Swayambhu | నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుని ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ రోజు సంయుక్త మీనన్ బర్త్ డే సందర్భంగా 40 సెకన్ల టీజర్ విడుదల చేశారు. ఇందులో వీరనారి పాత్రలో సంయుక్త కనిపించిన తీరు, కత్తి యుద్ధాలు చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇప్పటివరకు గ్లామర్, ఎమోషనల్ పాత్రల్లో కనిపించిన సంయుక్త.. ‘స్వయంభు’లో మాత్రం పూర్తి భిన్నమైన అవతారంలో కనిపించబోతున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. ‘స్వయంభు’ కథ చారిత్రక నేపథ్యంలో సాగనున్నట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. రాజ్యాలు, అంతర్యుద్ధాలు, ప్రజలను కాపాడేందుకు జరిగే పోరాటాలు, వీరత్వంతో కూడిన సన్నివేశాలతో సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో సంయుక్త పోషిస్తున్న పాత్రకు కూడా కథలో కీలకం కానుంది. చేతిలో కత్తి పట్టుకుని యుద్ధరంగంలో పోరాడుతున్న ఆమె సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీరనారి గెటప్‌లో సంయుక్త లుక్కు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.
మరో హీరోయిన్ నభా నటేశ్ కూడా ఈ సినిమాలో యువరాణి పాత్రలో కనిపించనుంది. ఆ మధ్య విడుదలైన టీజర్లో ఆమె లుక్ కూడా రాజసం ఉట్టిపడేలా ఉంది. చారిత్రక నేపథ్యానికి తగ్గట్టుగా రూపొందించిన సెట్స్, వస్త్రధారణ, పాత్రల లుక్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. నిఖిల్ కూడా తన కెరీర్లో ఇంతకు ముందు చేయని తరహా పాత్రలో కనిపించనున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు భావోద్వేగాలకు కూడా సినిమాలో ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తోంది. కమెడియన్ సునీల్ ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనేది ఆసక్తిని కలిగిస్తోంది. చారిత్రక నేపథ్యానికి భారీ యాక్షన్, విజువల్స్, డ్రామాను జోడించి సినిమాను రూపొందించినట్లు కనిపిస్తోంది.