొమ్మన్నారు. ఆవేదనతో ఆ యువకుడు తన వృద్ధ తల్లిని తీసుకొని సోమవారం సచివాలయం వద్దకు వచ్చాడు. ‘సీఎం సార్.. మేం మీకు ఓటేసినం. మా అమ్మకు వైద్యం చేయించు’ అంటూ నినాదాలు చేశాడు.
పింఛన్లు ఎప్పుడు పెంచుతరు?
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రూ.6016 పింఛన్ ఇవ్వాలని దివ్యాంగులు, రూ.4016 పింఛన్ ఇవ్వాలని వృద్ధులు డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా యాచారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్న దివ్యాంగులు, వృద్ధులు.
నిరుద్యోగుల ఆగ్రహజ్వాలమన కొలువులు మనకే..
తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కాలని పోలీసు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా ఎదుట జీవో 46 ప్రతులను చింపివేసి నిరసన తెలిపారు.
కాంట్రాక్టర్ల కుతకుత
రూ. 600 కోట్ల ‘మన ఊరు-మన బడి’ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్లు మరోసారి ఆందోళనకు దిగారు. సోమవారం సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఎదుట ధర్నా చేయగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
కార్మికుల కన్నెర్ర
కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట గిరిజన ఆశ్రమ పాఠశాల కార్మికులు చేస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరింది. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఫీజు కోసం విద్యార్థుల పోరు
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని సోమవారం మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న బీఆర్ఎస్వీ విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు