హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ) : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కినా ఆయనకు ఊరట లభించలేదు. తన ఎన్నికల అఫిడవిట్‌పై దాఖలు చేసిన పిటిషన్‌ను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు. వివరాల్లోకి వెళ్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన కూనంనేని తన అఫిడవిట్‌ను సరిగ్గా దాఖలు చేయలేదంటూ కొత్తగూడేనికి చెందిన నందులాల్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. కూనంనేనిని అనర్హుడిగా ప్రకటించాలని తన పిటిషన్లో కోరారు. దీంతో కూనంనేని సాంబశివరావు ఆ పిటిషన్‌ను క్వాష్ చేయాలని గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు పిటిషన్‌ను క్వాష్ చేయడానికి నిరాకరించారు. దానిపై విచారణ జరగాలని తేల్చారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కూనంనేని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్‌ను క్వాష్ చేయలేమని, విచారణ జరగాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు కూనంనేని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో నందులాల్ వేసిన పిటిషన్ మరికొద్ది రోజుల్లోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది.