మోర్తాడ్, జూన్ 10: కేసీఆర్‌ను నేరుగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కొని ఆయనను ఇబ్బందులు పెట్టాలని కుట్రలు చేస్తున్నాయని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కక్ష సాధింపు ధోరణిలో భాగమే కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులని మండిపడ్డారు. కేసీఆర్ చట్టాన్ని గౌరవించి విచారణకు హాజరవుతున్నారని, కాంగ్రెస్, బీజేపీ కలిసి ఎన్ని కేసులు పెట్టినా, వేధింపులకు గురిచేసినా భయపడేదే లేదని స్పష్టంచేశారు. సబ్బండ వర్ణాలను కలుపుకొని సుదీర్ఘ పోరాటం చేసి తెచ్చిన తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలపడానికి పదేండ్లు అహోరాత్రులు కృషిచేసిన, తెలంగాణ బాగును కాంక్షించిన కేసీఆర్‌ను విచారణ పేరిట వేధింపులకు గురి చేయాలని కాంగ్రెస్ చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేసీఆర్ వెంట యావత్ తెలంగాణ సమాజం ఉన్నదని, కుట్రలను ఛేదించి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడుతామని, ప్రజాకోర్టులో శిక్షిస్తామని హెచ్చరించారు. మోదీ స్కూల్లో, చంద్రబాబు కాలేజీలో చదువుకొని, రాహుల్‌గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నట్టు చెప్తున్న రేవంత్‌రెడ్డి.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఉద్యోగ ధర్మంలో విఫలం కావడం వల్లే 45 సార్లు ఢిల్లీకి చెక్కర్లు కొట్టినా రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. మొన్నటివరకు విద్యుత్తుపై కమిషన్ వేసి కేసీఆర్‌ను, ఫార్ములా వన్ విచారణ పేరిట కేటీఆర్‌ను, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకలను ఏ అవకాశం దొరికినా కక్ష సాధింపులతో ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 18 నెలలకే కాంగ్రెస్ పరిపాలన తెలంగాణకు శాపం అని ప్రజలందరూ అనుకుంటున్నారని పేర్కొన్నారు.