KP Vivekananda | పెట్రోల్, డీజీల్, గ్యాస్ అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రజలకు సరైన భరోసా ఇవ్వడం లేదని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేపీ వివేకానంద మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా స్టాక్స్ పెట్టుకుని ఉంటే ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదని స్పష్టం చేశారు.
యూరియా కొరతతో రైతులు ఎలా ఇబ్బంది పడ్డారో ఇన్ని రోజులు చూశాం.. ఇప్పుడు ఇంధన కొరతను చూస్తున్నామని కేపీ వివేకానంద తెలిపారు. ఇంధన నిల్వలపై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకోవడం లేదని విమర్శించారు. యుద్ధం జరుగుతున్న దేశాల్లో ఇబ్బంది లేదు కానీ.. యుద్ధం లేని దేశాలు మాత్రం ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. ఇంధన కొరతను ఊహించలేకపోవడం వల్లే ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని అన్నారు.
పెట్రోల్, డీజిల్ గ్యాస్ లేకపోతే పొద్దుగడవదని కేపీ వివేకానంద అన్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఒకరిపై మరొకరు నెపం మోపుతూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు.