కుత్బుల్లాపూర్, డిసెంబర్28 : ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ సర్కార్ వైఖరిని సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పష్టంచేశారు. ఆరు గ్యారెంటీలపై వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండేండ్లలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. నియోజకవర్గం పరిధిలోని కొంపల్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న సత్సంకల్పంతో కేసీఆర్ ముఖ్యమంత్రి నాడు చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో 90 శాతం పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు.
మిగిలిన కేవలం 10 శాతం పనులను పూర్తిచేయడానికి ఈ రెండేండ్లలో కాంగ్రెస్ సర్కార్ తట్టెడు మట్టికూడా పోసిన పాపానపోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన 13 డిక్లరేషన్లు, 420 హామీల అమలుపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టంచేశారు. రైతు భరోసాను రెండు పర్యాయాలు ఎగ్గొట్టిన ఘనత కాంగ్రెస్ సర్కార్కే దక్కిందని విమర్శించారు. హామీలను అమలు చేయకుండా బోగస్ మాటలతో గత రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తున్నదని ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీలో 22 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ అశాస్త్రీయంగా ప్రభుత్వం చేసిన విఫలయత్నాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తామని తెలిపారు.