హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : దేశంలో ప్రాంతీయ పార్టీలను నామరూపాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. అమృత్ పథకం టెండర్లలో అవినీతికి సంబంధించిన ఆధారాలను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చానని చెప్పారు. కాంగ్రెస్‌పై విమర్శలు మాత్రమే కాదని, అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటామని బీజేపీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్‌ను ప్రముఖ జాతీయ చానల్ ఇండియా టుడే ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు
ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభు త్వం నిర్వహించిన ‘అమృత్’ టెండర్లలో అవకతవకలు జరిగాయి. ఇదే అంశంపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వచ్చాను. ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ మార్చి 13న ఎన్ఏసీ, బీఏసీకి రాసిన లేఖతో ఇది బయటికి వచ్చింది. తెలంగాణలో రూ.1,100 కోట్ల పనులను తాము దక్కించుకున్నామని, శోధ కన్స్ట్రక్షన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపింది. ఇందులో 20% పనులు మాత్రమే తాము చేస్తున్నామని, 80% పనులు శోధ కంపెనీ చేపడుతున్నదని లేఖలో వివరించింది. శోధ కంపెనీ సీఎం రేవంత్‌రెడ్డి బావమరిదికి చెందినది. సాంకేతికంగా , ఆర్థికంగా చూసినా ఆ కంపెనీకి పనులు చేపట్టే అర్హత లేదు. సీఎం బంధువనే ఏకైక కారణంతో బిడ్ దక్కింది. క్రోనీ క్యాపిటలిజం, అధికార దుర్వినియోగం గురించి రాహుల్‌గాంధీ మాట్లాడుతుంటారు. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ అదే చేస్తున్నది. ప్రధాని నరేంద్రమోదీ తరుచూ కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని ఆరోపిస్తున్నారు. ఆర్ఆర్ట్యాక్స్, ట్రిపుల్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని దేశమంతటా చెప్తున్నారు. ప్రధాని ఆరోపణలకు సంబంధించి ఆధారాలను సమర్పించడానికే ఢిల్లీకి వచ్చాను. ‘ఆరోపణలు చేయడమే కాదు.. చర్యలు కూడా తీసుకుంటాం’ అని నిరూపించుకోవాలి.
నేను తప్పుగా మాట్లాడానని నిరూపించమని చెప్పండి. శోధ కంపెనీ గత సంవత్సరం లాభం రూ.2.2 కోట్లు మాత్రమే. అలాంటి కంపెనీ రూ.1,100 కోట్ల పనులు ఎలా చేపడుతుందో ఎవరైనా చెప్పగలరా? శోధ కంపెనీ కన్నా దాదాపు రెండు వేల రెట్లు పెద్దదైన ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ కేవలం 20% పనులు మాత్రమే ఎందుకు చేపట్టిందో వివరించగలరా?
అమృత్ పథకం నిధులు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి. పట్టణాభివృద్ధి శాఖకు చెందిన పనులు కాబట్టి మనోహర్‌లాల్ కట్టర్‌ను కలిశాను. గతంలోనూ మంత్రికి లేఖలు రాశాను. కానీ, ఆయన హర్యానా ఎన్నికల్లో బిజీగా ఉండటం వల్ల చూడలేదేమో. అందుకే స్వయంగా వచ్చి వివరాలు ఇచ్చాను. ఇప్పుడైనా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.
ఇప్పుడు రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి బంగారు గనిలా మారారు. గతంలో శివకుమార్ ఉండేవారు, ఇప్పుడు రేవంత్ వచ్చారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌కు ఎక్కడినుంచి డబ్బులు వెళ్తున్నాయో అందరికీ తెలుసు. రేవంత్‌రెడ్డి ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరి దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు? వంటివి మాకు తెలుసు. కానీ దర్యాప్తు సంస్థలు ఎందుకో చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఎస్పీఎన్, బీఎస్పీ వంటి ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టింది. మరి ఎందుకు ఓడిపోయింది? ‘అయితే మీరుండాలి.. లేదంటే మేముండాలి.. మూడో శక్తి ఉండొద్దు’ అనేది వాళ్ల మనసులో ఉన్నది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ఎవరు అడిగారు? ఇది ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టేందుకు కాదా? హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికలను ఒకేసారి జరపలేనప్పుడు దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?
కాంగ్రెస్, బీజేపీ కోరుకుంటున్నది అదే. అన్ని ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసి, రెండు పార్టీల మధ్యలో అధికారం ఉండాలన్నదే ఆ పార్టీల లక్ష్యం.
ఈ ప్రశ్నను రాహుల్‌గాంధీని అడగాలి. ఆయన రోజూ అదానీ గురించి, అవినీతి గురించి మాట్లాడుతున్నారు. రాహుల్గాంధీయేమో ‘అదానీ ఫ్రాడ్’ అంటారు.. రేవంత్ ‘ఫ్రెండ్’ అంటారు. ‘గుజరాత్ మాడల్ బేకార్’ అని రాహుల్ అంటే.. ‘గుజరాత్ మాడల్ అద్భుతం’ అని రేవంత్ పొగుడుతారు. ‘చౌకీదార్ చోర్ హై’ అని రాహుల్ విమర్శిస్తే.. ‘బడేబాయ్’ అని రేవంత్ కొనియాడుతారు. ముందు వాళ్లిద్దరూ ఒకచోట కూర్చొని ఒక్కమాట మీదికి రావాలి. అదానీ ఫ్రెండా? ఫ్రాడా? అనేది కాంగ్రెస్ స్పష్టంచేయాలి. ఒకవేళ ఫ్రాడ్ అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకు అదానీ పెట్టుబడులను స్వాగతిస్తున్నారు? ఎందుకు చెక్కులు అందుకుంటున్నారు? ఒకవేళ ఫ్రెండ్ అయితే రాహుల్‌గాంధీ తన విమర్శలు మానుకోవాలి. దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నది. అదానీ అంశంలో మూడు రాష్ర్టాలనే ఒక్కమాట మీదికి తీసుకురాలేని కాంగ్రెస్.. భారత్ జోడో ఎలా చేస్తుంది.
మన దేశంలో విచిత్రాలు జరుగుతుంటాయి. ప్రజలను బహిరంగంగా కాల్చి చంపిన కసబ్‌ను ఉరితీయడానికి నాలుగేండ్లు పట్టింది. రెడ్ హ్యాండెడ్‌గా రూ.50 లక్షలతో దొరికన రేవంత్‌రెడ్డి ఇప్పుడు బయట సీఎంగా ఉన్నారు. ఇలాంటి విచిత్రాలు జరుగుతుంటాయి. ఒకవేళ వాళ్లు నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చేయమనండి, దర్యాప్తు చేయండి, నిరూపించమనండి. తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి.
ప్రస్తుతం హైదరాబాద్‌లో అభివృద్ధికి బదులు విధ్వంసం జరుగుతున్నది. ఆదాయం పడిపోయింది. ఐటీ కంపెనీలు వెళ్లిపోతున్నాయి. కెయిన్స్ కంపెనీని కష్టపడి మైసూర్ నుంచి హైదరాబాద్‌కు తెస్తే.. గుజరాత్‌కు వెళ్లిపోయింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్లాంట్‌ను కష్టపడి యూఎస్ నుంచి తెస్తే తెలంగాణ దాటిపోయింది. ఫాక్స్‌కాన్ కంపెనీ లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు విస్తరణ ఆపేసింది. ఇది నెగెటివ్ గవర్నమెంట్. మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్నది. డీపీఆర్ లేకుండా లక్షన్నర కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. 16వేల ఇండ్ల కూలగొట్టేందుకు సిద్ధమైంది. ఇలాంటి నెగెటివ్ పాలిటిక్స్‌ను నా పొలిటికల్ జీవితంలో చూడలేదు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చింది. గ్యారెంటీల్లో కనీసం సగం కూడా నెరవేర్చలేదు.
ఇండియా టుడే నుంచి ప్రత్యేక బృందం సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గానికే వెళ్లండి. ఒక్క గ్రామంలో అయినా వందశాతం మందికి రుణమాఫీ అయినట్టు చెప్తే నేను ఆరోపణలను వెనక్కి తీసుకుంటా. కాంగ్రెస్ పార్టీ 75 ఏండ్లుగా అబద్ధాలు చెప్తునే ఉన్నది. ప్రజలను మోసం చేయడంలో వాళ్లు ప్రొఫెషనల్స్.
మేము మహారాష్ట్రలో విస్తరించాలని అనేక ప్రణాళికలు వేశాం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త వెనుకడుగు వేయాల్సి వచ్చింది. మహరాష్ట్రలో ప్రాంతీయ పార్టీలకే ఓటేయాలని ప్రజలను కోరుతున్నాం. శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలకే ఓటేయాలని కోరుతున్నాం. జాతీయ పార్టీలకు ఓటేయొద్దని కోరుతున్నాం.
దేశంలో ఒక నగరాన్ని మరో నగరంతో పోల్చడం సరికాదు. మొత్తంగా అందరం ఒకే దేశం. హైదరాబాద్ ఎవరితోనూ పోటీ పడటం లేదు. తెలంగాణ ల్యాండ్ ల్యాక్డ్ స్టేట్, ఏపీకి కోస్టల్ సిటీ ఉన్నది. అన్నింటికన్నా ముఖ్యంగా నగరాలను ఎవరో ఒకరు సృష్టించలేరు. అవి స్వయంగా అభివృద్ధి చెందాలి. కేవలం నిర్మాణాలు మాత్రమే మన చేతిలో ఉంటాయి. అమరావతి కూడా అభివృద్ధి చెందాలన్నదే మా ఆకాంక్ష.
తెలంగాణలో ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’ నడుస్తున్నది. తెలంగాణకు వచ్చి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. కొన్నాళ్ల కిందట రెవెన్యూ శాఖ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు జరిగాయి. రెండు కౌంటింగ్ మెషీన్లతో డబ్బులు లెక్కిస్తున్నారని మీడియాలో వచ్చింది. ఐదు వారాలు గడిచినా ఈడీ నుంచి కనీసం ఐదు వాక్యాలతో స్టేట్మెంట్ రాలేదు. మంత్రి కూడా చెప్పడం లేదు. అదానీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి ఐటీసీ కోహినూర్‌లో రహస్యంగా సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని మేం బహిర్గతం చేస్తే ఇప్పటివరకు ఒక్కరూ ఖండించలేదు. కర్ణాటకలో వాల్మీకీ స్కాం జరిగింది. ఈడీ చెప్పినదాని ప్రకారం రూ.35 కోట్లు తెలంగాణకు వచ్చాయి. వాటిని ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించారు. కానీ, ఇప్పటివరకు తెలంగాణలో ఎవరి మీదా కేసులు లేవు, విచారణ లేదు. అమృత్ స్కాంపై ఫిబ్రవరిలోనే కేంద్రానికి లేఖ రాశాం. కానీ, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా జరగలేదు. ప్రధాని మోదీ తరుచూ ఏటీఎం, ఆర్ఆర్ట్యాక్స్ అని ఆరోపిస్తున్నారే తప్ప, విచారణ జరపడం లేదు. వీటిని బట్టే బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని అర్థం అవుతున్నది. తెలంగాణలో బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేస్తే ఇద్దరమే ఏలుకోవచ్చని అనుకుంటున్నట్టు స్పష్టంగా తేలుతున్నది.
కాంగ్రెస్ పార్టీ ఆరు జనాభా గణనలు చేసిన తర్వాత ఇప్పుడు కులగణన చేయాలని అనుకోవడం విచిత్రం. కచ్చితమైన లక్ష్యం లేకపోతే కులసర్వేతో లాభం ఉండదు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే సర్వేను స్వాగతిస్తాం. కానీ, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో లబ్ధి కోసమే చేస్తున్నారు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం. సర్వేలో 75 ప్రశ్నలు అడగడంపై అభ్యంతరం చెప్తున్నాం. సామాజిక పరిస్థితులు తెలుసుకోవడం వరకే పరిమితం కాకుండా.. ఇంట్లో ఫ్రిజ్ ఉన్నదా? ఏసీ ఉన్నదా? రాజకీయ చరిత్ర ఏమిటి? వంటివి ఎందుకు? అందుకే తెలంగాణ ప్రజలు తిరగబడుతున్నారు. ఈ సమాచారం తీసుకొని సంక్షేమ పథకాలను తీసేస్తారని అనుమానిస్తున్నారు. ఈ సర్వేతో ఏం చేస్తున్నారో రాహుల్‌గాంధీ చెప్పాలి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచడమే లక్ష్యం అయితే.. నేరుగా పెంచొచ్చు. సర్వే ఎందుకు? వచ్చిన ఫలితాలతో ఏం చేస్తారు? 50% రిజర్వేషన్ల అడ్డంకిని ఎలా అదిగమిస్తారు. వంటివి చెప్పకుండా ప్రజలను మళ్లీ ఫూల్ చేస్తున్నారు.
ఫార్ములా-ఈ రేసులో ఏ కుంభకోణం ఉన్నదో చెప్పాలి? అంతర్జాతీయ ఈవెంట్‌ను హైదరాబాద్‌కు కష్టపడి తీసుకొచ్చాను. నాలుగేండ్లపాటు నిర్వహించేలా ఒప్పందం చేసుకున్నాం. మొదటి సంవత్సరం సూపర్ హిట్. 31వేల మంది వీక్షించారు. నెల్సన్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్‌కు 82 మిలియన్ డాలర్ల ఆర్థిక ప్రయోజనం కలిగింది. మేం రూ.40-45 కోట్లు వెచ్చిస్తే, రూ.700 కోట్లు లాభం కలిగింది. రెండో సంవత్సరం ప్రమోటర్ వెనక్కి వెళ్లిపోవడంతో, మేం అడ్వాన్స్ చెల్లించాల్సి వచ్చింది. అందుకే రూ.50 కోట్లు కట్టండి.. నేను ప్రమోటర్‌ను తీసుకొస్తాను, ఈవెంటన్ను ఇంకా బాగా చేస్తామని చెప్పాను. ఇందులో అవినీతి ఏముంది? దీనికి మొత్తం బాధ్యత నాదే. ఈ ఏడాది కూడా నిర్వహించి ఉంటే 90 మిలియన్ డాలర్ల ప్రయోజనం కలిగేది. కాంగెస్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అంతర్జాతీయంగా తెలంగాణ పరువు పోయింది. మేం ఫార్ములా-ఈ తో హైదరాబాద్‌కు ఇంటర్నేషనల్ ఫేమ్ తెస్తే.. కాంగ్రెస్ ఇంటర్నేషనల్ షేమ్ చేసింది. నిజంగా అవినీతి ఉంటే నిరూపించమనండి. దేశంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్లొచ్చు. పాస్‌పోర్ట్‌గానీ, రేవంత్ పర్మిషన్గారీ అవసరం లేదు. రేవంత్ రెడ్డి 11 నెలల్లో 26సార్లు డిల్లీకి రావొచ్చు.. కానీ నేను మూడునాలుగుసార్లు ఢిల్లీకి రావద్దా? 26 సార్లు వచ్చి కనీసం 26 పైసలైనా తెచ్చారా? మీరు ఢిల్లీకి గులాములు. మేముం ఎవరికీ గులాములం కాదు. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్, బీజేపీ.. ఎవరితో అయినా పోరాడుతాం.
ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలను దృష్టిని పెట్టుకొనే ఏ పెట్టుబడినైనా వ్యతిరేకిస్తాం. అదానీ ఇప్పుడు నల్లగొండ జిల్లలోని రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేస్తున్నారు. దీనిని గ్రామ ప్రజలు మొత్తం వ్యతిరేకిస్తున్నారు. కానీ, రేవంత్‌రెడ్డి అదానీ నుంచి రూ.100 కోట్ల చెక్ అందుకున్నారు కాబట్టి ఫ్యాక్టరీని అక్కడే పెట్టాలని నిర్ణయించుకున్నారు. అదానీ తెలంగాణకు వచ్చిన తర్వాత రెవెన్యూ మంత్రితో సంబంధాలు పెంచుకున్నారని చెప్పుకుంటున్నారు. త్వరలో ఐవీఆర్‌సీఎల్‌ను టేకోవర్ చేస్తారని, హైదరాబాద్‌లో 84 ఎకరాల విలువైన భూములు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్నది. ఇవన్నీ పదవిని దుర్వినియోగం చేసి, సంపదను పోగేసుకోవడానికే. ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను కూలగొట్టడం, ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడం వంటివి చేస్తారు. ఈ పరిణామాలు దేశానికి మంచివి కాదు.