సిద్దిపేట: కాంగ్రెస్ 15 నెలల పాలనలో సాగునీరు, తాగు నీరు ఇవ్వకుండా అటు రైతులను, ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కన్నీటి గోస పేరుతో ఐదు రోజులుగా ఆయన చేస్తున్న మహా పాదయాత్ర సిద్దిపేటకు (Siddipet) చేరింది. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని రెడ్డి సంక్షేమ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు అమలుకు సాధ్యంకాని హామీలను ఇచ్చి గతం బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు కుంగాయని అబద్ధం ప్రచారం చేసి ఇప్పుడు రైతులకు, ప్రజలకు సాగు తాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు.
నీళ్లు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరణ చేశారని, ప్రతి ఎకరాకు నీళ్లు అందాలనే గొప్ప సంకల్పం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ దశను మార్చిన అపర భగీరథుడు కేసీఆర్ అని.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్నికల సమయంలో అనేక అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం సేఫ్ అని చెప్పారని, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసి వివిధ దశల ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ చూశారని గుర్తు చేశారు.
కేసీఆర్కు మంచి పేరు రాకుండా ప్రాజెక్టును ఎండబెట్టారన్నారు. గోదావరి నది 365 రోజులు నాడు సజీవంగా ఉండేదని, అసమర్థత కాంగ్రెస్ పాలన వల్ల గోదావరి నది ఎండిపోయిందన్నారు. కేసీఆర్ మీద కోపంతో ప్రజలను ఇబ్బంది పడుతున్నారన్నారు. అందుకే ఎండిపోయిన గోదావరి నుంచి 180 కి.మీ పాదయాత్ర చేపట్టామని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. నాడు ఉన్న గోదావరి లాగా నీళ్లు రావాలని, లేకపోతే మూకుమ్మడిగా ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.