ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న హరీశ్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపుతో అక్రమ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎదిరించి వందల కేసులు పెట్టిన భయపడకుండా తెలంగాణ కోసం పోరాడిన నాయకుడు హరీశ్ రావు అని గుర్తుచేశారు. ఆయన నీ తాటాకు చప్పుళ్లకు భయపడరని సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారు.
రెండు అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటే, అది మీ అవివేకమే రేవంత్ రెడ్డి అని కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. మీరు గొప్పగా చెప్పుకుంటున్న ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా అని మండిపడ్డారు. మీ దొంగ హామీలను, మీ ఎగవేతలను నిలదీయడమే మేము చేసిన తప్పా అని ప్రశ్నించారు. మీరు ఎన్ని వందల కేసులు పెట్టినా, మీ ఎగవేతలను ప్రశ్నిస్తూనే ఉంటామని.. ప్రజల కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీకి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన రాధాకిషన్ రావుపై కూడా కేసు నమోదైంది. 120 (బీ), 386,409,506 , రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.