కుటుంబ సభ్యులకు, బంధువులకు,అస్మదీయులకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చేలా వ్యవహరించబోమని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దాన్ని ఉల్లంఘించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టాన్ని తుంగలో తొక్కారు. ఆ చట్టం కింద గతంలో సోనియాగాంధీ యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో జాతీయ సలహా మండలి చైర్మన్ పదవిని, ఇటీవల జార్ఖండ్సీఎం హేమంత్ సోరెన్ పదవులు కోల్పోయారు.
-కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఫార్మా సిటీ కోసం కేసీఆర్ సర్కారు సేకరించిన 12 వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని కాదని తన అల్లుడి కోసం ఫార్మాక్లస్టర్‌ల పేరుతో రైతుల భూములు గుంజుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లుడి ఫార్మా కంపెనీ కోసం ప్రజలపై లాఠీచార్జి చేసి రైతులను జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. ఇందుకు లగచర్ల ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అడ్డగోలు విధానాలు, ధనదాహంపై కొడంగల్ ప్రజలు తిరుగుబాటు చేశారని తెలిపారు. సీఎం తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కే సెక్యూరిటీ లేకుండా పోలేని పరిస్థితి ఎదురైందని ఎద్దేవా చేశారు. మంగళవారం ఢిల్లీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీలు దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీనేత పుట్టా విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి అరాచకాన్ని ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. బావమరిది కోసం అమృత్ టెండర్ల ద్వారా అమృతం పంచి ప్రజలకు విషం పంచి, అల్లుడి ఫార్మా కంపెనీ కోసం కొడంగల్ ప్రజలను బలిపెట్టి భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌కు బీజేపీ రక్షణ కవచంగా ఉన్నదని ఆరోపించారు. 11 నెలల రేవంత్ అవినీతిపాలనలో ఒక్క విమర్శ కూడా చేయకపోవడమే అందుకు నిదర్శనమని తెలిపారు.
‘అమృత్’ అవినీతిపై నిగ్గుతేల్చాలి
అమృత్ టెండర్లలో భారీ అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కోరినట్టు చెప్పారు. బావమరిదికి అమృతం పంచి అర్హతలేని కంపెనీకి రూ. 1,137కోట్ల వర్క్‌లు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. అర్హతలేని, అడ్రస్‌లేని బావమరిది సృజన్‌రెడ్డికి చెందిన శోధ కన్స్ట్రక్షన్స్ కంపెనీ వర్క్ కట్టబెట్టారని తెలిపారు. ఆ కంపెనీకి 2020-21లో వచ్చిన లాభం కేవలం రూ. 2.5 కోట్లేనని వివరించారు. ఐహెచ్పీ అనే సంస్థ బాంబే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లకు రాసిన లేఖ ఆధారంగా ఈ విషయం వెలుగు చూసిందని ఆయన వివరించారు. రూ. 900 కోట్ల ప్యాకేజీకి సంబంధించిన పనుల్లో తాము 20 శాతం పనులు మాత్రమే చేస్తున్నామని, మిగితా పని శోధ కన్స్ట్రక్షన్స్తో కలిసి చేస్తున్నామని ఐహెచ్పీ పేర్కొన్న విషయాన్ని బయటపెట్టారు. కేవలం రూ. 2 కోట్ల నికర లాభం ఉన్న కంపెనీకి వందల కోట్ల టెండర్లను సీఎం కట్టబెట్టారని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ పేర్కొనే క్రోనీ క్యాపిటలిజానికి అమృత్టెండర్ల గోల్మాల్ చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన నేరంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పదవులు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ ఏటీఎం నుంచి కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో డబ్బు వరద పారిస్తుస్తున్నదని, కేంద్ర ఎన్నికల సంఘం దీనిని అడ్డుకోవాలని కోరారు. తెలంగాణలో మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తున్నామని మహారాష్ట్రలో రాహుల్‌గాంధీ చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ప్రధానికి ఏం అడ్డం వస్తున్నది?
పార్లమెంట్ ఎన్నికలప్పటి నుంచి కాంగ్రెస్ హై కమాండ్‌కు తెలంగాణ ఏటీఎంగా మారిందని చెప్తున్న ప్రధాని మోదీ ఇప్పటిదాకా చర్యలెందుకు తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఏటీఎం అయితే కేంద్రం ఏం చేస్తున్నది? ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్ల మీద చర్యలు తీసుకోకుండా ప్రధాని మౌనంగా ఎందుకు ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బాజాప్తా ఢిల్లీకి వస్తం..భరతం పడతాం
అమత్ పథకం కుంభకోణంపై కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు అన్ని ఆధారాలతో వివరించామని కేటీఆర్ తెలిపారు. ఈ నెల 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని, ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తామన్నారని తెలిపారు. టెండర్లు రద్దు అయ్యేదాకా విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. కేటీఆర్‌కు ఢిల్లీలో ఏం పని అని మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా తాము బాజాప్తా ఢిల్లీకి వస్తామని, ఇప్పుడే కాదు ఇక నుంచి వరుసగా వస్తాం. రేవంత్ సర్కార్ అవినీతి బండారాన్ని బయటపెడతామని తేల్చి చెప్పారు. 11 నెలల పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి 26సార్లు ఢిల్లీకి వచ్చారని, వాటితో రాష్ర్టానికి కనీసం 16 పైసలు కూడా రాలేదని విమర్శించారు. ‘మేం ఢిల్లీకి వస్తే మీకు ఎందుకు భయం. బాజాప్తా ఢిల్లీకి వస్తం. మీ భరతం పడ్తాం. విడిచిపెట్టేది లేదు’ అని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను చీల్చి చెండాడుతుంటే ప్రభుత్వానికి భయం పట్టుకున్నదని పేర్కొన్నారు. సీఎం, రెవెన్యూ మంత్రి స్కాములను బయటపెడుతూనే ఉంటామని, ఢిల్లీకి వస్తూనే ఉంటామని, అవినీతిని ఎండగడుతూనే ఉంటామని పేర్కొన్నారు.
చీకట్లో కలుస్తున్నదెవరో అందరికీ తెలుసు
పదేపదే ఢిల్లీకి వెళ్తున్న రేవంత్‌రెడ్డి, పొంగులేటి చీకట్లో ఎవరిని కలుస్తున్నారో అందరికీ తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. కోహినూర్ హోటల్లో రహస్యంగా వెళ్లి అదానీతో కలిసి కాళ్లు పట్టుకున్నారో, లేదో పొంగులేటి చెప్పాలని డిమాండ్ చేశారు. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడి జరిగి 5 వారాలైంది. దీనిపై ఇప్పటి వరకు ఈడీ కానీ, మంత్రికానీ నోరువిప్పలేదు. కారణం ఏమిటి? కౌంటింగ్ మిషన్స్ వెళ్లాయని మీడియా కోడైకూసింది. అయినా ఇప్పటికీ ఎటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం వెనుకున్నది బహిరంగ రసహ్యమేనని పేర్కొన్నారు.
గోట్ పేటెంట్ కాంగ్రెస్‌దే
రేవంత్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను గొర్రెల్లా కొనుగోలు చేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. ‘గోట్’ రికార్డు కాంగ్రెస్ పార్టీదేనని ఎద్దేవా చేశారు. ఇందిరాగాంధీ కాలం నుంచి ఇప్పటి వరకు అయారాం గయారాం సంస్కృతికి ఆద్యులు కాంగ్రెస్ వాళ్లేనని పేర్కొన్నారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే గోట్మండీ (గొర్రెల సంత)కి రావాలని కోరారు. బీఆర్ఎస్ నుంచి నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను సీఎం రేవంత్‌రెడ్డి ఇంటింటికీ తిరిగి కండువాలు కప్పారని మండిపడ్డారు.
రేవంత్ పాలనలో తెలంగాణ ఆగం
‘పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతున్నది. కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తున్న ముఖ్యమంత్రిపై లగచర్ల లగాయించి ఎదురొడ్డి పోరాడుతన్నది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మంగళవారం ఎక్స్‌వేదికగా సర్కారు వైఖరిని తూర్పారబట్టారు. హైడ్రా దౌర్జన్యాలపై జనం తిరుగుబాటు చేసున్నారని పేర్కొన్నారు. మూసీలో ఇండ్ల కూల్చివేతలపై బాధితులు దుమ్మెత్తిపోస్తున్నారని, ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిల కోసం సర్పంచులు, మాజీ సర్పంచులు నిరసన తెలుపుతున్నారని, ఉపాధిని దూరం చేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నలు ధిక్కారం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక సాయంతో ఆదుకోవాలని ఆటోడ్రైవర్లు మహాధర్నాకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. గ్రూప్స్ పరీక్షల నిర్వహణపై విద్యార్థిలోకం భగ్గుమంటున్నదని, ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాత కన్నెర్రజేస్తున్నదని, గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల బైఠాయింపు, కులగణనలో అడుగుతున్న ప్రశ్నలపై అన్నివర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నదని పేర్కొన్నారు. వెరసి తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ సర్కారు వైఖరిపై తిరగబడుతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు.
రేవంత్‌కు బీజేపీ రక్షణ కవచం
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి గురించి ఏం చెప్పినా ఆయనకు రక్షణ కవచంగా బీజేపీ నిలబడుతున్నదని తెలిపారు. రేవంత్‌రెడ్డి అవినీతిని బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు, రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఒక్కరోజైనా అవినీతిపై మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఐదు వారాల క్రితం మంత్రి పొంగులేటిపై ఈడీ దాడి చేస్తే ఇప్పటికి వరకు ఈడీ, కేంద్రం, మంత్రి ఎవరూ స్పందించకపోవడానకి
కారణమేమిటని నిలదీశారు.
కేసులకు భయపడేది లేదు ‘నేను ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్తున్నాను. నన్నేమైనా చేయదలచుకుంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. తనపై ఎటువంటి విచారణనైనా చేసుకోచ్చని, ఎన్ని సంస్థల ద్వారా విచారణ చేసుకున్నా తనకేమీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయం ఇప్పటికే చెప్పానని, తమకు ఉద్యమాలు, పోలీస్ స్టేషన్లు, జైళ్లు కొత్తకాదని కేటీఆర్ తేల్చి చెప్పారు.
పెట్టుబడులు తరలించే కుట్ర రాష్ట్రంలో పాలన చేతగాని సర్కార్ కొనసాగుతున్నదని కేటీఆర్ దుయ్యబట్టారు. హైదరాబాద్‌ను నాలుగు ముక్కలు చేయాలన్నదే రేవంత్‌రెడ్డి ఉద్దేశమని ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసి తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు బీజేపీ పాలిత రాష్ర్టాలకు తరలించే కుట్ర దాగి ఉన్నదని ఆరోపించారు. తెలంగాణ రాష్ర్టాన్ని ఎలాగైనా విఫల ప్రయోగంగా మార్చాలన్నదే కాంగ్రెస్, బీజేపీ ఎత్తుగడ అని, దాన్ని అమలు చేయడానికి రేవంత్‌రెడ్డి శాయశక్తులా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు దండుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 300 కోట్ల ప్రకటనలు ఇచ్చింది. వానకాలం రైతుబంధును రేవంత్ సర్కార్ ఇప్పటికే ఎగ్గొట్టింది. రుణమాఫీకి, పింఛన్లకు, తులం బంగారానికి, మహిళలకు రూ. 2,500 ఇచ్చేందుకు డబ్బుల్లేవు కానీ మహారాష్ట్రలో వందల కోట్లు ఖర్చు పెడుతున్నది.
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్