హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): పాలన చేతకాక కాంగ్రెస్ సర్కార్ పండుగ పూట జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఆయన బుధవారం ఓ ప్రకటనలో ఖండించారు. జర్నలిస్టుల ఇండ్లపై అర్ధరాత్రి దాడులు చేయడం, వారిని నేరస్తుల్లా తీసుకెళ్లడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అన్నారు.
పెన్నుల మీద.. గన్నులు పెడ్తారా?: ఎస్ నిరంజన్‌రెడ్డి
పెన్నుల మీద గన్నులు పెడ్తారా? ప్రసారమైన వార్తలో వాస్తవాలు బయట పెట్టాలి కానీ, జర్నలిస్టులను అరెస్టు చేస్తారా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టును ఆయన ఖండించారు. ఉద్యోగాల భర్తీ కోసం ప్రశ్నిస్తే నిరుద్యోగులను, యూరియా అడిగితే రైతులను, ఫీజు రీయింబర్స్మెంట్ అడిగితే విద్యార్థులను, ఉద్యోగ విరమణ చేసిన తర్వాత బెనిఫిట్స్ అడిగితే రిటైర్డ్ ఉద్యోగులను ఈ ప్రభుత్వం అరెస్టు చేసి బెదిరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎమర్జెన్సీని తలపించేలా రేవంత్‌పాలన: వేముల
హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులకు పాల్పడటం చాలా దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ సర్కార్ చెప్పుకున్న ప్రజాపాలనలో ప్రజాస్వామ్యంపై దాడులు నిత్యకృత్యంగా మారాయి అని మండిపడ్డారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపించేలా రేవంత్‌రెడ్డి పాలన నడుస్తున్నదని దుయ్యబట్టారు. వాళ్లు ఏమైనా టెర్రరిస్టులా? అని ప్రశ్నించారు. రాత్రి సమయంలోనే ఎన్టీవీ జర్నలిస్టులతోపాటు ఇతర మీడియా ప్రతినిధులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానం అని పేర్కొన్నారు. .
రేవంత్ వికృత రాజకీయాలకు ఇది పరాకాష్ట: దేశపతి
జర్నలిస్టుల అక్రమ అరెస్టులతో సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, మీడియా కార్యాలయంపై పోలీసులు దాడి చేయడం హీనమైన చర్య అని ఎమ్మెల్సీ దేశ్‌పతి శ్రీనివాస్ మండిపడ్డారు. మీడియా ఆఫీసుకి వెళ్లి ‘కంప్యూటర్లు సీజ్ చేస్తాం’ అని బెదిరించడం మీడియా గొంతు నొకడమేనని, పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షాలపై కేసులు, అరెస్టులు, దాడులు, నిలదీసిన ప్రజాసంఘాలపై అణచివేత ధోరణి పెరిగిపోయిందని ఆరోపించారు.
రాజకీయ క్రీడలో భాగంగానే అరెస్ట్‌లు: పల్లా
హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం.. తమ రాజకీయ క్రీడలో భాగంగా టీవీ చానళ్లకు లీకులు ఇచ్చి ఉపయోగించుకోవడం, తిరిగి వారి మీదనే సిట్ వేసి అర్ధరాత్రి అక్రమంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, తలుపులు బద్దలు కొట్టి నేరుగా ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ డ్రామాలే అని యావత్ ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీని తలపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని, అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి అని పల్లా డిమాండ్ చేశారు.
నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నారు: కర్నె
హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : ఇందిరాగాంధీ నియంతృత్వాన్ని వారసత్వంగా తీసుకొని రేవంత్‌రెడ్డి పాలన కొనసాగిస్తున్నాడు అని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ బుధవారం ప్రకటన ద్వారా ఆరోపించారు. మంత్రుల మధ్య ఉన్న విభేదాలు, ముఖ్యమంత్రి కనుసన్నల్లో వస్తున్న లీకుల ఆధారంగా టీవీ చానల్స్‌లో ప్రసారం అవుతున్న వార్తల ఆధారంగా అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రస్తుతం జర్నలిస్టుల అరెస్ట్‌ల వెనుక దుర్మార్గమైన కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
ఇదేనా ప్రజాపాలన?: గోసుల
ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను బీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్‌యాదవ్ తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్న ప్రజాపాలన ఇదేనా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలని అన్నారు. జర్నలిస్టులను వెంటనే విడుదల చేయడంతో పాటు వారిపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.