హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరంలో నీళ్లు నింపకపోవడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నేరపూరిత చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎల్ నినో లాంటి తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ ఏపీ రైతులకు అక్కడి ప్రభుత్వం ఎంతో బాగా కాపాడుకొంటుంటే.. రేవంత్‌రెడ్డి ఎన్డీఎస్ఏను అడ్డుపెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులు రక్తం ఇస్తున్నా కాంగ్రెస్ సర్కార్ వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడం లేదని నిప్పులుచెరిగారు. అయితే నీళ్లు ఎత్తిపొస్తే కేసీఆర్‌కు ఎక్కడ మంచిపేరు వస్తుందనే అసూయతోనే రేవంత్‌రెడ్డి ఉన్నారని విమర్శించారు. ప్రాజెక్టు వద్ద కాఫర్ డ్యామ్ నిర్మించి కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయాలని సూచించారు. ఢిల్లీలో బుధవారం మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సీఎం చేయించిన నాలుగు సర్వేల్లో కూడా బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని వెల్లడికావడంతో రేవంత్ గాబరా పడుతున్నారని చెప్పారు. రేవంత్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, ఆయన తీసుకొంటున్న నిర్ణయాల వల్లే రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అందుకే తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో తన పోరాటం.. రాష్ట్ర ప్రజల కోసమేనని స్పష్టంచేశారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని, కాబోయే సీఎం కేసీఆరేనని ధీమా వ్యక్తంచేసిన కేటీఆర్.. వచ్చే ఏడాది రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నట్టు వెల్లడించారు.
సీఎం రేవంత్‌రెడ్డి రక్తపిశాచిలా అడ్డగోలుగా మాట్లాడుతున్నా గాంధేయవాదులమని చెప్పుకొనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించడం లేదని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ నిలదీశారు. రక్తం పొలాల్లో చల్లాలని ఏ ముఖ్యమంత్రి అయినా చెప్తాడా? హిట్లర్ తనకు ఆదర్శమని ఏ ముఖ్యమంత్రి అయినా అంటారా? అని మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో కావాలనే రైతులకు ఇబ్బంది పెడుతున్నారని, తమపై ఉన్న కోపాన్ని ఈ ప్రభుత్వం రైతుల మీద చూపెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటివరకు 73 సార్లు ఢిల్లీకొచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి కనీసం 73 పైసలైనా రాష్ట్రానికి తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. ప్రస్తుత ఢిల్లీ పర్యటనలో రేవంత్‌రెడ్డి ఎన్డీఎస్ఏ అధికారులను ఎందుకు కలువలేదని నిలదీశారు.
టీఆర్ఎస్ అనేది మా క్రెడిబిలిటీ. ఆ పేరుతో మాకు 22 ఏండ్ల సుదీర్ఘ అనుబంధం ఉన్నది. అది తెలంగాణ తెచ్చిన పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీ, ఇప్పుడు ఇంకెవరో వచ్చి ఆ పేరును తీసుకొంటామంటే తెలంగాణ సమాజంలో ఎవరు ఒప్పుకొంటారు. ఉద్దేశపూర్వకంగా మాకు నష్టం చేయాలని ప్రయత్నం చేస్తే ఎలా ఊరుకుంటాం.
– కేటీఆర్
వచ్చే ఏడాది తెలంగాణలో తాను స్వయంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని, వాటిపై అత్మవిమర్శ చేసుకుని ముందుకుపోతున్నట్టు చెప్పారు. కేసీఆర్ నెక్ట్స్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాదిరిగానే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఉంటుందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదని, ఎనిమిది మందిలో ఎవరికి వారు తామే సీఎం అని అంటున్నారని చురకలంటించారు. ఇన్నేండ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
దక్షిణాది సీట్ల వాటా తగ్గకుంటేనే పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. డీలిమిటేషన్ బిల్లులో దక్షిణాది రాష్ట్రాల వాటా 24శాతంగానే కొనసాగాలని, యథావిధిగా దక్షిణాది వాటా ఉంటేనే బిల్లుకు మద్దతిస్తామని తేల్చిచెప్పారు. తెలంగాణలో ఎలాగైనా సీట్లు పెరుగడం ఖాయమని, అది డీలిమిటేషన్ విధానంలో అయినా, లేదంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారమైనా సీట్లు పెరుగాల్సిందేనని పేర్కొన్నారు. ఏదైనా సరే బీజేపీ అనుకుంటే ఫాస్ట్ అవుతుందని, లేదంటే ఆలస్యం తప్పదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సౌత్‌కు 24శాతం సీట్లు పార్లమెంట్లో ఉన్నాయని, డీలిమిటేషన్ తర్వాత కూడా సౌత్ ప్రాధాన్యం అలాగే ఉండాలని, ఏమాత్రం తగ్గొద్దని డిమాండ్ చేశారు. ఒకవేళ జనాభా లెకల ప్రకారమే సీట్లు కేటాయిస్తే దక్షిణాది నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు కుటుంబ నియంత్రణ పాటించినందుకు ఇకడ జనాభా తగ్గిందని వివరించారు.
ఎన్డీఎస్ఏను అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేవలం 8.5కోట్లతో కాఫర్‌డ్యామ్ కట్టొచ్చని డ్యూటీలో ఉన్న ఇంజినీర్లు ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టకుండా దాచిపెట్టిందని ఆరోపించారు. తెలంగాణ రైతులు రక్తం ఇస్తున్నా కాంగ్రెస్ సర్కార్ వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడం లేదని, ప్రభుత్వ నిర్వాకం వల్లే సూర్యాపేట వద్ద ఉన్న ఓ తండాలో రైతు తన రక్తం భూమిలో చల్లాడని ఆవేదన చెందారు. గతంలో భారీగా గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా మేడిగడ్డ, భద్రాచలం ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం కలుగలేదని గుర్తుచేశారు. వర్షాకాలంలో గోదావరి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం ఎవరికీ సాధ్యంకాదని తేల్చిచెప్పారు.
ప్రస్తుతం పార్లమెంట్లో దక్షిణాదికి 24శాతం సీట్లున్నాయి. డీలిమిటేషన్ తర్వాత కూడా ఏమాత్రం తగ్గద్దు. దక్షిణాది వాటా యథావిధిగా ఉంటేనే పార్లమెంట్లో బిల్లుకు మద్దతిస్తాం. డీలిమిటేషన్ ప్రకారమైనా, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమైనా తెలంగాణలో సీట్లు పెరుగాల్సిందే. ఒకవేళ జనాభా లెకల ప్రకారమే సీట్లు కేటాయిస్తే దక్షిణాది నష్టపోయే ప్రమాదం ఉన్నది.
– కేటీఆర్
రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు పెట్టి బెదిరిస్తే వారు ఇకడినుంచి పారిపోరా? అని కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నగరాభివృద్ధి కోసం ఎయిర్‌పోర్టు మెట్రో ఏర్పాటుకు శ్రీకారం చుట్టి పనులు మొదలుపెట్టిందని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ మెట్రోను రేవంత్‌రెడ్డి రద్దు చేశారని మండిపడ్డారు. మెట్రో భూములు 280 ఎకరాలపై రేవంత్‌రెడ్డి కన్ను పడిందని, ఎలాగైనా వాటిని అమ్మేస్తారని ఆరోపించారు. ప్రైవేట్ సంస్థ అయిన ఎల్అండ్టీ చేసిన అప్పులను ప్రభుత్వం ఎందుకు కట్టాలని ఆయన ప్రశ్నించారు. లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడం వల్లే ఢిల్లీలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 15 మంది ఎంపీలతో తాము లోక్‌సభలోకి వస్తే పార్లమెంట్లో తమ బలం గణనీయంగా పెరుగుతుందని కేటీఆర్ స్పష్టంచేశారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలో రూ.4 లక్షల కోట్లకుపైగా అప్పులుచేసిందని కేటీఆర్ చెప్పారు. కానీ, బీఆర్ఎస్ సర్కార్ తమపై అప్పుల భారం మోపినట్టుగా అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. తాము పదేండ్లలో కేవలం రూ.4.17 లక్షల కోట్ల రుణ సమీకరణ చేశామని పునరుద్ఘాటించారు. అప్పుల కోసం నెలకు కేవలం రూ.2,300 కోట్ల వడ్డీ చెల్లిస్తున్న సర్కార్.. తాము 5-6 వేల కోట్లు చెల్లిస్తున్నట్టుగా అబద్ధాలు ఆడుతున్నదని ఆక్షేపించారు. రేవంత్‌రెడ్డి అనుభవరాహిత్య పాలన వల్ల అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని అందోళన వ్యక్తంచేశారు.
ఎన్డీఎస్ఏ.. ఒక సలహా సంఘం మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలైన ఓనర్ రాష్ట్ర ప్రభుత్వమే. కాళేశ్వరం అనగానే ఎన్నికల ముందు అకస్మాత్తుగా ఎన్డీఎస్ఏ రంగంలోకి వచ్చింది. రెండు రోజుల్లోనే రిపోర్ట్ ఇచ్చేసింది. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీయే రిపోర్ట్. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలినప్పుడు, పోలవరం డయాఫ్రమ్ వాల్ కూలినప్పుడు రాని ఎన్డీఎస్ఏ ఇకడికి ఎందుకు వచ్చింది. ఎన్నికల ముందు కేవలం రాజకీయం కోసమే ఇదంతా కుట్ర చేశారు.
– కేటీఆర్
ఆధారాలు లేకుండానే తమపై రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. గతంలో సినిమావాళ్ల ఫోన్లు కూడా తామే ట్యాప్ చేశామని ఆరోపించారని, అసలు ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేశామో చూపించాలని సవాల్ విసిరారు. సగం పాలన పూర్తయిన సందర్భంగా సీఎం జరిపించిన నాలుగు సర్వేల ఫలితాలు చూశాకే రేవంత్‌రెడ్డి గాబరా పడుతున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి సీఎం అయినాక కూడా ఇంకా ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ నెల 31న ఈ-కార్ రేస్ కేసులో తాను కోర్టుకు హాజరవుతానని స్పష్టంచేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి 30 పర్సెంట్ మినిస్టర్‌గా మారి, అవినీతిలో అందరికంటే ముందున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి లాక్ అన్‌లాక్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, భూముల వివాదాలను అన్‌లాక్ చేసేందుకు ఏకంగా 30శాతం కమీషన్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, వ్యక్తిగత కక్షలు కూడా లేవని స్పష్టంచేశారు. అయితే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉంటే బాగుండేదని, దానివల్ల మంచి పేరు ఉండేదని అభిప్రాయపడ్డారు.