ధర్మారం, అక్టోబర్ 26 : గత యాసంగి సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్న వడ్లకు బోనస్ డబ్బులు ఇంకెప్పుడు చెల్లిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. సన్న వడ్లకు రూ.1,300 కోట్లు బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ సర్కారు రైతులను దగా చేస్తున్నదని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆదివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి బాధలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ హయాంలో తాము తీవ్రంగా నష్టపోయామని, సకాలంలో యూరియా అందక దిగుబడి తగ్గిందని రైతులు వాపోయారు. అనంతరం కొప్పు ల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే క్వింటాల్ వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని వాగ్దానం చేసి, నేడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని మాటమార్చిందని మండిపడ్డారు.
యాసంగి సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల మంది రైతుల నుంచి 23.36 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేయగా, రూ.1,300 కోట్ల బోనస్ ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. పెద్దపల్లి పర్యటనలో సీఎం సన్న ధాన్యానికి బోనస్ చెల్లిస్తామని చెప్పడంతో రైతులు యాసంగిలో దొడ్డు వడ్లకు బదులుగా సన్న వడ్లు సాగు చేసి, బోనస్ రాక నష్ట పోయారని తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు రూ.39.67 కోట్లు, జగిత్యాల జిల్లాకు రూ.23 కోట్లు, ధర్మపురి నియోజకవర్గానికి రూ.13 కోట్ల బోనస్ బకాయిలపై మంత్రి లక్ష్మణ్‌కుమార్ సమాధానం చెప్పాలని నిలదీశారు. యాసంగి సీజన్లో తరుగు, తాలు పేరిట బస్తాకు 3కిలోల వరకు దోపిడీ చేస్తే ఆ సొమ్ము లక్ష్మణ్‌కుమార్ జేబులోకి వెళ్లిందో.. లేదా సీఎం జేబులోకి వెళ్లిందో మంత్రే సమాధానం చెప్పాలని నిలదీశారు. గతంలో చిన్నచిన్న సమస్యలకే కేంద్రాల్లో ఆందోళన చేసిన లక్ష్మణ్ కుమార్.. ఇప్పుడు అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని హితవు పలికారు.