భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే కాంగ్రెస్ నేతలు దానిని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇది ఆ పార్టీ నీతిమాలిన, నీతి బాహ్యమైన, దిగజారిన రాజకీయానికి నిదర్శనం. గోపీనాథ్ చనిపోయి ఆరు నెలలు కూడా కాలేదు. భర్తను తలచుకుని ఆమె కన్నీరు పెడితే దానిని కూడా రాజకీయం చేస్తారా?
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెలుగుచూసిన దొంగ ఓట్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీనే అసలు దొంగ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లతో దొడ్డిదారిన కాంగ్రెస్ గెలవాలనుకుంటున్నదని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదుపై మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్‌కు ఆధారాలు ఇచ్చి చర్యలు తీసుకోమని కోరితే 24 గంటలైనా ఇప్పటి వరకు స్పందన లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. విచారణ కోరినా ఇప్పటి వరకు ఉలుకుపలుకు లేదని మండిపడ్డారు. అధికారులతో కుమ్మక్కై అరాచకాలకు తెరలేపిన వారిని శిక్షించాలని కోరినా ఈసీ నుంచి సమాధానం రాలేదని పేర్కొన్నారు. ఆ దొంగ ఓట్లన్నీ తీసేయాలని, కాంగ్రెస్ అభ్యర్థి సొంత తమ్ముడికే మూడు ఓట్లు ఉండే ఇదేం ఎన్నిక? ఇదెక్కడి ఎన్నిక అని అడిగామని, న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ దొంగ ఓట్లపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం తమకు లేదని, కాబట్టి కోర్టుకు వెళ్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. దొంగ ఓట్లకు సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయని, వాటిని ప్రజల ముందు, మీడియా ముందు పెడుతున్నట్టు తెలిపారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, దారుణమైన నేరమని అన్నారు. ఎన్నికల విశ్వసనీయతను బీహార్‌లో రాహుల్‌గాంధీ ప్రశ్నించినట్టే తెలంగాణలో తాము కూడా ప్రశ్నిస్తున్నట్టు వివరించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ వెంటనే స్పందించాలని కోరారు.
1) సమగ్ర విచారణ జరపండి: ఈ దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్ సమగ్ర విచారణ చేపట్టాలి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా చేర్చిన 23 వేల ఓట్లకు సంబంధించిన వివరాలన్నీ సేకరించి లోతుగా విచారించాలి.
2) ఒకటికంటే ఎక్కువ ఉన్న ఓట్లు తొలగించాలి: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువగా ఉన్న ఓట్లను తక్షణం తొలగించాలి. ఓటర్ లిస్టులో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సోదరుల ఓట్లతో సహా ఒకే వ్యక్తిపై ఉన్న రెండు, మూడు ఓట్లను వెంటనే డిలీట్ చేయాలి. మీరు ఎలాంటి పక్షపాతం లేని ఎన్నిక జరపాలనుకుంటే ఆ ఓట్లన్నీ తక్షణం తొలగించాలి.
3) అధికారులపై చర్యలు తీసుకోండి: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతూ ఒకే పార్టీకి వంతపాడుతూ దొంగ ఓట్లను రూపొందించిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ నేతలతో చేతులు కలిపి అసహ్యకరమైన రాజకీయాలకు తెరతీసిన వారిపై తక్షణం వేటు వేయండి.
దొంగ ఓట్ల వ్యవహారంపై వెంటనే విచారణ చేయాలని, 21, 22 వరకు సమయం ఉందని, అవసరమైతే ఎన్నికలను పది రోజుల తర్వాత నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌కు కేటీఆర్ సూచించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అవసమైతే అధికారులను సస్పెండ్ చేయడమో, ట్రాన్స్ఫర్ చేయడమో చేయాలని, ఇదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు.
బీహార్‌లో ఓట్ చోరీ జరిగిందని రాహుల్‌గాంధీ అంటున్నారని, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. 23 వేల ఓట్లలో కొన్ని నిజమైనవే ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఫేక్ ఓట్లే ఉన్నట్టు చెప్పారు. కాంగ్రెస్ వాళ్లే బూత్ లెవల్ అధికారులతో కలిసి పనిచేశారని అనిపిస్తున్నదని అనుమానం వ్యక్తంచేశారు. రాహుల్‌గాంధీ కూడా ఈ విషయం మాట్లాడాలని పేర్కొన్నారు. బీహార్‌లో బీజేపీ చేస్తున్నదే రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్నదని ధ్వజమెత్తారు. నకిలీ ఓటర్ల ఇండ్లలో మూడునాలుగు ఓట్లు ఉన్నాయని, ఇల్లే లేని చోట 42 ఓట్లు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికి మూడు ఓట్లు ఉన్నాయని, దీనికి రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దొంగ ఓట్లను వెలికి తీసేందుకు వీలైనన్ని దర్వాజాలు తడతామని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నదని, అందుకే ఈ విషయంలో బీజేపీ కూడా నిశ్శబ్దంగా ఉన్నదని అన్నారు. దొంగ ఓట్లతోనే వారిక్కడ గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. ఎన్ని కథలు పడ్డా ఇక్కడ కాంగ్రెస్ వాళ్లు గెలవరని, కచ్చితంగా బీఆర్ఎస్సే మంచి మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. దొంగ ఓట్లపై మీడియా కూడా దర్యాప్తు చేయాలని కోరారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కొన్ని ఇండ్లకు తిరిగి కొన్ని గంటల్లోనే ఈ దొంగ ఓట్ల బాగోతాన్ని వెలికి తీశారని, మరి అధికారులకు ఆ మాత్రం సమయం కూడా లేదని అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీగా తాము లక్షల ఇండ్లకు చేరుకోకపోయినా ప్రజల సొమ్మును వేతనంగా తీసుకుంటున్న అధికారులు నిష్పక్షపాతంగా దొంగ ఓట్లపై విచారణ జరిపి, వాటిని డిలీట్ చేయడంతో పాటు అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్
భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే కాంగ్రెస్ నేతలు దానిని కూడా రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ పార్టీ నీతిమాలిన, నీతి బాహ్యమైన, దిగజారిన రాజకీయానికి నిదర్శనమని దుమ్మెత్తిపోశారు. గోపీనాథ్ చనిపోయి ఆరు నెలలు కూడా కాలేదని, భర్తను తలచుకుని ఆమె కన్నీరు పెడితే దానిని కూడా రాజకీయం చేయడం తగదన్నారు. భర్తను భార్య తలచుకోరా? బిడ్డలు తండ్రిని తలచుకోరా? అని ప్రశ్నించారు. కార్యకర్తల సమావేశంలో వేలాదిమందిని చూసి ఎమోషనల్ అయితే దానిని కూడా రాజకీయం చేస్తారా? అని ప్రశ్నించారు. తన తల్లి గెలుపు కోసం తిరుగుతున్న బిడ్డ మీద కూడా కేసు పెట్టారని, దీనిని బట్టి కాంగ్రెస్ ఎంత నీతిమాలిన రాజకీయం చేస్తుందో చెప్పవచ్చని అన్నారు.