KTR | ‘తమ్ముడు.. లెట్స్ డూ కుమ్ముడు’ అన్నట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ‘కొండల్, తొండల్, అనకొండల్’ అన్నట్లుగా కొండల్‌రెడ్డి, తొండల్‌రెడ్డి రాష్ట్రంపై విరుచుకుపడి దోచేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సెక్షన్ 22ఏ భూ బాధితులతో కేటీఆర్, హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలది అంతులేని దోపిడీ అని, అన్నదమ్ములది దారుణమైన భూబాగోతమని ఆరోపించారు.
తెలంగాణ రాకముందు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, భూముల పరిస్థితిపై అనేక అనుమానాలు ఉండేవని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో ఆరు నెలల్లోనే కరెంటు, మంచి నీటి సమస్యలు పరిష్కారమయ్యాయని అన్నారు. రియల్ ఎస్టేట్‌కు ఊతమిచ్చేలా కేసీఆర్ ఒకే రోజు పలు జీవోలు ఇచ్చారని తెలిపారు.
ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, బాసర నుంచి భద్రాచలం వరకు వ్యవసాయానికి పుష్కలంగా సాగునీరు అందించారని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రూ.5 లక్షలుగా ఉన్న ఎకరం భూమి విలువ రూ.50 లక్షలకు పెరిగిందన్నారు. దీంతో భూమిని నమ్ముకుంటే నష్టం జరగదనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని, ఆ నమ్మకంతోనే ప్రజలు కొంత భూమిని కొనుగోలు చేసేవారని తెలిపారు.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ‘ల్యాండ్ చోరీ’ నడుస్తోందని కేటీఆర్ ఆరోపించారు. భూమి కనిపిస్తే బుక్క పెట్టు.. జాగా కనిపిస్తే పాగా వేయ్ అన్నట్లుగా పరిస్థితి తయారైందన్నారు. గాంధీల సామంతుల పాలనలో గజానికో గజదొంగ, గుంటకో గుంటనక్క ఉన్నారని విమర్శించారు.
రాష్ట్రంలో బయటకు కనిపించేది ఒక రెవెన్యూ వ్యవస్థ అయితే.. చీకట్లో మరో సమాంతర రెవెన్యూ వ్యవస్థ నడుస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఫైళ్లు ఎవరి ఆదేశాలతో కదులుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. దళితులు, గిరిజనులకు చెందిన అసైన్డ్ భూములు మాయమవుతున్నాయని ఆరోపించారు.
లగచర్లలో తమ అల్లుడి కోసం రేవంత్‌రెడ్డి గిరిజన భూములు గుంజుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల భూములపై రేవంత్‌రెడ్డి కన్ను పడిందని, అస్మదీయుల కోసం హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని అన్నారు. పది వేల ఎకరాల భూములను కాజేసే కుట్ర జరుగుతోందని, అడ్డికి పావుశేరు లెక్కన భూములను విక్రయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మూసీ పేరుతో వేల ఎకరాలు మింగే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.
ఫార్మాసిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో భూదందా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రూ.200 కోట్ల విలువైన భూమిని రూ.7 కోట్లకే కట్టబెట్టారని అన్నారు. కేసీఆర్ పాలనలో కొంగరకలాన్‌కు ఫాక్స్‌కాన్ కంపెనీ వచ్చిందని, అక్కడ భూములకు భారీ డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. ఆ భూములపై రేవంత్‌రెడ్డి కన్ను పడిందని, వంద ఎకరాల్లోనే రూ.వెయ్యి కోట్ల మాయాజాలానికి సిద్ధపడ్డారని ఆరోపించారు.
భూములు అమ్మబోమని చెప్పినందుకు నిషేధిత జాబితాలో పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. నేరపూరిత మనస్తత్వంతో ఒక ముఠాను ఏర్పాటు చేశారని, ఆ ముఠా కనుసన్నల్లోనే 22ఏ దందా నడుస్తోందని విమర్శించారు. ధరణిలో వేలిముద్ర లేకుండా ఇంచు భూమి కూడా అటూ ఇటూ కాదని.. కానీ భూభారతిలో భూముల గోల్మాల్ జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.