పత్తి రైతులకు మద్దతు ధర చెల్లించి కొనుగోళ్లను చేపట్టాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో రైతులు, శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటుంటే 8మంది బీజేపీ ఎంపీలు, 8మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నన్నారని నిలదీశారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, పుట్ట మధూకర్, దాసరి మనోహర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పత్తి రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. పత్తి రైతులకు మద్దతుగా మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నాలో పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా సీసీఐ అనేక కఠిన ఆంక్షలు విధించించినా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటున్నదని గంగుల మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో దొడ్డు వడ్లు కొనవద్దని కేంద్రం ఆదేశాలిచ్చినప్పుడు రాష్ట్ర క్యాబినెట్ మొత్తం ఢిల్లీ వెళ్లి 11 రోజులు అక్కడే ఉండి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కొనుగోళ్లు జరిగేలా చేశామని గుర్తుచేశారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 పేరిట మిల్లులపై ఆంక్షలు విధించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఒకే మిల్లుకు వెళ్లి పత్తి విక్రయించాలంటే రైతులు నాలుగైదు రోజులు పడిగాపులు పడాల్సి వస్తోందన్నారు. జీవీ రామకృష్ణారావు, నారాదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. తరుగు పేరుతో బస్తాకు అదనంగా రెండున్నర కిలోల చొప్పున క్వింటాల్‌కు ఐదు కిలోలు తూకం వేయడం ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకంపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవం తం చేయాలని కోరారు.