KTR : పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఆర్ధిక భరోసా కల్పిస్తూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రద్దుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రను అడ్డుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు. హైకోర్టు తీర్పు సాకుతో పేదింటి ఆడబిడ్డల భరోసాను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని కేటీఆర్ ఆరోపించారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోలనను చేపట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు తెలియజేశారు.
కల్యాణ లక్ష్మి అంశంలో హైకోర్టులో కౌంటర్ వేయకుండా కాంగ్రెస్ కుట్ర చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల అవినీతి అంశాల్లో కోట్లాది రూపాయలు చెల్లించి ప్రైవేటు లాయర్లను పెట్టుకునే ప్రభుత్వం.. పేదలు లబ్ది పొందే ఈ పథకం విషయంలో ఎందుకు కౌంటర్ వెయ్యలేదు? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఆడబిడ్డలు, వారి కుటుంబాల తరఫున బీఆర్ఎస్ కాంగ్రెస్ నిలదీస్తుంది అని ఈ సందర్భంగా వెల్లడించారు. ఆడబిడ్డలు తులం బంగారం అడుగుతున్నందుకే పూర్తిగా కల్యాణ లక్ష్మిని ఎత్తగొట్టే కుట్రకు రేవంత్ సర్కార్ తెరతీసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తీరును ఖండిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర జనరల్ బాడీ సభ్యులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పిలుపునిచ్చారు కేటీఆర్.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి ఎంతటి ఆర్థిక భారమో గుర్తించిన కేసీఆర్ 2014 అక్టోబర్ 2న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారని కేటీఆర్ గుర్తు చేశారు. రూ. 51 వేల ఆర్థిక సహాయంతో ప్రారంభమైన ఈ పథకాన్ని దశలవారీగా రూ.75,116కు, అనంతరం రూ.1,00,116కు పెంచారని ఆయన తెలిపారు. కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందిందని కేటీఆర్ వెల్లడించారు. కోవిడ్ వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి ద్వారా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి దానినే రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు.
కల్యాణ లక్ష్మి కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఆడబిడ్డ.. ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కూడా డిమాండ్ చేస్తుండటంతో, ఆ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్హులైన లబ్ధిదారులే చెబుతున్నారని ఆయన అన్నారు. పెళ్లిళ్లు జరిగి చాలా కాలం గడిచినా, కొందరికి పిల్లలు పుట్టినా కూడా తమకు రావాల్సిన కల్యాణ లక్ష్మి సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా కాలం తర్వాత ఆమోదం పొందిన దరఖాస్తులకు సంబంధించిన చెక్కులు కూడా పూర్తిస్థాయిలో పంపిణీ కాకుండా ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డిమాండ్ చేశారు. కల్యాణ లక్ష్మి అంశం హైకోర్టు పరిధిలో ఉన్న సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశంలో ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయిందని కేటీఆర్ నిలదీశారు. ముఖ్యమంత్రి, మంత్రులు అవినీతి.. హైడ్రా వంటి అంశాల్లో ప్రైవేటు న్యాయవాదులకు భారీ మొత్తాలు చెల్లించి వాదించే ప్రభుత్వం.. ఆడబిడ్డల హక్కులకు సంబంధించిన పథకాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కేటీఆర్ ప్రశ్నించారు.
🎯 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రద్దుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రను అడ్డుకోవాలి
🎯 హైకోర్టు తీర్పు సాకుతో పేదింటి ఆడబిడ్డల భరోసాను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ కుట్ర
🎯 కళ్యాణ లక్ష్మి అంశంలో హైకోర్టులో కౌంటర్ వేయకుండా కాంగ్రెస్ కుట్ర చేసింది
🎯 ముఖ్యమంత్రి, మంత్రుల అవినీతి… pic.twitter.com/gm7ANUqNxN
— BRS Party (@BRSparty) August 16, 2026