హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాచపుండులా పట్టి పీడిస్తున్న ఇండ్ల క్రమబద్ధీకరణ సమస్యకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతూ జీవో 118ని విడుదల చేసిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. సరూర్నగర్లో బుధవారం నిర్వహించిన ‘మన నగరం’ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో కొన్ని నియోజకవర్గాల్లో భూములు కొని ఇండ్లు కట్టుకొని స్థిరపడ్డ కాలనీవాసులను అప్పటి పాలకులు రిజిస్ట్రేషన్ చేయకుండా, యూఎల్సీ, అసైన్డ్ భూములని వేధించారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని సదరు వ్యక్తులు ఏండ్ల తరబడి విజ్ఞప్తులు చేసినా వారు చలించలేదని చెప్పారు.
ఈ సమస్య తమ దృష్టికి రావడంతోనే వేల మంది పడుతున్న ఇబ్బందిని గుర్తించి అక్టోబర్ 28న జీవో 118 విడుదల చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జీవో ప్రయోజనాలను స్వయంగా చదివి వినిపించి బాధితులకు ఆనందాన్ని పంచారు. ఈ జీవో ప్రకారం కనీస చార్జీతో సదరు భూములను క్రమబద్ధీకరించుకోవచ్చని చెప్పారు. ఆరు నియోజకవర్గాల్లోని 44 కాలనీలకు ఇది తక్షణ ఉపశమనమని అభివర్ణించారు. దాదాపు 10వేల మందికి లబ్ధి చేకూరుస్తుందన్నారు. వెయ్యి గజాల వరకు ఉండే ప్రతి నిర్మాణాన్ని రెగ్యులరైజ్ చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం పేదలకు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసిందే తప్ప నష్టం చేయలేదని అన్నారు.
ప్రజల ముఖాల్లో చిరునవ్వు కోరుకునే సర్కార్ తమది అని చెప్పారు. ‘తెలంగాణ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పొచ్చు. ఎల్బీనగర్ చౌరస్తా 8 ఏండ్ల కింద ఎట్ల ఉండే.. ఈ రోజు ఎట్ల ఉన్నది? అదొక్కటే చాలు సర్కార్ పనితీరు చెప్పడానికి’ అని అన్నారు. రూ.12 వందల కోట్లతో ఫ్లైఓవర్లు నిర్మించామని, 450 కోట్లతో మంచి నీటిని అందించామని తెలిపారు. 113 కోట్లతో ఎస్ఎన్డీపీ చేపట్టామని తెలిపారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చేయడానికి జీవో 118 విడుదలకు కొంత సమయం తీసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మలారెడ్డి, పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.