హైదరాబాద్, ఏప్రిల్5 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు సంబంధించి పలు ఔట్లెట్లపై ఫేజ్ 2 కింద ఏర్పాటు చేయాల్సిన టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు కోసం నిధులను విడుదల చేయాలని ఇరు రాష్ర్టాలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) లేఖ రాసింది. కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదలకు సంబంధించిన లెక్కలను పక్కాగా సేకరించేందుకు టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలని గతంలోనే తెలంగాణ, ఏపీలు అంగీకరించాయి. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే 18 చోట్ల టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయగా, ఫేజ్ 2 కింద మరో 9 చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన నిధులను విడుదల చేయకపోవడంతో నిధుల ఇవ్వాలని కోరుతూ బోర్డు మరోసారి లేఖలు రాసింది. సవరించిన అంచనాల ప్రకారం రూ. 6.25 కోట్ల నిధులు అవసరమని, వాటిని వెంటనే విడుదల చేయాలని లేఖలో ఇరు రాష్ర్టాలకు బోర్డు సూచించింది.