Krishna Water | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరాకు ప్రాణాధారమైన కృష్ణాజలాల తరలింపునకు ముప్పు పొంచి ఉన్నదా? నాగార్జునసాగర్‌లో పుష్కలంగా నీటిమట్టం ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళన అధికార యంత్రాంగంలో మొదలైందా? నీటిపారుదల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ ఇటీవల ప్రభుత్వానికి రాసిన లేఖను పరిశీలిస్తే ఇవి నిజమేననిపిస్తుంది. ఇప్పటికిప్పుడు తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేనప్పటికీ, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) సిస్టర్న్ (చిన్న రిజర్వాయర్) వద్ద ఏర్పడిన లీకేజీలతోపాటు ప్రాజెక్టులోని లింక్ కెనాల్‌పై పలుచోట్ల దెబ్బతిన్నందున వెంటనే అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో హెచ్చరించారు. శాశ్వత మరమ్మతులు చేపట్టకపోతే ఊహించని సంఘటనతో పెను ప్రమాదం జరుగుతుందనే సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తాగునీటి సరఫరా కొనసాగేందుకు జలమండలి ప్రత్యామ్నాయం చూసుకోనేలా చర్యలు తీసుకోవాలని లేఖలో ఈఎన్సీ ప్రభుత్వానికి సూచించారు.
ప్రత్యామ్నాయం ఉందా?!
ఇలాంటి అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయనే ముందుచూపుతోనే కేసీఆర్ ప్రభుత్వం సుంకిశాల పథకాన్ని చేపట్టింది. 80 శాతానికిపైగా పనులు పూర్తిచేశారు. ఈ పథకం అందుబాటులోకి వస్తే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుతో సంబంధం లేకుండా నాగార్జునసాగర్ జలాశయం నుంచి నేరుగా కృష్ణాజలాలను తోడుకునే అవకాశం ఉండేది. జలమండలితోపాటు నిర్మాణ సంస్థ మేఘా తప్పిదంతో ఈ బృహత్తర పథకం పనులు గత ఏడాది ఆగస్టులో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కార్మికుల కండ్ల ముందే రిటెయినింగ్ వాల్ నిట్టనిలువునా కుప్పకూలింది. ఫలితంగా హైదరాబాద్‌కు కృష్ణాజలాలు తరలించే ప్రత్యామ్నాయ మార్గం మూసుకుపోయింది. నిర్ణీత గడువు ప్రకారం గత డిసెంబర్లో ఈ పథకం అందుబాటులోకి వచ్చి ఉంటే నగర నీటి సరఫరాకు ఈ గండం పొంచి ఉండేది కాదు. ముఖ్యంగా ఘటన జరిగినప్పుడు రెండు నెలల్లోనే పనులు పునరుద్ధరిస్తామంటూ నిర్మాణ సంస్థతోపాటు సాక్షాత్తూ ముగ్గురు మంత్రులు ప్రకటించి నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు పనులు పునరుద్ధరించేందుకు కించిత్తు అవకాశం కూడా లేదు.
హైదరాబాద్ అవసరాల్లో కృష్ణా జలాల వాటా 48%
హైదరాబాద్‌కు తాగునీటిని అందించేందుకు జలమండలి.. కృష్ణా, గోదావరి, సింగూరు-మంజీరా, జంట జలాశయాల నుంచి రోజుకు సుమారు 565 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నది. ఇందులో కేవలం కృష్ణాజలాలే రోజుకు 270 మిలియన్ గ్యాలన్లు (ఏడాదికి 16.5 టీఎంసీలు). అంటే నగరానికి సరఫరా అవుతున్న మంచినీటి పరిమాణంలో కృష్ణాజలాల వాటా దాదాపు సగం (48%). ఇంతటి కీలకమైన జలాల తరలింపు ప్రక్రియ నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) ఆధారంగా జరుగుతుంది. పుట్టంగండి వద్ద నాగార్జునసాగర్ జలాశయం ఫోర్‌షోర్ నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసుకొని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిల్వ ఉంచుతారు. అక్కడినుంచి సమీపంలోని కోదండాపూర్ నీటి శుద్ధి కేంద్రానికి తరలించుకొని వివిధ దశల్లో శుద్ధి చేసి నగరానికి సరఫరా చేస్తున్నారు. అంటే ఏఎమ్మార్ ప్రాజెక్టులోని మోటర్ల నుంచి నీటిని లిఫ్టు చేస్తే తప్ప హైదరాబాద్‌కు కృష్ణాజలాల తరలింపు కుదరదు. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్టులోని పలు కీలక నిర్మాణాలకు శాశ్వత మరమ్మతులు చేయడం అనివార్యంగా మారిందని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు గుర్తించారు.
సిస్టర్న్‌కు పొంచి ఉన్న ముప్పు?
ఏఎమ్మార్ ప్రాజెక్టులో భాగంగా పుట్టంగండి వద్ద నాగార్జునసాగర్ జలాశయం నుంచి కృష్ణాజలాలను మోటర్ల ద్వారా సిస్టర్న్ (చిన్న జలాశయం)లోకి ఎత్తిపోస్తారు. అక్కడినుంచి 9.26 కిలోమీటర్ల లింక్ కెనాల్ ద్వారా నీటిని హైదరాబాద్-సాగర్ హైవేకు సమీపంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి తరలిస్తారు. ఆ రిజర్వాయర్ నుంచి జలమండలి అధికారులు ఒక పైప్‌లైన్ ద్వారా రోజుకు 330 క్యూసెక్కుల నీటిని కోదండాపూర్ నీటిశుద్ధి కేంద్రానికి తీసుకుంటారు. అయితే, ఏఎమ్మార్ ప్రాజెక్టులోని సిస్టర్న్ వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ప్రాజెక్టు ప్రారంభం నుంచీ ఇవి ఉన్నప్పటికీ పలుమార్లు మరమ్మత్తులు చేశారు. అయినప్పటికీ భారీ వర్షాల కారణంగా సిస్టర్న్ రిజర్వాయర్ వాల్ పలుచోట్ల కూలిపోగా ఇసుక బస్తాలు వేసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టినట్టు ఈఎన్సీ తన లేఖలో పేర్కొన్నారు. అనంతరం పలుసార్లు ఇంజినీర్లు పరిశీలించగా సిస్టర్న్‌కు శాశ్వత మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్నదని నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. దీంతోపాటు సిస్టర్న్ నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న 9.26 కిలోమీటర్ల లింక్‌కెనాల్ కూడా పలుచోట్ల దెబ్బతినగా, అక్కడ తాత్కాలిక మరమ్మతులు చేసినా, శాశ్వత మరమ్మతులు చేయాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ప్రాజెక్టులో ఈ రెండు కీలకమైన నిర్మాణాలు అని, వీటిపైనే మూడు లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు హైదరాబాద్ తాగునీరు, మిషన్ భగీరథ కూడా ఆధారపడి ఉన్నదని వివరించారు.
ప్రత్యామ్నాయం చూసుకోండి
సిస్టర్న్, లింక్ కెనాల్‌కు మరమ్మతులు చేయాల్సి ఉన్నందున జలమండలి అధికారులను ప్రత్యామ్నాయం చూసుకునేలా చర్యలు తీసుకోవాలని ఈఎన్సీ తన లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పుట్టంగండి నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ప్రత్యేక పైప్‌లైన్ వేసుకోవాలని సూచించారు. దీనికోసం భూసేకరణ చేయాల్సిన అవసరంలేదని, లింక్‌కెనాల్ వెంట పైప్‌లైన్ ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. సిస్టర్న్‌కు గండిపడితే దిగువన ఉన్న పంప్‌హౌస్‌కు పెను ప్రమాదం ఉంటుందని ఈఎన్సీ తన లేఖలో ప్రస్తావించారు. మరమ్మతులకు మూడు నెలల సమయం పడుతున్నందున ఆ మేరకు ప్రత్యామ్నాయం చేసుకోవాలని సూచించారు. రాను న్న వేసవిలో శాశ్వత మరమ్మతులు చేస్తేనే వచ్చే వానకాలం సీజన్‌కు ఏఎమ్మార్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి, నల్లగొండ జిల్లాలోని దాదాపు 200 చెరువులను నింపే అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు.
సుంకిశాలలో నాలుగు నెలలైనా అదే పరిస్థితి
హైదరాబాద్ తాగునీటికి కేసీఆర్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారంగా చూపిన సుంకిశాల పథకంలో గత ఏడాది ఆగస్టు మొదట్లో రిటెయినింగ్ వాల్ కుప్పకూలి, సొరంగాలన్నీ నీటమునిగాయి. ఈ క్రమంలో నిర్మాణ సంస్థతోపాటు అప్పుడు అక్కడ పర్యటించిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రెండు నెలల్లో పనులు మొదలవుతాయని ప్రకటించారు. కానీ ఇప్పటికి నాలుగు నెలలు గడిచినా అక్కడ కించిత్తు పునరుద్ధరణ పనులు మొదలుకాలేదు. ముఖ్యంగా పంపుహౌస్‌లో అప్పుడు ఏస్థాయిలో నీటిమట్టం ఉన్నదో.. ఇప్పుడు కూడా అదేస్థాయిలో నీటిమట్టం ఉన్నట్టు తెలిసింది. గతంలో ఆ తప్పిదం జరగకపోయి ఉంటే గత ఏడాది డిసెంబర్లోనే సుంకిశాల పథ కం అందుబాటులోకి వచ్చేది. ఇప్పుడు ఏఎమ్మార్ ప్రాజెక్టులో మరమ్మతులు జరిగినా సాఫీగా సుంకిశాల నుంచి కృష్ణాజలాల తరలింపు జరిగేది.