హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ ముద్దుగుమ్మలు వెళ్తున్నారని గుడిసెలు కనిపించకుండా వరంగల్ రహదారి వెంట ఉన్న పేదల గుడిసెలు, జీవనోపాధిని తొలగించడానికి కాంగ్రెస్ సర్కారుకు సిగ్గు లేదా? అని బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్ర హం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందం ఉన్నదా? అని నిలదీశారు. దీనిపై సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని డిమాండ్ చేశారు. ‘ప్రతిరోజూ ప్రజల ఇండ్లను, జీవనోపాధిని ధ్వంసం చేయడానికి ఈ అత్యుత్సాహం వెనుక ఉన్న కారణం ఏమిటి?
వరంగల్‌లో ఎందుకు కూల్చివేతలు జరుగుతున్నాయి? మిస్ వరల్డ్ పోటీదారులు ఈ రోజు సందర్శించే మార్గాన్ని అందంగా చేయడానికి గుడిసెలు తొలగిస్తరా? ఇది ప్రజాపాలన అని పిలుచుకోవడం ఎంత దారుణం? ప్యాలెస్‌లలో విలాసవంతమైన విందులు, ప్రజల డబ్బుతో రూ.200 కోట్లకుపైగా వృథాగా ఖర్చు చేసిన తర్వాత కూడా పేద ప్రజల జీవితాలను మీ భయంకర బుల్డోజర్ల కింద నలిపివేయాల్సి వచ్చిందా? ఈ సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేను సమాధానాలు డిమాండ్ చేస్తున్న’ అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. బుల్డోజర్లు కూల్చివేసిన తర్వాత శిథిలాలు, కర్రలను ఒకదగ్గరకు చేరుస్తున్న బాధితుల వీడియోలను తన పోస్టుకు జత చేశారు