ఆడబిడ్డల పెండ్లికి లక్ష రూపాయలు, తులం బంగారం, మహిళలకు నెలకు 2500, ఆడపిల్లలకు స్కూటీలు, రైతు కూలీలకు
12 వేలు, ఉచిత విద్యుత్తు, రూ.500 గ్యాస్ సబ్సిడీ హామీలిచ్చి ఎగ్గొట్టిన రేవంత్ సర్కార్‌కు స్థానిక ఎన్నికల్లో బుద్ధిచెప్పాలె. ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నేతల్ని నిలదీయాలె.
-కేటీఆర్
రంగారెడ్డి, ఫిబ్రవరి 18 (నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతున్నదని, రుణాలు చెల్లించలేదన్న కారణంతో రైతుల ఇండ్ల తలుపులు, కరెంటు బిల్లులు చెల్లించలేదని వ్యవసాయ మోటర్ల స్టార్టర్లు కూడా గుంజుకపోతున్నారని, పరిస్థితి ఇలాగే ఉంటే అప్పులు కట్టలేదని రేపు ఆడబిడ్డల మెడలోంచి పుస్తెల తాళ్లు కూడా తెంపుకొని పోయే దుస్థితి దాపురిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ గురించి తప్ప.. స్టేట్ గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎలాంటి సోయి లేదని ధ్వజమెత్తారు. సీఎం అండ్ బ్రదర్స్ పెద్ద ఎత్తున భూ దందాలకు పాల్పడుతున్నారని, వారు సంపాదించిన భూముల ధరలను పెంచుకొనేందుకే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వేస్తున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రైతు మహాదీక్షలో కేటీఆర్ మాట్లాడారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, ఏఒక్క రైతుకు కూడా రేవంత్ సర్కార్ రుణమాఫీ చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రుణ మాఫీయే చేసిందని, రైతులంతా వెంటనే బ్యాంకులకు వెళ్లి రెండు లక్షల రుణాలు తీసుకోవాలని, తాను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి, పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం లక్ష రూపాయలు, తులం బంగారం, మహిళలకు రూ.2500, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి పూర్తిగా గాలికొదిలేశారని పైర్ అయ్యారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు, గ్యాస్ సిలిండర్‌కు సబ్సిడీ రూ.500 వంటి హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలు చేయటం లేదని, 420 దొంగ హామీలిచ్చి నంగనాచి మాటలు చెప్పి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని నిప్పులు చెరిగారు. హామీలిచ్చి మోసం చేయటంలో రేవంత్‌రెడ్డి తనకు తానే సాటి అని ఎద్దేవాచేశారు.
బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో 12 పంట సీజన్లు వచ్చాయని, రాష్ట్రంలో 73 వేల కోట్ల రూపాయలను రైతుబంధు ద్వారా అందించిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. రైతు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రైతు బీమా కింద అందించారని, రాష్ట్రంలో మొత్తం 70 వేల మంది రైతులకు ప్రతి సీజన్‌కు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందించారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి 35 సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ర్టానికి 35 రూపాయలు కూడా తేలేదని ఎద్దేవాచేశారు.
కులగణన అంతా మోసం
రాష్ట్రంలో రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణన అంతా మోసపూరితమని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి, దాటవేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కులగణనలో తమకు జరిగిన అన్యాయంపై బీసీలంతా ముక్తకంఠంతో నిలదీస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రుణమాఫీ కాక, రైతబంధు రాక అనేకమంది చనిపోతున్నారని వాపోయారు. మరోవైపు ఆటోడ్రైవర్లు, చేనేత కార్మికులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గురుకుల విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 1,022 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని, ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.1.20 లక్షలు ఖర్చుచేసి వారికి ఉన్నత చదువులు అందించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత గురుకులాలను విస్మరించటంతో ఇప్పటి వరకు 56 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని, నాసిరకం భోజనం పెట్టడంతో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
పాలమూరును పచ్చగా చేసింది కేసీఆరే
వలసల పాలమూరును పచ్చగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతును రాజును చేయాలనే ఉదేశంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి 90 శాతం పనులు పూర్తిచేశారని, పాలమూరు జిల్లాలో అనేక ప్రాంతాలకు సాగునీరు రావటంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకున్నారని గుర్తుచేశారు. 10 శాతమే మిగిలి ఉన్న పాలమూరు ఎత్తిపోతల పథకం పనులకు పైసా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి తనమామ జైపాల్‌రెడ్డి పేరు పెట్టుకున్నా పూర్తిచేసి సాగునీరు అందించటం లేదని దుయ్యబట్టారు. పాలమూరును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో జిల్లాలో మళ్లీ కరువు ఛాయలు అలుముకున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. పాలమూరు, రంగారెడ్డి పథకాన్ని పూర్తిచేసి ఈ ప్రాంతంలో పుట్టిన రుణం తీర్చుకోవాల్సిన ముఖ్యమంత్రి మొత్తానికే పట్టించుకోకపోవటం శోచనీయమని విమర్శించారు. పుట్టి పెరిగిన కల్వకుర్తిని.. పిల్లనిచ్చిన మాడ్గులను కూడా సీఎం రేవంత్‌రెడ్డి ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, ఈ ప్రాంత ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లేయించుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత రూపాయి కూడా కేటాయించలేదని, ఇక్కడి ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని దుయ్యబట్టారు.
స్థానిక ఎన్నికల్లో రేవంత్‌కు షాక్ ఇవ్వాలి
420 హామీలిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల్లో దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని, ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీలపై నిలదీయాలని ప్రజలకు, రైతులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు రాక అనేక మంది గత సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారని, చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ దరిద్ర పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు, ఆటోడ్రైవర్లు, వృద్ధులు, వితంతువులు ముఖ్యమంత్రిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ప్రభుత్వంపై పోరు సల్పుతామని తేల్చిచెప్పారు. మహాదీక్షలో మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు విజయు డు, నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్, అంజయ్యయాదవ్, మర్రి జనార్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మిషన్‌భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, యువ నాయకుడు కార్తీక్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్‌తోనే సస్యశ్యామలం: నిరంజన్‌రెడ్డి
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పాలమూరు జిల్లా సస్యశ్యామలమైందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీరందించారని చెప్పారు. జిల్లాలో బీడు పడిన భూములన్నీ పచ్చని పంటపొలాలతో విరాజిల్లుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు, రంగారెడ్డిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు.
గుణపాఠం చెప్పాలి: శ్రీనివాస్‌గౌడ్
ప్రజలను మోసంచేసి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. హామీలు నెరవేర్చకుండా ఓట్లకోసం ఇండ్ల వద్దకు వచ్చే నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.
గురుకులాల్లో ఆర్తనాదాలు: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాలను పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, విద్యార్థులు ఆకలి చావుల పాలవుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలని, రాష్ట్రంలో 1022 గురుకులాను ఏర్పాటు చేసిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను పట్టించుకోకపోవడంతో అనేకమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వాపోయారు.
పుట్టిన ప్రాంతంపైనా సీఎంకు శ్రద్ధలేదు : మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సొంత నియోకవర్గం కల్వకుర్తిపైనా ఎలాంటి శ్రద్ధలేదని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విమర్శించారు. మహాత్మాగాంధీ ఎత్తిపోతల ద్వారా కల్వకుర్తి, వెల్దండ, వంగూరు, మాడ్గుల ప్రాంతాలకు సాగునీరు అందించిన ఘనత, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90 శాతం పూర్తిచేసిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రూ.700 కోట్లతో ఈ ప్రాంతానికి కేసీఆర్ సాగునీరు అందించారని గుర్తుచేశారు.
కాంగ్రెస్‌కు అర్హత లేదు : గువ్వల బాలరాజు
రైతులను పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అన్నారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ అమలు చేయని కాంగ్రెస్‌కు ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కులేదని ధ్వజమెత్తారు.
రియల్ ఎస్టేట్ కుదేలు
‘ఎన్నికల తర్వాత కల్వకుర్తి ప్రాంతంలో దాదాపు వెయ్యెకరాల భూమిని రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులు సంపాదించుకున్నరు. భూముల ధరలు పెంచుకోవటం కోసమే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వేస్తున్నరు. ఆ రోడ్డు సమీపంలోనే వాళ్ల భూములున్నయి. పేరుకే ఫోర్త్‌సిటీ, ఫ్యూచర్ సిటీ.. వాటి పరిసరాల్లో వేలాది ఎకరాలు ముఖ్యమంత్రి అండ్ బ్రదర్స్ కొనుగోలు చేసిండ్రు. రియల్ ఎస్టేట్‌తో ఇతరులు బాగుపడొద్దని ముఖ్యమంత్రి ఆయన సోదరులు కంకణం కట్టుకున్నరు. రియల్ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వచ్చి వేణుగోపాల్‌రెడ్డి అనే వ్యాపారి ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిం ది.’ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ, ఆమనగల్లు, మాడ్గుల ప్రాంతాల్లో సీఎం ఆయన బంధువులు, సోదరులు పెద్ద ఎత్తున భూదందాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో 12 పంట సీజన్లు వచ్చినయ్. రాష్ట్రంలో 73 వేల కోట్ల రూపాయలను రైతుబంధు ద్వారా అందించిన ఘనత కేసీఆర్‌దే. రైతు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రైతు బీమా కింద ఇచ్చిండు. రాష్ట్రంలో మొత్తం 70 వేల మంది రైతులకు ప్రతి సీజన్‌కు పెట్టుబడి సాయం అందించిండ్రు. -కేటీఆర్
హామీలిచ్చి మోసం చేయటంలో సీఎం రేవంత్‌రెడ్డి తనకు తానే సాటి.. 420 దొంగ హామీలిచ్చి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. రైతులకు 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి ఏ ఒక్క రైతుకు కూడా చేయలేదు.
– కేటీఆర్