హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లినా.. రాష్ర్టానికి తెచ్చేది గుండు సున్నానే అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. సీఎం 36 సార్లు కాదు.. వంద సార్లు ఢిల్లీకి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొన్నారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం కూలి 8 మంది కార్మికులు చిక్కుకుంటే సీఎం ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారని మండిపడ్డారు.
ప్రమాదం జరిగి 96 గంటలు దాటిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించలేక పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఓ వైపు సొరంగంలో సహాయక చర్యలు ముందుకు సాగడం లేదని, మరోవైపు రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రులు ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. శ్రీశైలంలో అగ్ని ప్రమాదం జరిగితే విషపు రాతలతో చెలరేగిపోయిన మేధావులు ఎస్ఎల్బీసీ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారాలు, ఢిల్లీ యాత్రలు మాని రేవంత్రెడ్డి సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని హితవు పలికారు.