హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) ప్రత్యేక, అత్యవసర సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తాము హాజరుకాలేమని, వాయిదా వేయాలని ఏపీ అధికారులు కోరారు. దీంతో సమావేశాన్ని సోమవారానికి బోర్డు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం జరుగనుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సమాచారం అందించామని అధికారులు వెల్లడించారు. కాగా, శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తున్నదని, వెంటనే అడ్డుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. రెండు ప్రాజెక్టుల పరిధిలో 35 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఏపీ విజ్ఞప్తితో సమావేశం వాయిదాపడింది.
అయితే కృష్ణా, గోదావరి జలాలను ఏపీ తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించిన విషయం తెలసిందే. 666 టీఎంసీలకు గాను ఏపీ ఇప్పటికే 657 టీఎంసీలను వినియోగించుకున్నదని, తెలంగాణకు 343 టీఎంసీలకు గాను 220 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవడం ప్రభుత్వ అసమర్ధతేనని మండిపడ్డారు. ఇప్పటికైనా సర్కారు కండ్లు తెరిచి రైతుల పంటలు కాపాడలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నీటి విడుదలను వెంటనే బంద్ చేయించాలని డిమాండ్ చేశారు.