హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : ఆటోడ్రైవర్లను కాంగ్రెస్ దగా చేసిందని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని నమ్మించి రోడ్డున పడేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. అధికారంలో వచ్చిన తర్వాత ఏడాదికి రూ.12వేలు ఇస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా ఆ మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఈ రెండేళ్ల పాలనలో ప్రతి ఆటో అన్నకు బాకీ పడ్డ రూ.24వేలను ముందుగా చెల్లించాలని సర్కారును డిమాండ్ చేశారు. ఆటోడ్రైవర్ల జీవితాలను నాశనం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యాయమవుతుందా అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఆటోడ్రైవర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను అమలు చేసి చూపాలని సవాల్ చేశా రు. సోమవారం సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని తెలంగాణ భవన్లో ఆటోడ్రైవర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి తమ సమస్యలపై స్పందించిన కేటీఆర్ ‘మీకు అండగా నేనున్నా’ అంటూ భరోసా ఇచ్చారు. అసంఘటిత కార్మికులందరికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5 లక్షల బీమా చేయించారని గుర్తుచేశారు. దురదృష్టవశాత్తూ ఎవరికైనా ప్రమాదం జరిగితే ఈ బీమా ద్వారా చాలామందికి డబ్బులు అందాయని చెప్పారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి బీమా ప్రీమియం కట్టకపోవడంతో రద్దయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులు ఇన్సూరెన్స్ సౌకర్యం కోల్పోయారని ఆయన ఆవేదన చెందారు. ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ప్రభుత్వాన్ని నిలదీసినా చలనం లేదని విమర్శించారు. ‘ఆటో అన్నల సమస్యలపై బీజేపోడు.. కాంగ్రెసోడు ఒక్కడు మాట్లాడలేదు’ అంటూ మండిపడ్డారు. తాము ఇందిరా పార్కు వద్ద ధర్నా చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 5వేల మంది ఆటోడ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా ప్రీమియం చెల్లించేందుకు కేటీఆర్ ముందుకొచ్చారు. కాంగ్రె స్ సర్కారు కండ్లు తెరిపించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు. ప్రభుత్వానికి సిగ్గువచ్చి ‘వీళ్లు కడుతున్నప్పుడు మనం ఎందుకు కట్టవద్దు’ అని రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్లకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకొస్తుందనే ఉద్దేశ్యంతోనే సిరిసిల్ల జిల్లా నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని స్పష్టంచేశారు. జిల్లాలోని ఆటో, సెవన్ సీటర్స్, అవసరమైతే ట్రాలీ డ్రైవర్ల వివరాలు (పేరు, ఫోన్, ఆధార్ నంబర్) సేకరించి బుధవారం సాయంత్రంలోగా తనకు అందించాలని స్థానిక నాయకులకు సూచించారు. కేటీఆర్ నిర్ణయంపై సంతోషం వ్యక్తంచేసిన ఆటోడ్రైవర్లు తమ అభ్యున్నతి కోసం పరితపిస్తున్న నేతకు మనసారా కృతజ్ఞతలు తెలిపారు.
ఫ్రీ బస్సుకు తాము వ్యతిరేకం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫ్రీ బస్సు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం బస్సుల సంఖ్య పెంచలేదని, మహిళలు కొట్టుకొనే పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. మహిళలకు ఫ్రీ ఇచ్చి, పురుషులకు డబుల్, స్టూడెంట్లకు 25శాతం చార్జీలు పెంచిందని ఇలా అయితే ఫ్రీ బస్సు ఎలా? అవుతుందంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆటోడ్రైవర్ల సమస్యలు లేవనెత్తితే తమపై దాడి చేస్తున్నారంటూ కాంగ్రెసోళ్లు దబాయిస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పార్టీ జిల్లా, పట్టణ అధ్యక్షుడు తోట ఆగయ్య, జిందం చక్రపాణి, అటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు అల్లె శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు బొల్లి రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.