KTR | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ‘లగచర్ల ఎస్సీ, ఎస్టీ రైతులను అక్రమంగా అరెస్టు చేశారు. స్టేషన్‌కు తీసుకెళ్లి కేసులు నమోదు చేయకుండా చిత్రహింసలు పెట్టారు. బెదిరింపులకు పాల్పడ్డారు. లగచర్ల ఆడబిడ్డలను లైంగికంగా వేధించారు. మానవ హకులను ఉల్లంఘించి పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని స్వయంగా జాతీయ మా నవ హక్కుల కమిషనే తన నివేదికలో వెల్లడించింది. స్థానిక ఎమ్మెల్యేగా, హోం మినిస్టర్‌గా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డికి ఏమాత్రం సిగ్గున్నా తక్షణం రాజీనామా చేయాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసులను విధుల నుంచి డిస్మిస్ చేయాలని, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. న్యాయం జరిగేవరకూ లగచర్ల బాధితులకు అండగా నిలబడతామని స్పష్టంచేశారు. ఎన్‌హెచ్చార్సీ నివేదిక నేపథ్యంలో లగచర్ల, హకీంపేట గ్రామస్థులు నందినగర్ నివాసంలో కేటీఆర్‌ను మంగళవారం కలిశారు.
బీఆర్ఎస్ సభకు లగచర్ల తరపున రూ.లక్ష చెక్కును విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. లగచర్లలో దళిత, గిరిజన ఆడబిడ్డలపై పోలీసులు లైంగిక వేధింపులకు, హింసకు పాల్పడ్డారని ఎన్‌హెచ్చార్సీ తేల్చిన నేపథ్యంలో దీనికి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మూడేండ్లలో మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని, ఓవరాక్షన్ చేస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఎన్హెచ్ఆర్సీ నివేదికతోనైనా సిగ్గు తెచ్చుకుని రేవంత్‌రెడ్డి ముకు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డికి మానవత్వం ఉంటే దళిత గిరిజనులపై జరిగిన అరాచకాలు, లైంగిక వేధింపులకు బాధ్యత వహించి రాజీనామా చేసి క్షమాపణ కోరేవారని, అవేవీ లేనందునే ఇంకా సీఎంగా కొనసాగుతున్నారని కేటీఆర్ విమర్శించారు.
లగచర్ల గిరిజనునలకు కృతజ్ఞతలు
బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం లగచర్ల గిరిజనులు లక్ష రూపాయల విరాళం ఇవ్వడం సంతోషంగా ఉన్నదని కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. లగచర్ల గిరిజనులను పోలీసులు దారుణంగా హింసించారని నిప్పులు చెరిగారు. అత్యంత కిరాతకంగా మానవ మృగాల మాదిరిగా కొందరు పోలీసులు రేవంత్‌రెడ్డి ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్నారని, లగచర్ల ఆడబిడ్డలతో అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. బాధితుల తరఫున ప్రశ్నించిన తమ నాయకుడు నరేందర్‌రెడ్డిని సైతం 37 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారని గుర్తుచేశారు. ప్రభుత్వ దమనకాండకు బలైన లగచర్ల రైతులు తెలంగాణ భవన్‌కు వస్తే న్యాయం దకేలా చూస్తామని బీఆర్ఎస్ తరపున మాటిచ్చామని, ఢిల్లీ దాకా తీసుకెళ్లి మానవ హకుల కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌ను కలిశామని, రేవంత్ సర్కారు చేసిన దుర్మార్గాలను దేశం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. దేశంలో ఇంకా న్యాయం, ధర్మం బతికే ఉన్నాయని, మానవత్వం మిగిలే ఉన్నదని ఎన్‌హెచ్చార్సీ నివేదికతో స్పష్టమైందని వివరించారు. ప్రస్తుతం హెచ్‌సీయూ భూముల విషయంలోనూ రేవంత్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆర్థిక మోసానికి పాల్పడిందంటూ కేంద్ర సాధికార కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు.
బాధ్యులను డిస్మిస్ చెయ్యాలి
లగచర్ల ఘటనపై ఎన్‌హెచ్చార్సీ ఇచ్చిన కీలకమైన రిపోర్ట్‌ను మీడియా పెద్దగా పట్టించుకోలేదని కేటీఆర్ తెలిపారు. నివేదికలోని కొన్ని అంశాలను ఈ సందర్భంగా చదివి వినిపించారు. తనను, తన అత్తను కూడా లైంగికంగా వేధించారని లగచర్లకు చెందిన ఒక అమ్మాయి, చెప్పరాని చోట కొట్టారని మరో అమ్మాయి ఎన్‌హెచ్చార్సీ ఎదుట చెప్పారని, దేశంలో ఏ ఆడపిల్లా ఇలాంటి విషయాల్లో అబద్ధాలు చెప్పదని గుర్తుచేశారు. పరిగి పోలీస్ స్టేషన్లో రైతులను విపరీతంగా కొట్టడమే కాకుండా మెజిస్ట్రేట్‌కు చెప్తే ఇంట్లో వాళ్లను కూడా తీసుకొచ్చి కొడతామని పోలీసులు బెదిరించారని, ఘటన జరిగిన రోజున అకడ లేని వ్యక్తులను, సంబంధం లేని రైతులను కూడా తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారని కమిషన్ నివేదించినట్టు వివరించారు. లాకప్పుల్లోని సీసీ టీవీలు పనిచేస్తలేవని చెప్పడం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని నివేదిక తెలిపిందని వివరించారు. ఈ చర్యలన్నింటికీ బాధ్యులైన పోలీసులపై 6 వారాల్లో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించిందని, లేదంటే తామే తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించిందని వెల్లడించారు. కమిషన్ ఆదేశాలను ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లగచర్ల ఘటనలో రేవంత్‌రెడ్డి, ఆయన అన్న తిరుపతిరెడ్డి పాత్ర లేకపోతే ఓవరాక్షన్ చేసిన పోలీసులను సర్వీస్ నుంచి తొలగించాలని, లేదంటే లగచర్ల ఘటనకు కర్త, కర్మ, క్రియ రేవంత్‌రెడ్డే అనుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు.
హిసాబ్ కితాబ్ బరాబర్ చేస్తం
లగచర్లలో భూసేకరణ కూడా తప్పుడు పద్ధతిలో చేశారని ఎన్‌హెచ్చార్సీ తన నివేదికలో స్పష్టం చేసిందని కేటీఆర్ వెల్లడించారు. భూ సేకరణపై హైకోర్టులో స్టే ఉన్నా ప్రభుత్వం ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నదని, చాటుమాటుగా పనులు చేస్తున్నట్టు తమకు సమాచారం ఉన్నదని చెప్పారు. పోలీసులు, అధికారులు ఇప్పటికీ బెదిరిస్తున్నట్టు లగచర్ల బాధితులు చెప్తున్నారని వివరించారు. ఓవరాక్షన్ చేస్తున్న అధికారులను తాము అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టేది లేదని, హిసాబ్ కితాబ్ బరాబర్ చేస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని జాతీయ మానవ హకుల కమిషన్ చెప్పినా, హైకోర్టులో స్టే ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టు చేస్తున్న అధికారులకు వారి పద్ధతిలోనే జవాబు చెప్పాల్సి వస్తుందని తెలిపారు. లగచర్ల బాధితులకు గతంలో అన్నివేళలా అండగా ఉన్నామని, వాళ్లకు న్యాయం జరిగేదాకా అండగా ఉంటామని, రేవంత్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. ఇంత కష్టంలో కూడా బీఆర్ఎస్ గురించి ఆలోచించి, రజతోత్సవ సభకు విరాళమిచ్చిన లగచర్ల ఆడబిడ్డలకు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
రజతోత్సవ సభకు లగచర్ల లక్ష విరాళం
వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లగచర్ల గ్రామస్తులు రూ.లక్ష విరాళం అందజేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూసేకరణ చేపట్టడంపై కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల, హకీంపేట తదితర గ్రామాల రైతులు తిరుగుబావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేలాది మంది పోలీసులు లగచర్లపై మూకుమ్మడిగా దాడి చేయడంతోపాటు, రైతులు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కేసులు నమోదు చేసి, స్టేషన్లకు తరలించిన చిత్రహింలు పెట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో లగచర్ల రైతులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. వారి గోడును యావత్ దేశానికి వినిపించింది. న్యాయపోరాటానికి మద్దతుగా నిలిచింది. ఢిల్లీకి తీసుకెళ్లింది. జైళ్లకు వెళ్లిన వారు తిరిగొచ్చేదాకా భరోసాగా నిలిచింది. అన్నివిధాలా అండగా నిలిచిన బీఆర్ఎస్పై లగచర్లవాసులు అంతే అభిమానాన్ని చాటుకున్నారు. ఒక్కొక్కరు రూ.1000 చొప్పున చందాలు వేసుకున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రూ.లక్ష విరాళం అందజేసి గులాబీ జెండాపై తమ గుండెల్లో ఉన్న ప్రేమను చాటుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి తరలివచ్చారు. లక్ష చెక్కును కేటీఆర్‌కు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రజతోత్సవ సభను బ్రహ్మాండంగా నిర్వహిస్తం
‘ఈ నెల 27న ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభను కనీవినీ ఎరగని రీతిలో నిర్వహిస్తం. మాకు రెండుసార్లు అధికార మిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్తం. సభ సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ దొంగనాటకాన్ని బట్టబయలు చేస్తం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో భవిష్యత్తు దేశ రాజకీయాల్లో కీలకభూమిక పోషించబోతున్నామని చెప్పారు. మంగళవారం ఆయన ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో సభ నిర్వహణ, కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలు, భవిష్యత్తులో బీఆర్ఎస్ చేపట్టే ప్రణాళికలను వివరించారు. రానున్న మూడేండ్లలో ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను మరిచి కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
అన్నీ చేసి ప్రచారంలో ఫెయిలైనం
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కేసీఆర్ నేతృత్వంలో ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా నడిపించామని కేటీఆర్ చెప్పారు. ‘ఏ రాష్ట్రంలో లేని విధంగా 1.62 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినం. వేతనాలు భారీగా పెంచినం. 24 గంటల కరెంట్ ఇచ్చినం. వరి ఉత్పత్తిలో పంజాబ్‌ను మించిపోయినం. 32 మెడికల్ కాలేజీలు కట్టినం. వెయ్యి గురుకులాలు నిర్మించినం. కానీ ప్రచారం చేసుకోవడంలో ఫెయిలైనం. అందుకే అధికారానికి దూరమైనం’ అని వివరించారు. కాంగ్రెస్ ఢిల్లీ నాయకులతో పాటు అప్పటి పీసీసీ అధ్యక్షుడు తమ అధినేత కేసీఆర్‌పై అబాంఢాలు వేసి, బద్నాం చేసి అధికారంలోకి వచ్చారని చెప్పారు.
సర్కారు కాదు.. సర్కస్ నడుపుతున్నరు
‘కాంగ్రెస్ పార్టీకి ఓ విధానం లేదు. పద్ధతి లేదు. ముఖ్యమంత్రి ఓ మాట చెప్తే మంత్రులు మరో మాట అంటరు. పథకాల ముచ్చటడిగితే పారిపోతున్నరు. వీళ్లు సర్కారును నడుపుమంటే సర్కస్‌ను నడుపుతున్నరు’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే లంకెబిందెల కోసం దేవులాడిన వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భగ్యామని దెప్పిపొడిచారు. ‘ఆయనలో ప్రజలు అపరిచితుడిని చూస్తున్నరు. రెమో పాత్రలో ఉద్యోగాలకు జీతాలిచ్చేందుకు పైసల్లేవంటరు. మళ్లోసారి వాళ్లను ఎవరూ నమ్ముతలేరంటరు. రాము పాత్రలో లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తున్నమంటరు. రూ.1.50 లక్షల కోట్లతో మూసీని పునరుద్ధరిస్తమంటరు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఎన్రోల్మెంట్ చేయలేదు కాబట్టే..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ ఎన్రోల్మెంట్ చేయనందునే ఎన్నికలకు దూరంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టంచేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుంటే పోయేదేమీ ఉండదని చెప్పారు. కొన్నిసార్లు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల్లో బలవంతంగా పోటీచేసి ఓడిపోయారని, కానీ జనరల్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకున్నా స్థానిక ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటామని స్పష్టంచేశారు.
విభేదాలు ప్రతిపక్షాల సృష్టే
‘బీఆర్ఎస్లో విభేదాలు, హరీశ్‌రావును దూరం పెడుతున్నారు అనేది అవాస్తవం’ అని కేటీఆర్ కొట్టిపారేశారు. పనికిమాలిన మీడియా, పనికిరాని కాంగ్రెస్, బీజేపీలే ఇలాంటి అపోహలకు తెరలేపుతున్నాయని మండిపడ్డారు. గులాబీ సైనికులమంతా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని పునరుద్ఘాటించారు. మూడేండ్లు ప్రజాసమస్యలపై పోరాడి కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు కంకణబద్ధులమవుతామని తేల్చిచెప్పారు. రైతుబంధు ఎందుకు పడుతలేదు?
‘కేసీఆర్ ప్రజలను కలువడు..ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడికే పదవులిచ్చిండ్రు.. ఫామ్‌హౌస్ నుంచి బయటికి రాడు అని నాడు రేవంత్‌రెడ్డి సొల్లు కబుర్లు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించిండు. నాడు ప్రజలను కలువకున్నా కాలానికి ముందే రైతుబంధు అన్నదాతల ఖాతాల్లో జమైంది. నిరుపేద ఆడబిడ్డలకు క6ల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందింది. మరిప్పుడు రేవంత్‌రెడ్డి 24 గంటలు ప్రజలను కలుస్తుంటే రైతుబంధు ఎందుకు పడ్తలేదు? తులం బంగారం ఎందుకు వస్తలేదు? విద్యార్థినులకు స్కూటీలు ఎందుకు ఇస్తలేరు?’ అని కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.సర్కారుకు చెంపపెట్టు
లగచర్ల బాధితుల గోడు, బీఆర్ఎస్ పోరాట ఫలితంగా ఎన్‌హెచ్చార్సీ క్షేత్రస్థాయిలో పర్యటించిందని, బాధితులతో మాట్లాడిందని, వివరాలు ఆరా తీసిందని కేటీఆర్ తెలిపారు. అన్ని అంశాలపై కమిషన్ తాజాగా సమర్పించిన నివేదిక అధికారమదంతో విర్రవీగుతున్న రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు అని అభివర్ణించారు. రేవంత్‌రెడ్డి అల్లుడిదని చెప్పుకొంటున్న ఫార్మాస్యూటికల్ కంపెనీ కోసం పేదల భూములు గుంజుకునే ప్రయత్నాన్ని సైతం ఎన్‌హెచ్చార్సీ అభిశంసించిందని గుర్తుచేశారు. ‘రేవంత్ ముఖ్యమంత్రి.. హోంమంత్రిగానే కాదు స్థానిక కొడంగల్ ఎమ్మెల్యేగా ఈ ఘటనపై సిగ్గుపడాలి.. హోంమంత్రిగా పోలీసులు చేసిన దౌర్జన్యానికి ముకు నేలకు రాయాలి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. లగచర్లలో పోలీసుల పాశవిక చర్యల మీద బీఆర్ఎస్ చెప్పిన ప్రతిమాటా అక్షర సత్యమన్న సంగతి ఎన్‌హెచ్చార్సీ నివేదికతో స్పష్టమైందని వివరించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపిన కమిషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం లగచర్ల గిరిజనులు లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం గుండె నిండా సంతోషాన్ని నింపింది. వాళ్లు కష్టంలో ఉన్నవేళ బీఆర్ఎస్ అండగా ఉన్నదని, అందుకే ఉడతా భక్తిగా సాయం చేస్తున్నమని లగచర్ల గిరిజనులు ముందుకు రావడం గొప్పవిషయం. ఒక మనిషిని ఎన్ని రకాలుగా శారీరకంగా చిత్రవధ చేసే అవకాశం ఉంటదో అన్ని రకాలుగా లగచర్ల గిరిజనులను పోలీసులు హింసించిండ్రు. రైతు హీర్యానాయక్‌కు ఛాతిల నొప్పి వచ్చినా మానవత్వం చూపకుండా బేడీలు వేసి దవాఖానకు తీస్కపోయిన నికృష్ట ప్రభుత్వం రేవంత్‌రెడ్డిది.
– కేటీఆర్
బీఆర్ఎస్ రజతోత్సవ సభను బ్రహ్మాండంగా నిర్వహిస్తం.. కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న దొంగనాటకాన్ని ఎండగడుతం.. చేతగాని రేవంత్ సర్కార్ తీరును ప్రజలకు వివరిస్తం. రెండుసార్లు అధికారమిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్తం. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలపై ప్రచారం చేసుకోవడంలో విఫలమైనం.. అందుకే అధికారానికి దూరమైనం.
– ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో కేటీఆర్
అధికారంతో విర్రవీగుతున్న రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి జాతీయ మానవ హకుల కమిషన్ ఇచ్చిన నివేదిక చెంపపెట్టు. మూడేండ్లలో మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తది. రేవంత్‌రెడ్డి ప్రైవేటు సైన్యంలాగా ఓవరాక్షన్ చేస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదు. సదరు అధికారులు విరమణ పొందినా, ఏ మూలన దాకున్నా పట్టుకొచ్చి హిసాబ్ కిసాబ్ బరాబర్ చేస్తం.
-కేటీఆర్
భూమిచ్చి ఎటుపోవాలె?
నాకు భర్త లేడు.ఉన్నది మూడున్నరఎకరాల భూమి. ఇద్దరు కొడుకులకు చెరి సగం పంచిన. కొంచం భూమిని నేను ఉంచుకున్న. దాంట్ల ఎవుసం చేసి వచ్చే గాసంతోనే ఎల్లదీసుకుంటున్నం. ఆ భూమి పోతే మేం ఎటుపోవాలె? మా ఊర్లె రెడ్లకు 20 నుంచి 30 ఎకరాలున్నయ్. వాళ్ల భూములను వదిలి మామీద ఎందుకు పడుతున్నరు? వాళ్ల భూములనే తీస్కోండ్రి. మమ్ములను వదిలెయ్యిండ్రి.
– సక్రుబాయి, లగచర్ల
ఇంకా బెదిరిస్తున్నరు
కోర్టు చెప్పినా ఇంకా మమ్మల్ని బెదిరిస్తున్నరు. ఇప్పుడైతే 20 లక్షలు ఇస్తం.. లేదంటే రూపాయి కూడా ఇయ్యకుంట గుంజుకుంటం అంటున్నరు. పోలీసులు బెదిరిస్తున్నరు. ఊర్లో ఉండాలన్నా ఇంకా భయమైతాంది. కొత్త మనిషిని చూస్తే వణుకు పుడుతాంది. ఏం చేసినా మా భూమిని మాత్రం ఇచ్చేది లేదు.
– సురేశ్, లగచర్ల