హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ఫిరాయింపులపై సంబంధిత పార్టీలు, సభ్యులు కోర్టుల మెట్లు ఎక్కకముందే నిర్ణయాలు తీసుకునేలా పటిష్ట వ్యవస్థను పార్లమెంట్ రూపొందించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి కోరారు. ఇందుకోసం ఉభయ సభల్లో రాజ్యాంగం, చట్టాలు, ప్రజాస్వామ్య, పార్లమెంటరీ ప్రాతినిధ్య వ్యవస్థలపై అవగాహన, అనుభవం, నైపుణ్యం కలిగిన సభ్యులతో కమిటీ వేయాలని చెప్పారు.
కమిటీ సూచనలు, ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించి ఫిరాయింపుల నిషేధ చట్టానికి సవరణలు చేసేలా ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలా చేస్తే డైమండ్ జూబ్లీ గణతంత్రానికి నిజమైన విలువ ఇచ్చినట్టు అవుతుందని పేర్కొన్నారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేఆర్ సురేశ్‌రెడ్డి పలు అంశాలు లేవనెత్తారు.
దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75వ వసంతాలు పూర్తయి సంబురాలు జరుపుకొంటున్న నేపథ్యంలో ఆ పవిత్రకు విలువ ఇవ్వాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ ప్రతులు పట్టుకొని కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఫిరాయింపుల నిషేధ చట్టంపై సవరణ తెస్తామని చెప్పి ఆ రాజ్యాంగానికే తూట్లు పొడుస్తున్నాయని ఉదహరించారు.
వాజ్పేయిహయాంలో రాజ్యాం గ మార్పుపై వేసిన కమిటీ చేసిన ప్రధాన సూచన, 10వ షెడ్యూల్‌ను మార్చాలన్న అంశాన్ని ఆయన గుర్తుచేశారు. విలువల హననాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత పార్లమెంట్‌పై ఉందని చెప్పారు. మణిపూర్ పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు మన పార్లమెంటరీ వ్యవస్థకు చెంపపెట్టులాంటిందని ఉదహరించారు.
దేశంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగంపై పార్లమెంట్ ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరముందని సురేశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కనీస మద్దతు ధర, ఎరువులు, విత్తనాలు, పంట దిగుబడులు, ప్రాంతాలవారీగా నెలకొన్న అసమతుల్య వైరుధ్యాలపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరముందని సూచించారు. చిన్న, మధ్య తరహా పారిశ్రామిక (ఎంఎస్ఎంఈ) విధానంపైనా చర్చించాలని చెప్పారు.
రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం ఇంకా ఎంతకాలం తీసుకుటుందని సురేశ్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రాంతాలుగా విడిపోదాం. అన్నదమ్ములుగా పురోగమిద్దాం’ అని ఉద్యమ సమయంలో కేసీఆర్ స్పష్టంగా చెప్పినట్టే రెండు ప్రాంతాల ప్రజల మధ్య సఖ్యతలో ఇబ్బంది లేదని, సమస్యల పరిష్కారంపైనే కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్నదనే అభిప్రాయం నెలకొన్నదని చెప్పారు. తక్షణమే చర్చకు అవకాశం ఇవ్వాలని, లేదంటే ఆ శాఖలకు డైరెక్షన్ ఇచ్చినా మంచిదేనని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ సభ్యుల సంఖ్యను బట్టి కాకుండా అంశం తీవ్రత బట్టి అవకాశం కల్పించాలని, వీలుకాని పక్షంలో కనీసం వారానికి రెండుసార్లు సభాపతి దగ్గర ఫ్లోర్ లీడర్లతో సమావేశం నిర్వహించి తాము లేవనెత్తే అంశాలకు పరిష్కార మార్గాలు చూపాలని కోరారు.