కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ) : “కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి వస్తున్నారు. కొబ్బరికాయలు కొడుతున్నారు.. పోతున్నారు.. కానీ.. అభివృద్ధి పనులు మాత్రం నెలలు గడినా ముందుకు జరగడం లేదు.. అలాంటప్పుడు మంత్రి రావడమెందుకు? ప్రజలను మభ్యపెట్టేందుకా.. మంత్రి శంకుస్థాపనలు చేసిన పనులకే గతి లేకుండా పోతోంది.. ఆసిఫాబాద్ నియోజవర్గంలో పేదలకు అందాల్సిన ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారు..” అని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు.
మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి కల్పించుకొని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని? వాటిలో ఎన్ని పూర్తి చేశారని ప్రశ్నించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 3,500 ఇండ్లు వచ్చాయని, పూర్తయిన ఇండ్ల వివరాలు తనవద్ద లేవని చెప్పారు. మంత్రి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కోవ లక్ష్మి సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు.