హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తేతెలంగాణ): దివ్యాంగులపై సీఎం రేవంత్రెడ్డి చిన్నచూపు చూస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ హయాంలో దివ్యాంగుల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ సర్కారు దివ్యాంగుల సంక్షేమానికి అనేక పథకాలు తెచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని 5లక్షల మంది దివ్యాంగులకు ప్రతినెలా రూ. 4,016 పింఛన్ కోసం ఏటా రూ. 1,800 కోట్లు ఖర్చు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు.
కేసీఆర్ తనకు ఆ శాఖ బాధ్యతలు అప్పగించి, వారికి సేవలందించే అవకాశం కల్పించారని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారి అభ్యున్నతికి పెద్దపీట వేశారని తెలిపారు. దివ్యాంగులను సకలాంగులు పెండ్లి చేసుకుంటే రూ. 50 వేలు ప్రోత్సాహకం, ఉద్యోగాల్లో 2శాతం, డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో 5శాతం రిజర్వేషన్లు వర్తింపజేసి అన్ని విధాలుగా న్యాయం చేశారని పేర్కొన్నారు. స్కూటీలు, ల్యాప్టాప్లు, ట్రైసైకిళ్లు ఇలా అనేక ఉపకరణాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిందని వెల్లడించారు.
కాంగ్రెస్ పాలనలో దివ్యాంగులకు తీరని అన్యాయం జరుగుతుందని కొప్పుల ఆరోపించారు. దివ్యాంగులకు నెలకు రూ. 6వేల పింఛన్ ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. సంక్షేమ బోర్డు పత్తాలేకుండా పోయిందని, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందని కొప్పుల స్పష్టంచేశారు.