హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను మరోసారి బదిలీ చేసింది. మొత్తంగా 13 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఏడాది వ్యవధిలోనే ఒక్కో అధికారి రెండేసిసార్లు బదిలీకావడం గమనార్హం. తాజా బదిలీల్లో ఇటీవల ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన పలువురు ఐఏఎస్‌లకు సైతం ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. మరోవైపు తాజాగా బదిలీ అయిన ఐఏఎస్ అధికారులు మళ్లీ బదిలీ అయ్యే అవకాశాలున్నాయని అధికారవర్గాల్లోనే ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
అత్యంత కీలకమైన ట్రాన్స్‌కో సీఎండీగా కృష్ణభాసర్ నియమితులయ్యారు. కేవలం 11 నెలల కాలంలోనే అత్యంత కీలకమైన ట్రాన్స్‌కో సీఎండీ పోస్టులో నలుగురు అధికారులు మారారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలుత రిజ్వీ నియమితులయ్యారు. ఆయన కుదురుకునేలోగానే ప్రభుత్వం బదిలీ చేసి, ఆయన స్థానంలో రొనాల్డ్‌రోస్‌ను నియమించింది. కానీ ఆయన బాధ్యతలు చేపట్టిన స్వల్ప కాలంలోనే ఏపీ క్యాడర్‌కు వెళ్లిపోయారు. దీంతో సీఎండీగా సందీప్‌కుమార్ సుల్తానీయాకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆయనను రిలీవ్ చేస్తూ కృష్ణ భాసర్ను ప్రభుత్వం నియమించింది. ఆయన డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఐఏఎస్ అధికారి కృష్ణ ఆది త్యను ఇంటర్‌బోర్డు డైరెక్టర్‌గా పోస్టింగ్నివ్వడమే కాకుండా టీజీఈడబ్ల్యూఐడీసీ వైస్ చైర్మన్, ఎండీగా అదనపు బాధ్యతలప్పగించారు. తొలుత ములుగు జిల్లా కలెక్టర్‌గా, పీసీబీ సభ్యకార్యదర్శిగా, కార్మికశాఖ కమిషనర్‌గా నియమించారు.
ప్రస్తుతం బదిలీ అయిన ఐఏఎస్‌ల్లో ఏడాది కాలంలోనే రెండేసి సార్లు శాఖలు మారిన వారు ఉన్నారు. పర్యాటకం, సాంసృతిక , యువజన సర్వీసులశాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ నియమితులయ్యారు. ఆమె రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగానూ అదనపు బాధ్యతల్లో కూడా కొనసాగనున్నారు. రవాణాశాఖ కమిషనర్‌గా సురేంద్రమోహన్ను నియమించారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఈ శ్రీధర్‌ను బదిలీచేస్తూ.. దేవాదాయశాఖ కమిషనర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మహిళ, శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబరితి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా సీహెచ్ హరికిరణ్, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా శివశంకర్, ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా గౌరవ్‌ఉప్పల్, లేబర్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సంజయ్‌కుమార్ నియామకమయ్యారు. ఈయన లేబర్ కమిషనర్‌గా కూడా అదనపు బాధ్యతల్లో ఆయన కొనసాగనున్నారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న చిట్టెం లక్ష్మిని ఆయూష్ డైరెక్టర్‌గా, ఐఏఎస్ సృజనను పంచాయతీరాజ్ అండ్ ఆర్అండ్బీ డైరెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.