హనుమకొండ రస్తా, జులై 23 : ఈనెల 26న 1902లో ఛత్రపతి సాహు మహారాజు ప్రకటించిన రిజర్వేషన్ డే సందర్భంగా 42 మంది బీసీ ప్రతినిధులతో 42 శాతం రిజర్వేషన్ల సాధనకు హనుమకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ పార్కు(ఏకశిల పార్కు)లో దీక్ష చేయనున్నట్లు తెలంగాణ బీసీ మహాసేన రాష్ట్ర కన్వీనర్ తాడిశెట్టి క్రాంతికుమార్ తెలిపారు. హనుమకొండలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినరోజు జూలై 26, 1902లో తొలిసారిగా బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పిస్తూ 50 శాతం రిజర్వేషన్ అమలుచేసిన గొప్ప నేత ఛత్రపతి సాహూ మహారాజ్ అన్నారు.
ఆయన తాత ఛత్రపతి శివాజీ మహారాజ్ తాత పౌరుషాన్ని, జ్ఞానాన్ని వారసత్వంగా పొంది, భారత మూలవాసుల హక్కుల కోసం పోరాటం చేసిన నిజమైన యోధుడిగా చరిత్రలో నిలిచారని, వారి స్ఫూర్తితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు దీక్ష చేయనున్నట్లు చెప్పారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం అందాలన్నారు. 42 శాతం రిజర్వేషన్‌ను రాజ్యాంగబద్ధంగా అమలుచేసే వరకు ఈ పోరాటం ఆగదని బీసీ నాయకులు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సుధాకర్ ముదిరాజ్, నలుబోల రవికుమార్, జూకంటి రవీందర్, నారాయణగిరిరాజు, పెద్దోజు వెంకటాచారి, తాటికొండ సద్గుణ, కర్రే చంద్రశేఖర్, నలుబోల అమరేందర్, గణేష్, అనిశెట్టి సాయితేజ, నలుబోల సంజయ్‌కుమార్, రాపోలు అశోక్, ఉదయ్‌సాయి, మహేష్, కంజుల స్వప్నరాణి, మాధవి, స్వాతి, ప్రసన్న పాల్గొన్నారు.