కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 18: పేద విద్యార్థులు అభ్యసించే గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే వస్తువుల టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, ఈ విషయమై ప్రభు త్వం, మంత్రికి చర్చకు వచ్చే దమ్ముందా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. అవినీతిని నిరూపించేందుకు బీఆర్ఎస్ నుంచి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. అవినీతిపై ప్రశ్నిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నదని దుయ్యబట్టారు. అవినీతి జరుగలేదని నిరూపించుకునే అవకాశం లేకనే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. గురువా రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో కొప్పుల మీడియాతో మాట్లాడారు. పేద విద్యార్థులకు అందజేసే వస్తువుల విషయంలో అవినీతి చేయాలన్న ఆలోచన రావడమే అత్యంత దుర్మార్గమని అన్నారు. పథకం ప్రకారం అన్నీ సిద్ధం చేసుకొని టెండర్లు పిలిచారని ధ్వజమెత్తారు.
అవినీతి జరుగలేదని ప్రభుత్వం, మంత్రులు, కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని, మరి ప్రశ్నిస్తే ఎందుకు ఉలిక్కి పడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నిస్తే చాలు మంత్రులంతా జడుసుకుంటున్నారని అన్నారు. స్థానికంగా ఉన్న వ్యాపారులకు ఉపాధి కల్పించేందుకు ఈ టెండర్లను గతంలో ఎంఎస్ఎంజీ చిన్న సంస్థలకు ఇచ్చే పద్ధతి ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తమ జేబులు నింపుకొనేందుకు కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని విమర్శించారు. అంతా కుమ్మక్కై మాస్ టెండర్లు పిలిచి ఇతర రాష్ర్టాల కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టే కార్యక్రమం చేపట్టారని దుయ్యబట్టారు.
ఢిల్లీ, గుజరాత్, ఇతర రాష్ర్టాల వారికి టెండర్లు అప్పగించడంలో ఆంతర్యం ఏమిటనీ, ఇందులో రూ.200 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తున్నదని, దీనికి మంత్రి లక్ష్మణ్‌కుమార్ సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులు, నేతల స్వలాభాపేక్ష, కమీషన్ల కోసం ఇతర రాష్ర్టాల వారికి అప్పగించి ఇప్పటివరకు పాఠశాలలకు వస్తువులు సరఫరా చేసిన వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితికి తెచ్చారని ధ్వజమెత్తారు. ఇందులో ఏ మాత్రం నిజం లేకపోతే, అసలు అవినీతి అన్నదే జరుగకపోతే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఏమైనా విమర్శలు చేస్తే చాలు మంత్రి లక్ష్మణ్‌కుమార్ మాటిమాటికీ రాజీనామా చేస్తానని అంటున్నారని, అంత దమ్ము మంత్రికి ఉన్నదా? అని కొప్పుల ప్రశ్నించారు. వడ్ల కొనుగోలులో క్వింటాల్‌కు 7 నుంచి 8 కిలోలు తగ్గిస్తున్నారని.. ధర్మపురిలో ఇసుక మాఫియా నడుస్తున్నదని మాట్లాడితే.. వివరణ ఇవ్వాల్సిందిపోయి రాజీనామా చేస్తానని అంటున్నారని ఎద్దేవా చేశారు. టెండర్లలో అవినీతి జరిగిందని స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నదని, దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అవినీతిని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎక్కడికి వస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, ప్రవీణ్‌కుమార్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని, కులాన్ని అడ్డుపెట్టుకొని ఏం మాట్లాడినా నడువదని సూచించారు. సమావేశంలో సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్, బీఆర్ఎస్ నాయకులు రఘువీర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.