మెట్పల్లి టౌన్, ఆక్టోబర్ 6: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజాపాలన చేతకావడం లేదని, అన్ని వర్గాల వారిని మభ్యపెడుతూ తెలివిగా ముందుకెళ్తున్నాడని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఎద్దేవా చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మొన్నటి వరకు అకాల వర్షాలు కురిసి పంటలు నష్టపోతే.. కనీసం వారిని ఓదార్చి, పరిహారాన్ని అందించలేని అసమరర్థ పాలకుడు రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. వర్షాలకు పంట నష్టపోయి అన్నదాతలు అవస్థలు పడుతూ ఉన్న మక్కజొన్న అయినా అమ్ముకుందామంటే ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ప్రతిరోజూ రోడ్లప్తె ఆరబోస్తూ.. సాయత్రం అయితే కుప్పలు చేస్తూ నానా అవస్థలు పడుతున్నానని, ఇప్పటికైనా మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి త్వరితగతిన కొనుగోళ్లు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్‌పై ఎన్నికల్లో ముందుకెళ్తామంటూ ప్రకటించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం షెడ్యూలు విడుదల కాగానే ఆ పార్టీ నాయకులతోనే రిజర్వేషన్ సరిగా లేదంటూ కోర్టులో కేసు వేయించి మళ్లీ అదే పార్టీకి చెందిన మరో న్యాయవాదితో వాదిస్తూ డ్రామా ఆడుతున్నదని మండిపడ్డారు. ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెలు అందించడంలో విఫలమైన ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. కొత్త పింఛన్ల జోలి కూడా తీయడం లేదని, ఉచిత సిలిండర్ నెలకే పరిమితమైందని, ఇందిరమ్మ ఇల్లు ఆశ చూపి కేవలం పదుల సంఖ్యలో కేటాయించి, అవి కూడా పూర్తి చేయడంలో లబ్ధిదారులను నానా ఇబ్బందులు పెడుతున్నదని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మలేని పరిస్ధితుల్లో ఉన్నారని, ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి మాటలు చెప్పడం మానేసి చేతల్లో చూపించాలని డిమాండ్ చేశారు.