జమ్మికుంట, ఆగస్టు 24: ‘ఇదిగో.. మీ గెల్లు శ్రీనివాస్ యాదవ్.. మీ గరీబు మట్టి బిడ్డ.. రెండే గుంటలున్నోడు.. వేల కోట్ల అధిపతి ఈటలతో పోటీ పడుతున్నడు. గెల్లు రేపటి భవిష్యత్తు నాయకుడు.. విద్యావంతుడు.. 130 కేసులున్న ఉద్యమకారుడు.. సీఎం కేసీఆర్ ఆశీర్వదించి పంపించిన ఈ ఉద్యమ నాయకుడిని గెలిపించడం మన బాధ్యత’ అని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హుజూరాబాద్ నియోజకవర్గ గంగపుత్రులు.. గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు మద్దతుగా ఆశీర్వాద సభ నిర్వహించారు. గంగపుత్ర నాయకుడు టంగుటూరి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సభకు మంత్రితోపాటు రామగుండం, ముషీరాబాద్ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ చిన్నోడని మాట్లాడుతున్నారని, అయితే 2004లో ఈటల రాజేందర్ ఇంతకంటే చిన్నగా ఉన్న సంగతి మరిచిపోవద్దన్నారు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి, రైతులు పండించే ధాన్యం కొనొద్దని సూచించే బీజేపీకి ఓటెందుకు వేయాలో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఫలం అందుకున్న వారు మత్స్యకారులేనని, గంగపుత్రుల కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు.
మీ బిడ్డగా ఆశీర్వదించండి: గెల్లు శ్రీనివాస్‌యాదవ్
‘2001 నుంచి పార్టీలో పనిచేస్తున్నా. ఉద్యమాలు చేసినా, దెబ్బలు తిన్నా, జైలుకెళ్లినా, నా మీద 130 కేసులున్నయ్. బీదోన్ని, నన్ను సీఎం కేసీఆర్ పంపించారు.. మీ బిడ్డగా ఇక్కడికొచ్చినా.. ఆశీర్వదించండి.. అండగా ఉంటా’అని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గంగపుత్రులకు విజ్ఞప్తి చేశారు. తన జీవితమంతా పేద ప్రజల కోసమే కొట్లాడానని, విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో పనిచేశానని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడిచిందని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని హామీలిచ్చినా, ఇప్పటి వరకు రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
గంగపుత్రుల మద్దతు.. రూ.25వేల విరాళం
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు హుజూరాబాద్ నియోజకవర్గ గంగపుత్రులు మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆశీర్వాద సభ ఏర్పాటుకు ముందు జమ్మికుంటలోని రైల్వే స్టేషన్ నుంచి ఒగ్గు కళాకారులు, మహిళల కోలాటాల మధ్య సభాస్థలి వరకు భారీ ర్యాలీ తీశారు. అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామ ని సభలో ప్రతినబూనారు. ఏకగ్రీవ తీర్మానం చేశారు. అందుకు సంబంధించిన ప్రతిని మంత్రి కొప్పుల, అభ్యర్థి గెల్లుకు అందజేశారు. అనంతరం ఎన్నికల ఖర్చు కోసం రూ.25,116 అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు మల్లయ్య, సమ్మిరెడ్డి, కోటి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.