తెలంగాణచౌక్, అక్టోబర్ 30: కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆలస్యాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించి క్షమాపణలు కోరాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు( Koonanmneni Sambashivarao) సూచించారు. కరీంనగరంలోని పార్టీ కార్యాలయంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందంతో రాష్ట్రంలో అల్లర్లను సృష్టించి శాంతి భద్రతల సమస్య తీసుకువస్తున్నారన్నారు.
రెండు పార్టీలు చేస్తున్న కుట్రలను ఛేదించి కాంగ్రెస్ ప్రభుత్వం తన మనుగడను కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. మహిళలకు ఉచిత గ్యాస్, నెలకు రూ.2500, కల్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, ఒప్పంద ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో జాప్యం జరుగుతుందన్నారు.
రాష్ట్ర బడ్జెట్ మీద శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించి పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో..? చెప్పాలన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజలకు నష్టం చేయొద్దన్నారు. కాంగ్రెస్తో పొత్తు కొనసాగినా ప్రజా సమస్యలపై మాట్లాడతామని, ప్రజల పక్షాన నిలబడుతామని స్పష్టం చేశారు. వచ్చే నెల 26న పార్టీ వందేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గ్రామ మండల జిల్లా స్థాయిలో ఏడాది పాటు కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.