హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు శుక్రవారం నిర్వహించాల్సిన అత్యవసర సమావేశాన్ని ఈ నెల 24కు వాయిదా వేసింది. అనివార్య కారణాలతో హాజరుకాలేకపోతున్నామని, సమావేశాన్ని మరో రోజుకు వాయిదా వేయాలని బోర్డుకు ఏపీ సర్కారు లేఖ రాయడంతో సమావేశాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాల ప్రభుత్వాలకు బోర్డు చైర్మన్ అతుల్ జైన్ సమాచారం అందించారు. ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం వాటాకు మించి కృష్ణా జలాలను మళ్లించుకుపోయింది. ఇదే అంశంపై రాజకీయ దుమారం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని బోర్డు నిర్ణయించినా ఏపీ సర్కారు సమావేశాన్ని వాయిదా వేయాలని కోరడం చర్చనీయాంశంగా మారింది.
ఆర్‌అండ్‌ఆర్‌కు నిధులిస్తేనే పనులు ; ప్రభుత్వానికి స్పష్టంచేసిన ఇరిగేషన్ ఇంజినీర్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): నిర్వాసితుల సహాయ, పునరావాసానికి నిధులను పూర్తిస్థాయిలో చెల్లిస్తేనే ప్రాజెక్టుల పనులు ముందుకు సాగుతాయని నీటిపారుదలశాఖ ఇంజినీర్లు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. ప్రాధాన్య ప్రాజెక్టులపై ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు, భూసేకరణ అధికారులు శుక్రవారం జలసౌధలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలోని సమస్యలను ఇంజినీర్లు ఉన్నతాధికారులకు నివేదించారు. పనులు ముందుకు సాగాలంటే ఆర్అండ్ఆర్ నిధులను చెల్లించాలని తేల్చిచెప్పినట్టు తెలుస్తున్నది. ప్రాధాన్య ప్రాజెక్టులకు దాదాపు 5వేల ఎకరాలకు పైగా భూమి సేకరించాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్తున్నది.