హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై కక్షసాధింపు చర్యలు ఉంటున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekananda) విమర్శించారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల పేరుతో కేసీఆర్‌పై, ఫార్ములా-ఈ, ఇంట్లో ఫంక్షన్, లగచర్ల విషయంలో కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏడాది నుంచి బీఆర్ఎస్పై కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎలాగైనా కేటీఆర్‌ను జైల్లో పెట్టాలని రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాంబులేటి శ్రీనివాస్ రెడ్డిగా పేరు మార్చుకోవాలన్నారు. బాంబులేటి పేల్చే బాంబులన్నీ తుస్సులవుతున్నాయని విమర్శించారు. పొంగులేటివి నిజంగా పేలే బాంబులు అయితే బయటపెట్టాలన్నారు.