హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : దళితులందరూ ఏకమై ద్రోహం చేసిన కాంగ్రెస్ సర్కారుకు బుద్ధిచెప్పాలని, జూబ్లీహిల్స్‌లో ఓడించి కండ్లు తెరిపించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనలో అణగారిన వర్గాలకు ఒరిగిందేమీలేదని విమర్శించారు. చేవెళ్ల డిక్లరేషన్ పచ్చిబూటకమని, అంబేద్కర్ అభయాస్తం కింద దళిత కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. విదేశీ విద్యానిధి పథకానికి మంగళంపాడిందని విమర్శించారు. సోమవారం తెలంగాణభవన్‌లో దళితబంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిళ్ల మహేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాటి నుంచి నేటి వరకు అడుగడుగునా దళితులను అవమానిస్తున్నదని ఆరోపించారు.
దళితబంధు కింద రూ.12 లక్షలు ఇస్తామని, అసైన్డ్ భూములపై హక్కులు కల్పిస్తామని అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత తీరని ద్రోహం చేస్తున్నదని కొప్పుల ఈశ్వర్ దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక్కనాడైనా దళితులకు ఇచ్చిన హామీలపై సమీక్షించారా? అని ప్రశ్నించారు. అణగారిన బిడ్డలంటే అంత చిన్నచూపు ఎందుకని నిలదీశారు. కేసీఆర్ పాలనలో విద్యార్థులతో కళకళలాడిన గురుకులాలు నేడు కళావిహీనంగా మారాయని పేర్కొన్నారు. సర్కారు నిర్లక్ష్యంతో రెండేండ్లలో 110 మంది గురుకుల విద్యార్థులు మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకే పరిమితం చేశారని ఆరోపించారు. ఎస్సీ ఉప కులాలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తామని ఆచరణలో విఫలమైందని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి రాజ్యాంగ నిర్మాతకు సముచిత గౌరవమిచ్చారని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మహావిగ్రహాన్ని బంధించి మహనీయుడిని అవమానించడం దురదృష్టకరమని కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో అలవికాని హామీలిచ్చి దళితజాతిని మోసం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటడిగే హక్కులేదని కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. రెండేండ్లలో ఏం ఉద్ధరించారని ప్రజల వద్దకు వెళ్తారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని దళితులు సంఘటితమై కాంగ్రెస్ అభ్యర్థిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే మోసాల పరంపరను కొనసాగిస్తుందనే విషయాన్ని విస్మరించవద్దని చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే ఎస్సీలకు న్యాయం జరుగుతుందని దళితబంధు సాధన సమితి అధ్యక్షుడు కోగిళ్ల మహేశ్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలోనే దళితులకు న్యాయం జరిగిందని, 38 వేల కుటుంబాలకు దళితబంధు ఇచ్చి వారి బతుకుల్లో వెలుగులు నింపారని కొనియాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన నియోజకవర్గం మధిరలోని దళితులకు రెండో విడత దళితబంధు నిధులు విడుదల చేయించి, ఇతర నియోజవర్గాల్లోని దళితులకు మాత్రం మొండిచెయ్యి చూపారని ఆవేదన వ్యక్తంచేశారు.