హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : భారీ వర్షాలు, వరదల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం కరుణ, బాధ్యతతో వ్యవహరించాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్ విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియను రీషెడ్యూల్ చేయాలని కోరారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు గ్రామ పంచాయతీ ఓటరు జాబితాను సిద్ధం చేసే షెడ్యూల్‌ను వాయిదా వేయాలని, జిల్లా అధికారులతో సంపూర్ణ సమీక్ష తర్వాత కొత్త షెడ్యూల్ ప్రకటించాలని, ఓటర్లు, అధికారులు ఇబ్బందులు పడకుండా, పారదర్శకంగా, ప్రజలు పాలుపంచుకునేలా, మానవీయ దృష్టితో ప్రక్రియ జరగాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ నేతలు మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్ కుమార్, పార్టీ లీగల్‌సెల్ నాయకులు వేణుగోపాల్, లలితారెడ్డి తదితరులు గురువారం హైదరాబాద్‌లో ఎలక్షన్ కమిషన్ సంయుక్త కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేశారు.
భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయని, పంటలు, పశు సంపదకు తీవ్ర నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ నాయకులు వాపోయారు. అనేక ప్రాంతాల్లో రోడ్లు ముంపునకు గురై, కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించాయని చెప్పారు. ఇలాంటి కష్ట సమయంలో ప్రజలను ఓటరు జాబితా ధ్రువీకరణకు రావాలని అడగడం అమానవీయమని పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోడానికి పోరాడుతున్న వేళ, పరిపాలన మొత్తం రక్షణ చర్యల్లో నిమగ్నమైన సమయంలో ఎన్నికల జాబితా తయారీ సాధ్యం కాదని, రక్షణ చర్యలతో పాటు ఎన్నికలు సాగలేవని స్పష్టంచేశారు.
ఓటరు జాబితాల తయారీలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నదని కేటీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. సర్కారు కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎలాగైనా స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు అధికార కాంగ్రెస్ కుతంత్రాలకు తెరలేపే అవకాశం ఉన్నదని చెప్పారు. ఓటరు జాబితాలో పేర్లు లేని వారు తమ అభ్యంతరాలను చెప్పుకొనేందుకు తక్కువ గడువు ఇవ్వడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని స్పష్టంచేశారు. ఈ మేరకు గురువారం పార్టీ నేతలతో టెటీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్, లీగల్ సెల్ ఇన్చార్జి సోమ భరత్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎలక్షన్ కమిషన్ సిద్ధం చేసిన ముసాయిదా ఓటరు జాబితాను గ్రామస్థాయిలోనే పరిశీలించాలని, అభ్యంతరాలుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. జాబితాలో అవకతవకలు జరిగితే పార్టీ కమిటీ దృష్టికి తేవాలని చెప్పారు. ఈ నెల 29న జిల్లాస్థాయిలో, 30న మండలస్థాయిలో ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించనున్న సమావేశాలకు బీఆర్ఎస్ జిల్లాస్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ ప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
ఆ తర్వాత అధికారుల నుంచి ముసాయిదా జాబితాను తీసుకొని గ్రామస్థాయి నాయకులకు పంపించాలని చెప్పారు. ఓట్లున్నాయో? లేదో? క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, గల్లంతైనట్టు గుర్తిస్తే ఈ నెల 31లోగా ఎంపీడీవో కార్యాలయాల్లో అభ్యంతరాలను అధికారికంగా నమోదు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుతున్న కుట్రలు, ఎత్తుగడలను ఎప్పటికప్పుడు మీడియా వేదికగా ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 2న ప్రచురించే తుది జాబితాలో అర్హులందరి ఓట్లు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకులదేనని తేల్చిచెప్పారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అపార నష్టం జరిగే ప్రమాదం ఉన్నందున శ్రేణులు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలని పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఈ నెల 28న ఓటర్ల జాబితా ముసాయిదాను, వచ్చేనెల 2న తుది ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ నెల 29న రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లాలవారీగా సమావేశాలు, 30న మండలస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని, 28 నుంచి 30 వరకు ముసాయిదాపై అభ్యంతరాల స్వీకరణ, 31న అభ్యంతరాలను పరిష్కరించాలని నిర్ణయించారు.
ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల కమిషన్ ఐదు రోజుల షెడ్యూల్ ప్రకటించగా, ఈ రోజుల్లో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు తమను, తమ ఆస్తులను కాపాడుకోవాలా? లేక ఓటర్ల జాబితా కోసం పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగలా? అని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే బీసీలను కులగణన, 42 శాతం రిజర్వేషన్లు, కమిషన్లు, బిల్లులు, ఆర్డినెన్సులతో మోసం చేసిందని విమర్శించారు. ఓటరు జాబితా ధ్రువీకరణను కూడా అల్లకల్లోలంగా చేయడం ప్రజాస్వామ్యంపై ఈ ప్రభుత్వానికున్న నిబద్ధతను మరింత బట్టబయలు చేస్తున్నదని పేర్కొన్నారు.