Krishna Water | హైదరాబాద్, ఫిబ్రవరి28 (నమస్తే తెలంగాణ): కృష్ణాజలాల వినియోగంలో ఏపీ, తెలంగాణ రాజీకి వచ్చాయని, అందుబాటులో ఉన్న జలాలను చర్చించుకుని వినియోగించుకునేందుకు ఒప్పుకున్నాయని కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) వెల్లడించింది. ఈ మేరకు గురువారం నిర్వహించిన బోర్డు సమావేశ వివరాలను శుక్రవారం విడుదల చేసింది. శ్రీశైలంలో కనీస నీటి నిల్వ స్థాయి 820 అడుగులుగా నిర్ధారించామని, ఆపైన రిజర్వాయర్లో 35.613 టీఎంసీలు ఉన్నాయని, సాగర్ ఎండీడీఎల్ను 515గా నిర్ధారించగా, అందులో 29.593 టీఎంసీలు, మొత్తంగా 65 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయని కేఆర్ఎంబీ తెలిపింది. ఆ నీటిని పొదుపుగా వాడుకునేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు రాజీకి వచ్చాయని, ఎప్పటికప్పుడు చర్చించుకొని నీటిని వాడుకునేందుకు ఒప్పుకున్నాయని పేర్కొన్నది.
తాగునీటికి ఇబ్బందులు రాకుండా రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని, ప్రతి 15 రోజులకోసారి ఈఎన్సీలు, ప్రతి నెలాఖరున 2 రాష్ట్రాల సెక్రటరీలు సమావేశమై చర్చించుకోవాలని సూచించామని బోర్డు వెల్లడించింది. ఇదిలా ఉంటే ఏ రాష్ర్టానికి ఎంతనీటిని వాడుకోవాలనే విషయాన్ని మాత్రం బోర్డు వెల్లడించలేదు. అధికారులు సైతం చెప్పకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఏపీ ఇప్పటికే కోటాకు మించి కృష్ణా జలాలను తరలించగా, తాజాగా మళ్లీ నీటి తరలింపునకు పట్టుబట్టింది.
తెలంగాణ కోటా మేరకు నీళ్లను వినియోగించుకోక పోవడమే కాక, 116 టీఎంసీలు అవసరమవుతాయని తొలుత ఇండెంట్ పెట్టి, ఆ తర్వాత 63 టీఎంసీలు కావాలని గగ్గోలు చేసింది. వాదనలు వినిపించలేక, నీటివాటాను సాధించలేక తుదకు ఏపీతో రాజీపడింది. మరోవైపు సాగర్ చివరి ఆయకట్టులో పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం చేతులేత్తయడంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.