గోదావరిఖని : రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ గడిచిన రెండు సంవత్సరాల పాలనలో సాధించింది ఏమీలేదని, ఆయన తమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో మక్కాన్‌సింగ్ తాను రెండుసార్లు ఓడిపోయానని కన్నీళ్లు పెట్టుకొని తనను గెలిపించాలని ప్రజలను కోరారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత చిరు వ్యాపారులను ఇబ్బందుల పాలు చేస్తూ వారికి సంబంధించిన దుకాణాలను కూల్చివేసి వారు కన్నీళ్లు పెట్టుకునే విధంగా ఏడిపిస్తున్నాడని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన నిధులను చేసిన పనులను తానే చేసినట్లుగా చెప్పుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ కొబ్బరికాయలు కొడుతూ ఆనందం పొందుతున్నాడని విమర్శించారు.
రోడ్ల వెడల్పు పేరుతో కూల్చివేతలకు పాల్పడుతూ ఎవరికి ఒకరికి కూడా నష్టపరిహారం చెల్లించకుండా వారినే మళ్లీ కట్టుకోవాలని చెపుతూ అభివృద్ధి చేస్తున్నట్లు నటిస్తున్నాడని ఆరోపించారు. అంతర్గాం మండలంలో రూపాయలు 80 కోట్ల వ్యయంతో బీఆర్ఎస్ హయాంలో లిఫ్ట్ మంజూరు చేసి పూర్తి చేస్తే దానిని తానే సాధించినట్లుగా చెబుతూ కొబ్బరికాయ కొట్టి గొప్పలు చెప్పుకుంటున్నాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాత మున్సిపల్ కార్యాలయంలో పార్కింగ్ కాంప్లెక్స్ పనులు రెండేళ్లు అయినా ఇప్పటివరకు పూర్తి కాలేదని, నానా రకాలుగా ఎమ్మెల్యే ఇబ్బందుల పాలు చేస్తున్నాడని విమర్శించారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పరిపాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గోదావరిఖని పట్టణంలో 46 మైసమ్మ గుళ్లను కూల్చివేసిన సంఘటనపై మున్సిపల్ అధికారులను బాధ్యులను చేసినప్పటికి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. వీటన్నిటిపై తాను జారీ చేసిన చార్జీ షీట్ పై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మూల విజయ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.