సిరిసిల్లను తిరుపూరుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే వస్త్ర ఉత్పత్తిదారులను స్టడీ టూర్‌కు బసుల్లో తమిళనాడు పంపించాం. ఆత్మహత్యలు, ఆకలి చావుల నుంచి బయటపడి ఇప్పుడిపుడే ముఖం తెలివికొస్తుందన్న సమయంలో దురదృష్టవశాత్తు దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడి ప్రజలు నన్ను ఐదుసార్లు గెలిపించారన్న కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలపై పగబట్టింది. బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసింది. మూతపడిన సాంచాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చి వేలాదిమంది కార్మికుల కడుపు నింపిన మహానుభావుడని కేసీఆర్.
-కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ, జూపార్క్ అని మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి అందుకోసం ఒక్క ఎకరమైనా సేకరించారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో తమ ప్రభుత్వం ప్రతిపాదించిన భూమిని ఇతర అవసరాలకు ఎలా మళ్లిస్తారని ప్రశ్నించారు. బ్రదర్స్‌కు, రియల్ ఎస్టేట్‌కు వాడుతానంటే భూములిచ్చిన రైతులు ఊరుకోబోరని హెచ్చరించారు. ఫార్మాసిటీ విషయంలో ప్రభుత్వం అయోమయానికి గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇబ్రహీంపట్నంలో ఏ రైతులైతే ఓట్లేసి గెలిపించారో వాళ్లే కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తారని హెచ్చరించారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన 14 వేల ఎకరాల భూమి కండిషనల్ ల్యాండ్ అక్విజేషన్ అని తెలిపారు. ఆ భూములను రియల్ ఎస్టేట్ దందాల కోసం, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అనే హంగామా కోసం మళ్లించి వేలకోట్లు నొక్కెయ్యాలనే ఆలోచన, ప్రభుత్వం చేస్తున్న కుట్రలను న్యాయమూర్తులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
సమయానుకూలంగా ఇందులో ఎవరెవరు జోక్యం చేసుకుంటున్నారో ఏమి జరుగుతున్నదో బయటపెడతామని చెప్పారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ పక్కనున్న ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బోయినిపల్లి మండలంలోని కొదురుపాకలో తన అమ్మమ్మ, తాతయ్య జోగినిపల్లి లక్ష్మి-కేశవరావు జ్ఞాపకార్థం నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. తాను నాయకుడిగా రాలేదని, కేశవరావుకు మనవడిగా ఇక్కడకు వచ్చానని చెప్పారు. అనంతరం సిరిసిల్లకు చేరుకుని తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ మారినోళ్లంతా ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఉప ఎన్నికలు పక్కాగా వస్తాయని చెప్పారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్‌గాంధీ ప్రతిపక్ష నేత, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కానీ, ఉద్యోగాల సంగతి మర్చిపోయారని విమర్శించారు.
కక్ష నాపై తీర్చుకోండి
ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కక్ష తీర్చుకోదల్చుకుంటే తాను దానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ‘తొమ్మిదిన్నర నెలల నుంచి చూస్తున్నా. ప్రజలకు పనికొచ్చే ఒక్క పథకం తెచ్చారా? చెప్పిన డైలాగులేమో అనంతంగా చెప్పిండ్రు. వానకాలం నాట్లు పడ్డా ఇంతవరకు రైతు భరోసా దిక్కులేదు. రూ.10వేలు కాదు, రూ.15 వేలు ఇస్తమన్నరు. రైతు రుణమాఫీ చెయ్యలేదు. క్షీరాభిషేకాలు అయిపోయాయి. ఊళ్లల్లోకెళ్తే కాంగ్రెసోళ్లను తన్నేటట్టున్నరు. ఎల్లకాలం మోసం నడవది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ డ్రామాలు నడవవు. నేతన్న విషయంలో డ్రామాలు బంద్ పెట్టి చీరల తయారీ మొత్తం సిరిసిల్లకే ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. ‘బతుకమ్మ బంద్, క్రిస్మస్ దుస్తులు, రంజాన్ తోఫా ఎందుకు బంద్ పెట్టారో ఎవని అయ్యకు తెలువది. చెప్పేటోడు లేడు. అడిగేటోడు అంతకంటే లేడు’ అని విమర్శించారు. ఇది దివాలాకోరు రాజకీయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రోజుకొక్క పుకారు పుట్టించాలె. హెడ్లైన్ మేనేజ్మెంట్, డెడ్‌లైన్ మేనేజ్మెంట్.. అది తప్ప సర్కారు పీకిందేమీలేదు’ అని ధ్వజమెత్తారు.
అన్న ఇంటికి నోటీసులు.. పేదల గుండెల్లో బుల్డోజర్లా
‘అన్నకు 40 రోజుల నోటీసులిచ్చి వెసలుబాటు కల్పిస్తవ్. పేదల ఇండ్లను మాత్రం కూలుస్తవా’ అంటూ రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. దళితులు, మైనార్టీలు, బీసీలను బజారుకీడ్చి బుల్డోజర్తో తొక్కిస్తావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రభుత్వంలో కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలవడం లేదు. మూడు రోజుల కింద రిజిస్ట్రేషన్ అయినది, కోటిన్నర పెట్టి కొనుక్కున్న ఇంటిని కూల్చేస్తున్నారు. వీళ్లు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా? లేకుంటే సర్కస్ నడిపిస్తున్నారా? నీ ఖజానాకు ఓ చేయి నుంచి పైసలు తీసుకుంటవ్. ఇంకో చేత్తో కూలగొడవతారా? నీ అన్న ఇల్లు ముట్టనివ్వవు, అది భద్రంగా ఉండాలె. బడుగుల బతుకులు మాత్రం ఛిద్రం కావాలె. ఇదేనా? నీతి’ అని విరుచుకుపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే హైడ్రాలో ఇండ్లు కోల్పోయిన పేదలకు కేసీఆర్ కట్టించిన 40 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను ఇవ్వాలని కోరారు. మూసీ నదిపై పెద్దపెద్ద బిల్డింగ్లు కడుతున్నారని, దమ్ముంటే వాటిని కూల్చాలని సవాల్ చేశారు. కేవీపీ రాంచందర్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డిని విడిచి పెట్టి పేదలపై ప్రతాపం చూపడం న్యాయమా? అని నిలదీశారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇన్నోవేట్ థింకింగ్
ఇయ్యని ఉద్యోగాలను ఇచ్చినట్టు చెప్పుకుంటూ, నోటిఫికేషన్ ఇవ్వకున్నా 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని ఊదరగొడుతూ, అర్హత లేని బావమరిదికి రూ.1,137 కోట్ల కాంట్రాక్టు ఇచ్చి ఇన్నోవేట్ థింకింగ్ అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇన్ని రోజులు అడ్రస్ లేని అన్నదమ్ములు రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులతో మూటముల్లెతో వచ్చుడు ఇన్నోవిట్ థింకింగ్‌కు నిదర్శనమా? అని ప్రశ్నించారు.
ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
‘తెలంగాణ సాధన కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం. తెలంగాణ సాయుధ పోరాటంలో నియంతృత్వాన్ని నిరసించి తెలంగాణకు స్ఫూర్తినిచ్చిన వీర వనిత ఐలమ్మను ఆడబిడ్డలందరూ ఆదర్శంగా తీసుకోవాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
నేనే రాజు, నేనే మంత్రి, అక్కడ రేవంత్‌రెడ్డి, ఇక్కడ నేనే ప్రభుత్వాన్ని నడుపుతానంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కేకే మహేందర్‌రెడ్డికి అధికారులు వంత పాడుతున్నారు. అధికారులకు ఒకటే చెప్తున్నా. మొన్న ఆంధ్రప్రదేశ్‌లో ఆలిండియా సర్వీస్ ఆఫీసర్లు సైతం సస్పెండ్ అయ్యారు. చట్ట ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు పని చేస్తమంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు. ఎవరైనా సరే తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. మూడున్నర, నాలుగేండ్లలో కేసీఆర్ తిరిగి వస్తారు. మీ సంగతి తప్పకుండా చూస్తారు.
-కేటీఆర్