హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ ) : త్వరలో ఊడిపోయే ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి బీజేపీ నేతలతో రేవంత్‌రెడ్డి రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. అట్టర్‌ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడి, ఏ క్షణంలోనైనా తన సీఎం కుర్చీ చేజారే సూచనలు కనిపించడంతోనే బీజేపీతో రేవంత్ డీల్సెట్ చేసుకుంటున్నట్టు స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ బీజేపీ నేతలతో సీక్రెట్ మీటింగ్‌లు పెట్టుకోవడం దగుల్భాజీ రాజకీయమని విమర్శించారు. ఇలాంటి దికుమాలిన చిల్లర రాజకీయాన్ని తెలంగాణ గడ్డపై ఎప్పుడూ చూడలేదని ఎక్స్ వేదిగా ధ్వజమెత్తారు. ఏదో గూడుపుఠాణి చేసి తెలంగాణను ఆగం చేయడానికే ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తమ పదవులు కాపాడుకోవడానికి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే నీచ చరిత్ర కాంగ్రెస్ నాయకులకు ఉన్నదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారంటున్న రాహుల్‌గాంధీకి తమ పార్టీ ముఖ్యమంత్రి బీజేపీతో చేసుకుంటున్న చీకటి ఒప్పందాలపై స్పందించే దమ్మున్నదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్‌రెడ్డిపై చర్య తీసుకునే ధైర్యం రాహుల్‌గాంధీకి ఉన్నదా? అని నిలదీశారు. ఒకవైపు బీజేపీ నేతలతో కుస్తీపడుతున్నట్టు బయట ఫోజులు కొడుతూ, దొంగచాటుగా దోస్తీ చేయడమే కాంగ్రెస్ సంస్కృతా? అని ప్రశ్నించారు.
పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ఒక సమీక్షా సమావేశమైనా నిర్వహించే సమయంలేని సీఎంకు, ఈ రహస్య భేటీలకు మాత్రం టైం దొరకడం క్షమించలేని ద్రోహం అని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి కానీ, ఈ చీకటి మీటింగ్‌లు ఏమిటని ప్రశ్నించారు. ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని ఆగంచేసి డర్టీ పాలిటిక్స్ చేస్తున్న ఈ రాబందు రాజకీయాలను తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో సహించదని, కర్రు కాల్చి వాత పెడ్తదని హెచ్చరించారు.
సీఎం రేవంత్‌రెడ్డివి గాలి మాటలు.. గబ్బుకూతలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గల్లీలో హోదాను మరచి తిట్లు, ఢిల్లీలో చిట్చాట్లు అంటూ ఆయన రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. నీళ్లు లేక పంటలు ఎండి, పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే సాగునీటిపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చకర్లు కొడుతున్నారని విమర్శించారు. 39సార్లు ఢిల్లీ పోయి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప, సాధించిన పని, తెచ్చిన రూపాయి లేదని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ, రేవంత్ మధ్య సంబంధాలుంటే ఏంటి, ఊడితే ఏంటి? దానివల్ల తెలంగాణకు ఒరిగేదేమిటి? అని ప్రశ్నించారు.