ముషీరాబాద్, మే 11: రాజ్యాంగాన్ని రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తొలగిస్తారనే చర్చపై ప్రధాని మోదీ, బీజేపీ పెద్దలు స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జనగణన, కులగణన, బీసీల 50% రిజర్వేషన్ల కల్పన విషయంలో బీజేపీ వైఖరేంటో చెప్పాలని కోరారు. శనివారం హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. ఓట్లకోసం బీసీ ప్రధానీ అంటూనే బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. భారత మాత పేరిట అదానీ, అంబానీల ఖజానా పెంచడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
బీజేపీ నేతలు బీసీలను మభ్యపెట్టడం మాని 50 శాతం రిజర్వేషన్లు, ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్లు, బీసీ మంత్రిత్వ శాఖ, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అంశంపై తమ విధానమేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎక్కడా బీసీ సమస్యలపై ప్రస్తావించకపోవడం శోచనీయమని, పదేళ్ల మోదీ పాలనలో బీసీల అభివృద్ధికి ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేకపోయిందని మండిపడ్డారు. రిజర్వేషన్ల ఎత్తివేత అంశంతోపాటు కులగణన విషయంలో బీజేపీ స్పష్టతనిస్తేనే ఆ పార్టీకి బీసీలు ఓట్లు వేస్తారని, లేని పక్షంలో ఓటుతో సమాధానం చెప్పక తప్పదని హెచ్చరించారు. వచ్చే జూన్, జూలై నెలల్లో బీసీ సమస్యలపై దేశవ్యాప్తంగా ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, రాజేందర్, అనంతయ్య, నందకిశోర్, ప్రణీతారాణి తదితరులు పాల్గొన్నారు.